ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

జగన్‌ చేసింది అప్పులే

ABN, Publish Date - Apr 01 , 2024 | 04:23 AM

జగన్‌ నిర్వాకంతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి ఖజానా ఖాళీ అయిందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు.

సీఎం నిర్వాకంతో ఖజానా ఖాళీ: బాబు

అప్పు తీసుకోకపోతే పూటైనా గడవదు

13 లక్షల కోట్ల అప్పు ఎవరు తీర్చాలి?

పింఛన్లు ఇవ్వడానికి డబ్బుల్లేక

టీడీపీపై నెపం మోపే యత్నం

ఈ సీఎం రాజకీయాలకు అర్హుడు కాదు

ఈ ఎన్నికలు ఏకపక్షం కావాలి!

ప్రజాగళంలో టీడీపీ అధినేత పిలుపు

తెలుగు ప్రజలు నేడు రాతియుగంలో ఉన్నారు. వారిని స్వర్ణయుగంలోకి తెచ్చేందుకు కూటమి అధికారంలోకి రావాలి. కులం, మతం, ప్రాంతం అని చూడకుండా సమర్థులు, పాలనాదక్షులను ఎన్నుకోవాలి.

- చంద్రబాబు

కూటమిదే విజయం.. వైసీపీ చిత్తుగా ఓడడం ఖాయం

మే 13న శని విరగడవుతుంది: చంద్రబాబు

బాపట్ల/కర్నూలు/ఒంగోలు, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): సీఎం

జగన్‌ నిర్వాకంతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి ఖజానా ఖాళీ అయిందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. అప్పు చేయకపోతే పూటగడవని స్థితికి ప్రభుత్వం చేరుకుందన్నారు. ప్రస్తుతం పింఛన్లు ఇవ్వడానికి కూడా డబ్బులేక.. ఆ నెపం టీడీపీపై మోపే ప్రయత్నం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. ప్రజాగళం యాత్రలో భాగంగా ఆదివారం ఆయన ప్రకాశం జిల్లా మార్కాపురం, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, బాపట్ల జిల్లా కేంద్రంలో జరిగిన భారీ బహిరంగ సభల్లో ప్రసంగించారు. జగన్‌ ఈ ఐదేళ్లలో రూ.13 లక్షల కోట్ల అప్పు చేశాడని, వాటిని ఆయన రోత పత్రిక తీరుస్తుందా.. భారతీ సిమెంట్స్‌ తీరుస్తుందా అని నిలదీశారు. ఈ సీఎం నమ్మించి గొంతు కోసే రకమని దుయ్యబట్టారు. రాయలసీమ బిడ్డనని చెప్పుకొంటూ ఈ ప్రాంతానికి ఏమీ చేయలేదన్నారు. ఈ ప్రాంతంలో ఒక్క ఇరిగేషన్‌ ప్రాజెక్టయినా పూర్తి చేశాడా.. కర్నూలు ప్రాంతానికి కనీసం నీళ్లు ఇవ్వాలన్న ఆలోచనైనా చేశాడా.. పేదలు, యువత భవిష్యత్‌ గురించి ఆలోచించాడా అని నిలదీశారు. ఆయన రాయలసీమ ద్రోహి అని.. ఒక్క ఓటు వేసినా మన నెత్తిన మనమే చెత్తవేసుకున్నట్లు అవుతుందని హెచ్చరించారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ కన్నా తెలంగాణలో తలసరి ఆదాయం 35శాతం అధికంగా ఉంటే 2014-19లో దానిని 27శాతానికి తగ్గేలా చేశామని.. జగన్‌ వచ్చాక తేడా 45 శాతానికి పెరిగిందని.. బటన్‌ నొక్కి పేదల సంక్షేమం చేస్తే ఇంత వ్యత్యాసం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. ఐదేళ్లుగా రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న శని మే 13తో విరగడైపోతుందని చెప్పారు. ఇంకా ఏమన్నారంటే..

ఫ్యాన్‌ చెత్తబుట్టలోకే..

