పింక్ డైమండ్ ఎక్కడ జగన్?
ABN, Publish Date - Apr 23 , 2024 | 04:27 AM
2019 ఎన్నికలకు ఏడాది ముందు నుంచి నడిపిన ‘పింక్ డైమండ్ పాయె’ నాటకమే దీనికి నిదర్శనం.
సినిమా టైటిల్: ‘పింక్ డైమండ్ పాయె’
మూల కథ, నటన: రమణ దీక్షితులు
సహ నటుడు: విజయసాయి రెడ్డి
వాయిద్య సహకారం: జగన్ రోత పత్రిక
స్ర్కీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం వైసీపీ సెంట్రల్ ఆఫీస్
కోడికత్తి ఒక బూటకం! బాబాయ్ హత్యపై తప్పుడు నాటకం! వీటన్నింటికంటే ముందే... 2019 ఎన్నికలు మరో ఏడాది ఉండగానే ఒక భారీ నీచ నాటకానికి వైసీపీ తెర లేపింది. అదే... పింక్ డైమండ్! ప్రజల మనసులను కలుషితం చేసి, అనుమానపు బీజాలు నాటి... దాని ఆధారంగా అధికారంలోకి రావడమే ఈ నాటకం లక్ష్యం.
2019 ఎన్నికల ముందు చేసిన రచ్చ మరిచారా?
నాడు అధికారం కోసం టీడీపీ, టీటీడీపై బురద
శ్రీవారి పింక్ డైమండ్ పోయిందంటూ డ్రామా
రమణ దీక్షితులుతో ఆరోపణలు, అభాండాలు
విజయసాయి, జగన్ రోత పత్రిక అదనపు అల్లికలు
అలాంటి వజ్రమే లేదని తేల్చిన విచారణ కమిషన్లు
అధికారంలోకి రాగానే ‘ముఠా’ మొత్తం గప్‌చుప్
‘ఎన్నికల్లో గెలిచేందుకు ఎంత నీచానికైనా సిద్ధం’.. ఇదీ వైసీపీ సిద్ధాంతం!
2019 ఎన్నికలకు ఏడాది ముందు నుంచి నడిపిన ‘పింక్ డైమండ్ పాయె’ నాటకమే దీనికి నిదర్శనం. ఎవరు పడితే వారు చెబితే జనం నమ్మరని... ఏకంగా అప్పటి టీటీడీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులునే రంగంలోకి దించారు. ఆయన... ‘పింక్ డైమండ్’ అనే కథ అల్లారు. ‘వైసీపీ క్యాంప్’ దర్శకత్వంలో అద్భుతమైన నటనా కౌశలాన్ని ప్రదర్శించారు. విజయసాయి రెడ్డి ‘సహాయ నటుడి’గా వ్యవహరించారు. జగన్ రోత పత్రిక ఈ స్ర్కీన్‌ప్లేకు ‘అదనపు’ అల్లికలు జత చేసింది. వెరసి... ‘పింక్ డైమండ్’ పేరుతో గల్లీ నుంచి ఢిల్లీ దాకా దాదాపు ఏడాదిపాటు రచ్చ చేశారు.
అసలా డైమండే లేదు..
‘పింక్ డైమండ్’ ఉందని రమణ దీక్షితులు... లేనేలేదని టీటీడీ అధికారులు చెబుతుండటంతో దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ విద్యాసాగర్ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రభుత్వం నియమించిన రెండు విచారణ కమిషన్లు 1952 నుంచీ టీటీడీ రికార్డులు పరిశీలించి.. పింక్ డైమండ్ అనేది లేదని నిర్ధారించాయి. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణ అవసరం లేదని హైకోర్టు 2021 ఫిబ్రవరి 7న తీర్పు చెప్పింది.
