వెంకటరామిరెడ్డిని కాపాడుతున్నదెవరు?
ABN, Publish Date - Sep 16 , 2024 | 03:33 AM
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డిపై కూటమి ప్రభుత్వం కూడా వల్లమాలిన ప్రేమ కనబరుస్తోందా...?
వైసీపీ వీరవిధేయుడికి రక్షణ
ఇప్పటివరకూ ఎలాంటి చర్యలూ లేవు
అనుమానాలకు తావిస్తున్న ప్రభుత్వ వైఖరి
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డిపై కూటమి ప్రభుత్వం కూడా వల్లమాలిన ప్రేమ కనబరుస్తోందా...? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాంటి సంకేతాలే కనిపిస్తున్నాయి.! ఎన్నికల కోడ్ సమయంలో వెంకట్రామిరెడ్డి నిబంధనలకు విరుద్ధంగా బద్వేలు, కడప, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో వైసీపీకి అనుకూలంగా రాజకీయ ప్రచారం చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఎన్నికల సంఘం ఆయనను సస్పెండ్ చేయాలని అప్పటి సీఎస్ జవహర్ రెడ్డికి ఆదేశాలిచ్చింది. అప్పుడు కూడా వారం రోజుల పాటు ఆ ఫైలు అలాగే ఉంచారు. ‘ఆంధ్రజ్యోతి’లో కథనం రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేశారు. తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. అయినప్పటికీ వెంకట్రామిరెడ్డిపై నిబంధనల ప్రకారం అభియోగాలు నమోదు చేయలేదు. పైగా... ఏకంగా ఆయన సస్పెన్షన్ ఎత్తివేతను ప్రతిపాదిస్తూ ఫైలు పెట్టారు. పంచాయతీరాజ్ శాఖలో అడిషనల్ సెక్రటరీగా ఉన్న హనుమంతరెడ్డి ఈ ఫైలు పెట్టారు. అయితే.. ఆ శాఖ ముఖ్యకార్యదర్శి ఆదేశాల మేరకే హనుమంతరెడ్డి ఆ ఫైలు పెట్టినట్టు తెలుస్తోంది. విషయం బయటకు పొక్కడంతో ఆ ఫైలును ఆపేసి, వెంకట్రామిరెడ్డిపై అభియోగాలు నమోదు చేస్తూ ఆగస్టు 21న జీవో ఇచ్చారు.
10 రోజుల్లో దీనిపై వెంకట్రామిరెడ్డి వివరణ ఇవ్వకపోతే శాఖాపరమైన చర్యలు నేరుగా తీసుకుంటామని ఆ జీవోలో పేర్కొన్నారు. సెప్టెంబరు 1తో ఆ పది రోజుల గడువు ముగిసింది. అది దాటి పదిహేను రోజులైనా వెంకట్రామిరెడ్డిపై శాఖాపరంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇన్ని రోజులైనా చర్యలు తీసుకోకపోవడం, దీనికంటే ముందు సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రతిపాదించడం... ఇవన్నీ చూస్తుంటే వెంకట్రామిరెడ్డిని కాపాడేందుకు గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెంకట్రామిరెడ్డి విషయంలో జరుగుతున్న పరిణామాలు ఆ శాఖ ముఖ్యకార్యదర్శికి ఎందుకు తెలియడం లేదో ఆశ్చర్యంగా ఉంది. పక్కా వైసీపీ భక్తుడు, జగన్‌కి వీరవిధేయుడు, ఎన్నికల్లో నిబంధనలకు విరుద్ధంగా పబ్లిక్‌గా వైసీపీకి ప్రచారం చేసిన వ్యక్తిని ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇంతలా కాపాడుతున్నది ఎవరన్న దానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఆయనను కాపాడడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులకు ప్రభుత్వం ఎలాంటి సంకేతాలిస్తోంది..? జగన్ హయాంలో రెచ్చిపోయి టీడీపీ శ్రేణులపై దాడులకు పాల్పడిన వైసీపీ నాయకులపై చంద్రబాబు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదన్న అసంతృప్తి తీవ్రంగా ఉంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర పరిపాలనకు కేంద్రమైన సచివాలయంలో కూడా ఒక వైసీపీ వీరభక్తుడిని ఇంతలా కాపాడాల్సిన అవసరం ఏముందో ప్రభుత్వ పెద్దలకే తెలియాలి.
Updated Date - Sep 16 , 2024 | 03:34 AM