ఈ ఎన్నికల్లో ఫ్యాన్‌ ముక్కలై చెత్తబుట్టలో పడేయడం ఖాయం. గత ఐదు రోజులుగా వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్నా. ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు. ఎన్నికల్లో కూటమి విజయం ఖాయమని తేలిపోయింది. వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోతుంది. అందులో అనుమానం లేదు. సంపద సృష్టించి, ఆదాయం పెంచి రూ.10తో వేలు సంపాదించే మార్గం ప్రజలకు నేను చూపిస్తా. జగన్‌కు అసలు విశ్వసనీయత అనేది ఉందా? కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నాడు.. మద్య నిషేధం చేస్తానన్నాడు.. అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్‌ రద్దు చేస్తానన్నాడు., ఏటా జాబ్‌ కేలెండర్‌, మెగా డీఎస్సీలను తెస్తానన్నాడు.. గద్దెనెక్కాక ఒక్కటైనా చేశాడా? బాబాయి హత్య కేసులో నిందితుడైన ఎంపీని పక్కన పెట్టుకుని బాధితులనే నిందితులుగా భావించేలా చేస్తున్నాడు. కూటమిని గెలిపించాలని ఇప్పటికే ప్రజలు నిర్ణయానికి వచ్చిన విషయం స్పష్టంగా కనిపిస్తోంది. జగన్‌లాంటి దుర్మార్గుడిని అసలు రాజకీయాల్లోనే లేకుండా చేయాలి. ఐదేళ్లుగా కొనసాగుతున్న అరాచక పాలనపై రచ్చబండలు, ఆర్టీసీ బస్సులు, టీ దుకాణాలు, రైల్వే స్టేషన్లు.. ఇలా అన్ని చోట్లా విస్తృతంగా చర్చ జరగాలి.

పొత్తుకు ఆద్యుడు పవన్‌

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని, విధ్వంసకర వైసీపీ పాలన అంతం కావాలన్న ఉద్దేశంతో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి పొత్తుకు ఆద్యుడు పవన్‌. మూడు పార్టీలు కలవడం మాకోసం, మా రాజకీయాల కోసం కాదు. ప్రజలు గెలవాలి, ఏపీ బాగుండాలన్న ఉద్దేశంతోనే! ఈ విషయాన్ని ప్రజలంతా గుర్తించాలి. మేం కలిస్తే జగన్‌ ఎందుకు కంగారుపడుతున్నాడు? ముస్లింలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో రెండుసార్లు ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నా.. ఏ ఒక్క ముస్లిం హక్కులకూ భంగం కలగకుండా చూశాం. మా పిల్లల భవిష్యత్‌ నీవే చంద్రన్నా అంటూ ఈ రోజు ముస్లింలు ముందుకొస్తున్నారు.

‘మిచౌంగ్‌’ ముంచేసినా రైతులను ఆదుకోలేదు

డిసెంబరులో మిచౌంగ్‌ తుఫాన్‌ వచ్చి రైతాంగం చితికిపోయింది. అన్నదాతలను ఆదుకోలేని చెత్త ప్రభుత్వం ఇది. రైతంటే కనీసం గౌరవం లేదు. ధాన్యం కొనే దిక్కులేదు. రైతుల పరామర్శకు వచ్చేటప్పుడు పరదాలు కట్టుకుని రెడ్‌ కార్పెట్‌ వేయించుకున్న ఘనత ఈ ముఖ్యమంత్రిది. ఆకాశంలో చక్కర్లు కొట్టాడు తప్ప రైతులను ఆదుకోలేదు. అమరావతి, పోలవరం రాష్ట్రానికి రెండు కళ్లు. రాజధానిని ధ్వంసంచేశాడు. పోలవరం ప్రాజెక్టును గోదావరిలో కలిపేశాడు. 80శాతం పనులు జరిగిన వెలిగొండలో మిగిలిన 20శాతం చేయకుండానే ఓట్ల కోసం రిబ్బన్‌ కత్తిరించాడు. ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన నేనే తిరిగి అధికారంలోకి వచ్చాక నీళ్లు ఇస్తా. మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేస్తా. ఈ సీఎం విచిత్రమైన మనిషి. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూనే వారిని బాధితులుగా చేయడంతో పాటు పథకాలనూ అటకెక్కించాడు. ఈ మధ్య వివేకం అనే సినిమా వచ్చింది. ఆ సినిమా చూడండి ప్యాలెస్‌ కుట్రలు ఎలాంటివో తెలిసిపోతుంది. ఆ సినిమా ఎవరు తీశారో గానీ.. కుట్రలు చాలా స్పష్టంగా చూపించారు.

