మంచినీటి పథకాలకు మహర్దశ
ABN, Publish Date - Nov 09 , 2024 | 12:06 AM
స్వచ్ఛమైన తాగునీరు అందించేలా ప్రభుత్వ యంత్రాంగం దృష్టి సారించింది. జిల్లాలో మంచినీటి పథకాల సమస్యలు పరిష్కారం దిశగా అడుగులు వేస్తు న్నది.
జిల్లాలో ఓహెచ్‌ఆర్, ఆర్వో ప్లాంట్‌లకు మరమ్మతులు
రూ.23 కోట్లతో 921 పనులు చేపట్టాలని నిర్ణయం
వచ్చే ఏడాది మార్చి చివరికల్లా పనులు పూర్తి
భీమవరం రూరల్, నవంబరు 8(ఆంధ్రజ్యోతి):పల్లెల్లో స్వచ్ఛమైన తాగునీరు అందించేలా ప్రభుత్వ యంత్రాంగం దృష్టి సారించింది. జిల్లాలో మంచినీటి పథకాల సమస్యలు పరిష్కారం దిశగా అడుగులు వేస్తు న్నది. తాగునీటిని మొన్నటి వరకు అందించి మూలనపడ్డ ఆర్వో ప్లాంట్‌లను రన్నింగ్‌లోకి తీసుకువచ్చే ఏర్పాటు చేయమన్నారు. వచ్చే వేసవి నాటికి స్వచ్ఛమైన తాగునీరు గ్రామస్తులకు అందేలా చర్యలు చేపట్టనున్నారు. దీనిలో భాగంగా జిల్లాలో 921 పనులను అధికారులు గుర్తించారు. ఈ పనులు చేసేందుకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.23 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశారు. వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకల్లా 15 ఆర్థిక సంఘం నిధులు ఉపయోగించుకునే అవకాశం ఉన్నందున ఆ సమయంలోనే మంచినీటి పథకాల అభివృద్ధి పనులు చేయనున్నారు. దీంతో గ్రామాలలో తాగునీటి సమస్యను చాలా వరకు అధిగమించినట్లవుతుందని అధికార యంత్రాంగం ఆలోచనలో ఉంది. గ్రామాలలో కొన్నేళ్ళుగా అభివృద్ధికి నోచుకోక స్వచ్ఛమైన నీరందించలేని పథకాలుగా మారాయి. ఫిల్టర్ బెడ్‌ల మరమ్మతులు చేయక, చెరువుల మట్టి పూడికలు తీయక, ఓవర్ హెడ్ ట్యాంక్‌లు సరిలేక అపరిశుభ్రమైన నీరు అందించే నీటి పథకాలుగా మారాయి. దీంతో జిల్లాలోని 393 గ్రామాలలో ఎక్కువ గ్రామాల ప్రజలు తాగునీరు కొనుగోలుపైనే ఆధారపడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో 15వ ఆర్థిక సంఘం నిధులు అందుబాటులో లేవు. దీంతో పంచాయతీ పాలకవర్గాలు ఓహెచ్‌ఆర్ మరమ్మతులు, ఫిల్టర్ బెడ్‌లలో ఇసుక మార్పిడి వంటి పనులు చేయలేకపోయారు. పరిశుభ్రమైన తాగునీటిని అందించే పనులతోపాటు గ్రామాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా డ్రెయిన్‌ల ఏర్పాటు చేసేలా నిర్ణయించారు. అవసరం మేరకు డ్రెయిన్‌ల ఏర్పాటు ఈ 921 పనులలోనే గుర్తించారు.
Updated Date - Nov 09 , 2024 | 12:06 AM