నీచ నాటకానికి ఇలా బీజం
వజ్ర, వైఢూర్య, మరకత, మణి, మాణిక్యాదులు పొదిగిన అపురూప ఆభరణాలు ఎన్నెన్నో శ్రీవారికి ఉన్నాయి. నాటి రాజుల నుంచి నేటి భక్తుల వరకు కానుకలు సమర్పిస్తూనే ఉన్నారు. అయితే.... ఇందులో ‘పింక్ డైమండ్’ అనేది ఒకటుందని, అది మాయమైపోయిందని 2018 మే నెలలో అప్పటి ఆలయ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు చెన్నైలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. శ్రీవారికి అలంకరించే ఆభరణాల్లో పింక్ డైమండ్ 2001 నుంచీ కనిపించడం లేదన్నారు. వెంకటేశ్వరుడితో ముడిపడిన వ్యవహారం కావడం... పైగా ప్రధానార్చకుడే ఈ ఆరోపణలు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రమణ దీక్షితులు అంతటితో ఆగలేదు. రకరకాల వేదికలపై రకరకాల ఆరోపణలు చేస్తూ వచ్చారు. జెనీవాలో రూ.500 కోట్లకు అమ్ముడుపోయిన డైమండ్ శ్రీవారిదే కావచ్చనంటూ నాటకాన్ని రక్తి కట్టించారు. ‘‘శ్రీవారికి పల్లవ, చోళ రాజులతోపాటు కృష్ణ దేవరాయలు, మైసూరు మహారాజు వంటి నాటి పాలకులు కానుకలుగా సమర్పించిన ఆభరణాలు కనిపించడం లేదు. ఇపుడు దేవుడికి అలంకరిస్తున్న నగలన్నీ ఇటీవల కానుకలుగా అందినవే’’ అని కూడా చెప్పారు. ‘పింక్ డైమండ్’ కథకు ‘నేల మాళిగ’ అధ్యాయాన్నీ జోడించారు. ‘‘2017 డిసెంబరు 8వ తేదీన పోటు శాలను మూసివేశారు. నేను వెళ్లి... చిన్న రంధ్రం ద్వారా లోపలికి చూశాను. అక్కడంతా భూకంపం వచ్చినట్లుగా ఉంది. వంటగదిలో నిధులు ఉన్నాయనే అక్కడ తవ్వకాలు జరిపారు’’ అంటూ రమణదీక్షితులు మరో కథ చెప్పారు. అంతేకాదు... సీఎం (చంద్రబాబు), మేడమ్ అనుమతితోనే ఈ పనులు చేసినట్లు జేఈవో చెప్పారని... ‘మేడమ్’ ఎవరో తనకు తెలియదని ఈ నాటకాన్ని మరింత రక్తి కట్టించారు.
వంత పాడిన విజయసాయి
రమణ దీక్షితులు ఇలా ఆరోపణలు చేయగానే... వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి వాటిని అలా అందుకున్నారు. హైదరాబాద్, వైజాగ్, ఢిల్లీ తదితర చోట్ల ఆయన ప్రెస్‌మీట్లు పెట్టి టీడీపీ సర్కారుపై ఆరోపణలు చేశారు. మరో అడుగు ముందుకేసి... శ్రీవారికి చెందిన కొన్ని విలువైన ఆభరణాలు, పింక్ డైమండ్ చంద్రబాబు వద్దే ఉన్నాయని తేల్చేశారు. కేంద్ర బలగాలతో వెంటనే చంద్రబాబు నివాసంలో తనిఖీలు చేపడితే అవన్నీ దొరుకుతాయన్నారు. దీనిపై చీటికీ మాటికీ ట్విటర్‌లో అవాకులూ చెవాకులూ పోస్ట్ చేస్తూ వచ్చారు. రమణ దీక్షితులు, ఇటు విజయసాయి మైకుల ముందు నోటికొచ్చినట్లు చెప్పిన కథలను... జగన్ రోత పత్రిక మరింత మసాలా జోడించి ప్రచురించింది. ఉత్సవాల సందర్భంగా శ్రీవారికి అలంకరించిన పింక్ డైమండ్ పగిలి కింద పడిపోయిందని, దానినే చంద్రబాబు తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నారని, ఆ తర్వాత జెనీవాలో రూ.500 కోట్లకు అమ్ముకున్నారని రకరకాల ప్రచారాలు చేసింది.
లేదూ, కాదూ అని మొత్తుకున్నా..