రూ.250 కోట్ల ఆస్తి ఉన్న పేద..

బుట్టా రేణుక పేద మహిళ అంటూ శుక్రవారం ఇదే ఎమ్మిగనూరులో జరిగిన సభలో జగన్‌ ప్రకటించారు. అవును.. ఆమె రూ.250కోట్ల ఆస్తి ఉన్న పేదరాలే. 2014లో అఫిడవిట్‌లో ఆమె చూపించిన ఆస్తులే అంత ఉన్నాయి. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఇసుక, మట్టి, మద్యమే కాదు, చివరకు మంత్రాలయం దేవుడిని కూడా మింగేశాడు. అలాంటివ్యక్తికి సీటిచ్చి ఆయన పేదవాడని చెప్పాడు. 1983లో వాళ్ల నాన్న టీడీపీలోనే ఉన్నాడు. యుద్ధాల్లో సామంతరాజులను చంపేసి రాజ్యాన్ని పంచుకున్నట్లు ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి సోదరులు నాయకులను అణగదొక్కి గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం పంచుకున్నారు.. దోచుకుంటున్నారు. సేవాభావంతో రాజకీయాల్లోకివచ్చి మూడు దశాబ్దాలకు పైగా మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాలో పనిచేస్తోంది. అలాంటి మాగుంట శ్రీనివాసులరెడ్డిని అవమానించిన జగన్‌.. ఎర్రచందనం దొంగ, రౌడీయిజం ద్వారా డబ్బు సంపాదించే వ్యక్తిని ఇక్కడ ఎంపీగా పోటీకి నిలిపాడు. మనకు రౌడీలు, స్మగ్లర్లు కావాలో.. సేవ చేసే నాయకులు కావాలో ప్రజలు ఆలోచించాలి.

నేనే డ్రైవర్‌గా ఉంటా...

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి నేనే డ్రైవర్‌గా ఉండి సురక్షితంగా గమ్యం చేరుస్తా. 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఇస్తాం. మహిళలకు మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితం. నిరుద్యోగ భృతి రూ.3,000 ఇస్తాం. ఆక్వా రైతులకు రూ.1.50కే కరెంటు ఇస్తాం. టీడీపీ హయాంలో మొత్తం 11 సార్లు డీఎస్పీ వేశాం. ఐదేళ్లలో ఒక్కసారి కూడా వేయలేని దద్దమ్మ ప్రభుత్వమిది. ఏపీపీఎస్సీలో ఉద్యోగాలు అమ్ముకున్నారు. మేమొచ్చాక ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ చేపడతాం. చిందరవందరగా మిగిలిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడతాం.

