విలీన గ్రామాలకు నిధుల్లేవు!
ABN, Publish Date - Dec 12 , 2024 | 12:28 AM
పట్టణానికి చేరువగా ఉండడం ఆ గ్రామాలకు శాపం. ఆయా గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయడానికి ప్రభుత్వం నిర్ణయించినా ప్రస్తుతం మునిసిపాల్టీలో లేవు.. ఇటు పంచాయతీ పాలకవర్గాలు కూడా లేవు..
రికార్డులు మునిసిపాలిటీలో.. పంచాయతీలు కాదు!
జిల్లాలో 16 పంచాయతీలకు శాపం
అభివృద్ధిలో వెనుకబాటు
15వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించలేదు
ఆరేళ్లుగా పాలకవర్గ ఎన్నికలు జరగలేదు
భీమవరం రూరల్, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): పట్టణానికి చేరువగా ఉండడం ఆ గ్రామాలకు శాపం. ఆయా గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయడానికి ప్రభుత్వం నిర్ణయించినా ప్రస్తుతం మునిసిపాల్టీలో లేవు.. ఇటు పంచాయతీ పాలకవర్గాలు కూడా లేవు.. 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా కేటాయించలేదు. జిల్లాలో 16 గ్రామాలు అభివృద్ధిలో వెనుకబడిపోయాయి.
జిల్లాలో పట్టణాలకు చేర్చిఉన్న 16 గ్రామాలను మునిసిపాల్టీలలో విలీనం చేసేలా ఆరేళ్ల క్రితం అప్పటి టీడీపీ ప్రభు త్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై కొన్ని పంచాయతీలు కోర్టును ఆశ్రయించడం తో సమస్య జఠిలమైంది. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం విలీన ప్రక్రియను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో విలీన గ్రామాలకు శాపంగా మారింది. సకాలంలో విలీన ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఆ గ్రామాల పరిస్థితి దుర్భరంగా మారింది. పాలకవర్గాలు లేక అధికారుల పాలనలోనే కొనసాగుతున్నాయి. పాలకవర్గాలు లేని కారణంగా పంచాయతీలకు రావలసిన 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి. ఒక పంచాయతీ జనాభా ప్రాతిపదికన ఏడాదికి రూ.30 లక్షలపైనే నిధులు మంజూరయ్యేవి. దాదాపు ఐదేళ్లుగా 15వ ఆర్థిక సంఘం నిఽదుల కేటాయింపు లేదు. ఆయా గ్రామాల్లో కోట్ల రూపాయలతో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల అడ్రస్ లేదు. విలీన ప్రక్రియపై ఇప్పటికీ ఎటువంటి నిర్ణయం వెలువడలేదు.
మునిసిపాల్టీలకూ ఇదే పరిస్థితి
జిల్లాలో కీలకమైన భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు మునిసిపాల్టీలలో 16 గ్రామాల విలీన పక్రియ అప్పట్లో కొంత ముందుకు సాగినా కోర్టు ఆటంకాలతో నిలచిపోయిది. దీంతో 16 గ్రామాలతోపాటు, 4 మునిసిపాల్టీలకు పాలకవర్గాలు లేక నిధుల కేటా యింపు లేదు. కొన్ని గ్రామాల రికార్డులను మునిసిపాల్టీలకు అప్ప గించినా కోర్టు స్టే కారణంగా విలీనం లేదు. రికార్డులపరంగా ఆయా గ్రామాలు మునిసిపాల్టీల్లో కొనసాగుతున్నాయి. పన్నులు పంచాయతీలు వసూలు చేస్తున్నా మునిసిపాల్టీలలో బకాయిలు చూపించడంతో మునిసిపల్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
పంచాయతీలకు మరో ఆర్థిక దెబ్బ
పంచాయతీలకు ఆర్థికంగా అండగా ఉండే నిర్మాణాల ప్లాన్ అప్రూవల్ పంచాయతీల నుంచి కాకుండా 2019 నుంచి యుడా (ఏలూరు అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ) ఆధీనంలోకి వెళ్లింది. దీనితో పంచాయతీల ఆదాయానికి గండి పడింది. ప్లాన్ అప్రూవల్ యుడా మంజూరు చేస్తుంది. ఫీజులు కూడా అక్కడే చెల్లించాల్సి ఉంటుంది. జిప్లస్–2, ఎత్తు పది మీటర్ల వరకే పంచాయతీలు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. అంతకు మించిన నిర్మాణాలకు యుడా అనుమతి పొదాల్సిందే. కొనేళ్లుగా పంచాయతీలు కోట్లాది రూపాయల ఆదాయం కోల్పోయినట్లయింది. యుడా నుంచి గ్రామాలకు రావలసి నిధులు విడుదల కాకపోవడంతో పంచాయతీ ఆదాయం పడిపో యింది. ప్రస్తుతం పన్నుల వసూళ్లతోనే కాలక్షేపం చేస్తున్నారు. ఒక దశలో అభివృద్ధిలో దూసుకుపోయిన గ్రామాలు ఇప్పుడు ప్రభుత్వం అందించే నిధుల కోసం ఎదురు చూస్తున్నాయి.
నిధుల దుర్వినియోగం..!
మునిసిపాల్టీల్లో విలీన ప్రతిపాదిత గ్రామాలకు పాలకవర్గాలు లేకపోవడంతో దాదాపు ఆరేళ్లుగా ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించకపోవడంతో కొన్ని గ్రామాల్లో కిందిస్థాయి అధికారుల వల్ల కోట్లాది రూపాయలు దుర్వినియోగం అయ్యాయి. రాయలం పంచాయితీలో రూ.2,30,43,635 దుర్వినియోగమైనట్లు గుర్తించడంతోపాటు గతంలో పనిచేసిన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. చిన అమిరం పంచాయతీపై ఫిర్యాదులు రావడంతో విచారణ జరుగుతోంది. ఇలా విలీలన గ్రామాలకు అన్ని విధాలా ఇబ్బందులుగా మారాయి.
మంత్రి హామీ అమలుకు ఎదురుచూపులు
మునిసిపల్ శాఖా మంత్రి నారాయణ ఇటీవల జిల్లా పర్యటనకు రావడంతో విలీన గ్రామాల పరిస్థితులను ఆయనకు వివరించారు. దీనిపై నిర్ణయం తీసుకుని ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇంతవరకు నిర్ణయం వెలువడకపోవడంతో మంత్రి హామీ అమలు కోసం పలువురు ఎదురుచూస్తున్నారు.
Updated Date - Dec 12 , 2024 | 12:28 AM