శ్రీవారి నగల జాబితాలో పింక్ డైమండ్ పొదిగిన నగ ఏదీ లేదని టీటీడీ పదేపదే వివరణ ఇచ్చింది. అప్పటి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అంతకుముందు ఈవోగా పని చేసిన ఎల్వీ సుబ్రమణ్యం దీనిపై స్పష్టత ఇచ్చారు. ‘పింక్ డైమండ్ లేనే లేదు. గరుడ సేవలో భక్తులు విసిరిన నాణేలు తగిలి కెంపు ఒకటి ముక్కలైంది. దాని విలువ కేవలం 50 రూపాయలని అప్పటి టీటీడీ ఈవో ఐవైఆర్ కృష్ణారావు స్వయంగా నిర్ధారించారు. కానీ... అది పింక్ డైమండ్ అంటూ రమణ దీక్షితులు తప్పుదారి పట్టిస్తున్నారు’’ అని టీటీడీ మాజీ సీవీఎ్‌సవో రమణ కుమార్ కూడా స్పష్టం చేశారు. మిరాశీ వ్యవస్థ రద్దయినప్పటి నుంచీ తామే శ్రీవారి పోటులో ప్రసాదాలు చేస్తున్నామని, రమణ దీక్షితులు చెబుతున్నట్లుగా అక్కడ తవ్వకాలే జరగలేదని పోటు కార్మికులు తెలిపారు. శ్రీవారికి ఆగమోక్తంగా కైంకర్యాలు జరుగుతున్నాయని ఇతర అర్చకులు స్పష్టం చేశారు. అయినా సరే... రమణ దీక్షితులు, విజయసాయి రెడ్డి ఒక వ్యూహం ప్రకారం ఆరోపణలు చేస్తూనే వచ్చారు.
చెరి వంద కోట్లకు పరువునష్టం కేసు
రమణ దీక్షితులు, విజయసాయి రెడ్డి ఆరోపణలతో టీటీడీ ప్రతిష్ఠ దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. దానికి తోడు నాటి సీఎం చంద్రబాబుపై కూడా ఆరోపణలు చేయడంతో ప్రభుత్వ ప్రతిష్ఠకూ ఇబ్బందిగా మారింది. దీంతో టీటీడీ వెంటనే నష్ట నివారణ చర్యలకు దిగింది. వయో పరిమితి కారణం చూపుతూ రమణ దీక్షితులను ప్రఽధాన అర్చకుడి పదవి నుంచీ తొలగించింది. ఆయనతో పాటు విజయసాయిరెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. వారు స్పందించకపోవడంతో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా టీటీడీతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన కారణంగా రమణ దీక్షితులు, విజయసాయిరెడ్డిలపై టీటీడీ చెరి రూ.వంద కోట్లకు పరువు నష్టం దావా వేసింది. నిబంధనల ప్రకారం రూ.2 కోట్లను డిపాజిట్‌గా చెల్లించింది.
అధికారంలోకి రాగానే గప్‌చుప్
2018 మే నుంచీ 2019 మే దాకా.... ఎన్నికల ఏడాదంతా ‘పింక్ డైమండ్’ను వైసీపీ వదల్లేదు. తప్పుడు ప్రచారం చేస్తూనే ఉంది. దీంతోపాటు అనేక కుట్రలు, కుయుక్తులు పన్ని... అధికారంలోకి వచ్చింది. అంతే... ‘పింక్ డైమండ్ పాయె’ చిత్రాన్ని అంతటితో ముగించింది. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక అటు రమణ దీక్షితులుకానీ, ఇటు విజయసాయిరెడ్డికానీ దీనిపై నోరు మెదపలేదు. అసలా విషయమే తెలియనట్లుగా మౌనంగా ఉండిపోయారు. వారిద్దరిపై అంతకుముందు టీటీడీ వేసిన పరువు నష్టం దావాను వెనక్కి తీసుకోవాలని 2020 ఫిబ్రవరి 29న జరిగిన పాలకమండలి సమావేశంలో తీర్మానం చేశారు. టీటీడీ న్యాయవాదులు అదే ఏడాది సెప్టెంబరు 14న కోర్టులో కేసు వాపసు తీసుకుంటున్నట్లు (ఐఏ నంబరు 158-2020) పిటిషన్ వేశారు. కానీ... కోర్టుకు డిపాజిట్‌గా చెల్లించిన రూ.2 కోట్లకు బాధ్యత ఎవరు తీసుకుంటారని బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి, రాయలసీమ పోరాటసమితి నేత నవీన్‌కుమార్‌రెడ్డి తదితరులు గట్టిగా ప్రశ్నించడం... తెలంగాణకు చెందిన హిందూ జనశక్తి అనే సంస్థ కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇంప్లీడ్ పిటిషన్ వేయడంతో టీటీడీ ఇరకాటంలో పడింది. కేసు వాపస్ తీసుకుంటామని దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది.