టీడీపీ డీఎన్‌ఏలోనే బీసీ

టీడీపీ పేదల పక్షపాతి. మన పార్టీ డీఎన్‌ఏలోనే బీసీ ఉంది. బీసీలను గుండెల్లో పెట్టుకునే పార్టీ. కురుబ సామాజిక వర్గానికి చెందిన సామాన్య ఎంపీటీసీ నాగరాజుకు కర్నూలు లోక్‌సభ టికెట్‌ ఇచ్చాం. మంత్రాలయంలో వాల్మీకులకు చెందిన రాఘవేంద్రకు, ఆలూరులో వీరశైవలింగాయత్‌కు చెందిన వీరభద్ర గౌడ్‌కు, పత్తికొండలో ఈడిగ కులానికి చెందిన కేఈ శ్యాంబాబుకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చాం. పొత్తుల్లో భాగంగా బీజేపీకి ఆదోని సీటు ఇస్తే ఆ పార్టీ కూడా వాల్మీకులకు చెందిన డాక్టర్‌ పీవీ పార్థసారథికి టికెట్‌ఇచ్చింది. కోడుమూరులో ఎస్సీ మాదిగ కులానికి చెందిన బొగ్గుల దస్తగిరికి, కర్నూలులో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన టీజీ భరత్‌కు టికెట్‌ ఇచ్చాం. ఎమ్మిగనూరులో టీడీపీ డీఎన్‌ఏ కలిగిన బీవీ కుటుంబానికి చెందిన బీవీ జయనాగేశ్వరరెడ్డికి టికెట్‌ ఇచ్చాం. సామాజిక న్యాయం అంటే ఇదీ! మనం అధికారంలోకి రాగానే అధికారికంగా కుల గణన చేసి దామాషా ప్రకారం నిధులు కేటాయించి బీసీలకు న్యాయం చేస్తాం. బోయలను (వాల్మీకులు) ఎస్టీలుగా కురవ, బుడగ జంగాలను ఎస్సీలుగా మార్చేందుకు కట్టుబడి ఉన్నాం. రూ.5 వేల కోట్లతో ఆదరణ పథకం తీసుకువచ్చి పనిముట్లు అందిస్తాం. చంద్రన్న బీమాతో 10లక్షల ఆర్థిక సహాయం, శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు, బీసీ భవనాలు, కమ్యూనిటీ హాల్స్‌ నిర్మాణం.. అన్నీ చేస్తాం. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం. మాల, మాదిగ, రెల్లీ వర్గాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం. చేనేతలను అన్ని రకాలుగా ఆదుకున్నది మేమే. చేనేత మగ్గం ఉంటే 200 యూనిట్లు, పవర్‌లూమ్‌ ఉంటే 500 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇస్తాం. ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ పెట్టి వారిని ఆర్థికంగా ఆదుకుంటాం. ఎమ్మిగనూరు కేంద్రంగా టెక్స్‌టైల్‌ పార్కు తీసుకొస్తాం. బీసీ డిక్లరేషన్‌లో భాగంగా 50 ఏళ్లు పైబడిన బీసీలకు ఇంట్లో ఎంత మంది ఉన్నా ప్రతి ఒక్కరికీ రూ.4 వేల చొప్పున పెన్షన్‌ ఇస్తాం.

బాబాయిని చంపించిన.. కోడికత్తి డ్రామా ఆడిన.. కంటైనర్లలో డబ్బులు పంపించే.. అక్రమ కేసులు బనాయించే వ్యక్తి సీఎంగా కావాలా? అసలిలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా వస్తాడని నా రాజకీయ జీవితంలో ఏనాడూ ఊహించలేదు.

తమిళనాడులో అమ్మ క్యాంటీన్లు, కర్ణాటకలో ఇందిరా క్యాంటీన్లను అక్కడి ప్రభుత్వాలు కొనసాగించాయి. ఇక్కడ మాత్రం జగన్‌ వచ్చాక అన్న క్యాంటీన్లు తీసివేసి పేదల కడుపు కొట్టాడు.

జగన్‌ విశ్వసనీయత లేని దుర్మార్గుడు. ఇలాంటి వ్యక్తికి రాజకీయాల్లో ఉండే అర్హతే లేదు. అందుకే ప్రజలంతా పోలింగ్‌ వరకూ ఇదే ఉత్సాహాన్ని చూపించి ఎన్నికలు ఏకపక్షంగా జరిగేలా చూడాలి.

- చంద్రబాబు

Updated Date - Apr 01 , 2024 | 04:23 AM

Advertising
Advertising