రమణ దీక్షితులుకు ‘శిక్ష’
పింక్ డైమండనేదే లేనపుడు అది మాయమైందని నానా యాగీ చేసిన రమణ దీక్షితులుపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. కానీ... ఒకరకంగా చెప్పాలంటే ఆ దేవదేవుడే ఆయనకు తగిన శాస్తి చేశారు. టీటీడీకి వ్యతిరేకంగా ఆరోపణలు చేసి శ్రీవారి ఆలయ ప్రఽధాన అర్చకత్వం కోల్పోయిన రమణ దీక్షితులు... వైసీపీ రాగానే మళ్లీ ఆలయంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈసారి ప్రధాన అర్చకుడిగా కాకుండా అంతకంటే ముఖ్యమైన ఆగమ సలహా మండలి సభ్యుడిగా నియమితులయ్యారు. తప్పుడు ఆరోపణలతో టీటీడీ పరువు ప్రతిష్ఠలు దెబ్బతీశారంటూ రూ.వంద కోట్లకు పరువునష్టం దావా వేసి... మళ్లీ అదే వ్యక్తికి కీలక బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వచ్చాయి. ఈవో ధర్మారెడ్డికీ, రమణ దీక్షితులుకీ మధ్య పొసగలేదు. ఆలయంలో ఆయనకు ప్రాధాన్యం లభించలేదు. వైసీపీ కోసం రచ్చ చేసిన రమణ దీక్షితులును అదే ప్రభుత్వం పక్కన పెట్టింది. ప్రస్తుతం అడపాదడపా సోషల్ మీడియాలో టీటీడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, కాసేపటికి వాటిని తొలగించడం... వంటివి చేస్తున్నారు. వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆయనకూ విలువ ఇవ్వడంలేదు.
దీక్షితులు ‘వెనుక’ వైసీపీ
పింక్ డైమండ్ ఎత్తుకెళ్లారు, నేల మాళిగలు తవ్వేశారు అంటూ హైదరాబాద్‌లో రమణ దీక్షితులు పెట్టిన ప్రెస్ మీట్‌లో... ఆయన వెనుకే వివాదాస్పద వ్యక్తి, క్రైస్తవ మత ప్రచారంతో సంబంధాలున్న బోరుగడ్డ అనిల్ కుమార్ కూడా పాల్గొనడం విశేషం. బోరుగడ్డపై అనేక కేసులున్నాయి. ‘జగన్ నాకు బంధువు’ అని చెప్పుకొంటారు. అలాంటి వ్యక్తితో రమణ దీక్షితులుకు సంబంధమేమిటి, టీటీడీపై ఆరోపణలు చేసేందుకు ఆయనను వెనక ఎందుకు పెట్టుకున్నారు అని అప్పట్లో అంతా ఆశ్చర్యపోయారు.
పచ్చదనంపై పిచ్చితనం
‘అశోకుడు చెట్లు నాటించెను’ అని చదువుకున్నాం! భవిష్యత్తులో ‘జగన్మోహన్ రెడ్డి చెట్లను నరికించెను’ అని చదువుకోబోతున్నాం! అదేం పిచ్చితనమో కానీ... జగన్మోహన్ రెడ్డి పచ్చదనంపై పగబట్టారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి అడుగు బయటపెడితే చాలు... పచ్చని చెట్లకు మూడినట్లే! ఆయన పర్యటించే మార్గంలో ఒక్క పచ్చటి చెట్టూ ఉండేందుకు వీల్లేదంతే! కొమ్మలను ట్రిమ్ చేయడం కాదు... ఏకంగా మొదలుదాకా నరికి పడేయడమే! ఇలా ఈ ఐదేళ్లలో జగన్ కారణంగా గొడ్డలివేటు పడిన చెట్లకు లెక్కే లేదు. విచిత్రమేమిటంటే... ఎన్నికల షెడ్యూలు వెలువడిన తర్వాత కూడా ఈ దారుణం కొనసాగుతూనే ఉంది.
Updated Date - Apr 23 , 2024 | 04:27 AM