ఎందరి పుస్తెలు తెంచావు జగన్?
ABN, Publish Date - Apr 24 , 2024 | 03:35 AM
ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి ఏం చేశావని నీకు ఓటెయ్యాలంటూ సీఎం జగన్‌ను పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిలదీశారు.
మద్య నిషేధమని చెప్పి మద్యం వ్యాపారివయ్యావు
జనానికి చివరకు చిప్ప, గుండు సున్నా మిగిల్చావు
పులి కడుపున పిల్లి పుట్టింది.. జగన్‌పై ఎద్దేవా
రాష్ట్రంలో దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం
తెనాలి, కర్లపాలెం బహిరంగ సభల్లో షర్మిల ధ్వజం
తెనాలి/బాపట్ల, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి ఏం చేశావని నీకు ఓటెయ్యాలంటూ సీఎం జగన్‌ను పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిలదీశారు. మంగళవారం బాపట్ల జిల్లా చీరాలలో పర్యటించిన ఆమె బాపట్ల మండలం కర్లపాలెం, గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన బహిరంగ సభల్లో మాట్లాడారు. ‘మద్యాన్ని నిషేధించకుండా ఓటు అడగనన్నావు.. చివరకు సర్కారీ మద్యంతో లైసెన్స్‌డ్ మద్యం వ్యాపారిగా మారిపోయావు. కల్తీ మద్యం నువ్వే తయారుచేసి రాష్ట్రంలో 25శాతం అదనపు మరణాలతో ఎందరో అక్కచెల్లెమ్మల పుస్తెలు తెగడానికి కారణమయ్యావు’’ అని షర్మిల విమర్శించారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి జగన్ అనే పిల్లి పిల్ల పుడితే, తాను పులి పిల్లనని, ఇక్కడ జగన్‌రెడ్డి చేస్తున్న అరాచకాలను ప్రశ్నించడానికి వచ్చానని చెప్పారు. సొంత చిన్నాన్నను చంపిన వ్యక్తిని వెంటేసుకుని ఊరేగుతున్న జగన్... ఇంక జనానికి ఏం చేస్తాడని ప్రశ్నించారు. ‘‘సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ కేలెండర్ వస్తుందని జగన్ హామీ ఇచ్చాడు. ఆయన అధికారంలోకి వచ్చాక ఐదు సంక్రాంతులు వచ్చివెళ్లాయి. ఒక్కసారి కూడా జాబ్ కేలెండర్ రాలేదేం?’’ అని షర్మిల నిలదీశారు. ‘రైతులను జగన్ ఎక్కడ ఆదుకున్నారు? వైఎస్ జపం చేస్తూ గెలిచిన జగన్ కనీసం డ్రిప్పునకు కూడా సబ్సిడీ ఇవ్వలేకపోయాడు. ఏటా రూ.3,000కోట్లతో ఏర్పాటు చేస్తానన్న ధరల స్థిరీకరణ నిధి ఎక్కడ? పెట్టుబడి రాయితీకి ఏటా రూ.4వేల కోట్లు తీసి పక్కన పెడతానన్నావ్... గత ప్రకృతి విపత్తులకు 70వేల హెక్టార్లలో పంట దెబ్బతింటే పరిహారం ఇవ్వలేదు. మొన్న గుంటూరు దగ్గర దెబ్బతిన్న పంటకు రూ. 50వేలు రైతులకిచ్చి ఇదిగో నీ కన్నీరు తుడిచానంటావా? ఇవన్నీ చూస్తే నీకంటే కుంభకర్ణుడే నయమనిపించడం లేదా? ఐదేళ్లు పడుకుని ఎన్నికలొచ్చాయని మళ్లీ సిద్ధమంటూ ఊరేగడానికి బయటికొచ్చావా’ అంటూ షర్మిల ఎద్దేవా చేశారు. సిద్ధం అంటే దేనికి సిద్ధమో అర్థం కావటంలేదన్నారు. ‘మద్యం వ్యాపారం మరింత పెంచుకుని జనాన్ని చంపడానికా సిద్ధం.... పోలవరం, రాజధాని, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టటానికి సిద్ధమా? రూ.8లక్షల కోట్లు అప్పులు చేయటానికా సిద్ధం... లిక్కర్, శాండ్, ల్యాండ్ మాఫియా, ఇవి చాలవన్నట్టు హత్యా రాజకీయాలు చెయ్యడానికి సిద్ధమయ్యావా?’ అని నిలదీశారు.
దోపిడీదారులకే మళ్లీ టికెట్లు
‘రాష్ట్రంలో దొంగల రాజ్యం... దోపిడీ రాజ్యం నడుస్తోంది. దోచుకున్న వాళ్లకే మళ్లీ టికెట్లు ఇచ్చారు. మనకు చెప్పుకోవడానికి రాజధాని లేదు గానీ చేతిలో చిప్ప మాత్రం ఉంది’’ అని షర్మిల మండిపడ్డారు. కుంభకర్ణుడు ఆరు నెలల నిద్ర పోతాడు... ఆరు నెలలు పనిచేస్తాడు... కానీ ఈ సీఎం మాత్రం ఐదేళ్లూ నిద్రలోనే ఉన్నాడని ఎద్దేవా చేశారు. ‘‘ఓటు మీ చేతిలో ఉన్న ఆయుధం. మీరు వేయబోయే ఓటు మీ పిల్లల భవిష్యత్తును నిర్దేశించడంతో పాటు రాష్ట్ర గమనాన్ని కూడా నిర్ణయిస్తుంది. అందుకే ఆలోచించి ఓటు వేయండి’’ అని ఓటర్లను కోరారు. ఐదేళ్ల పాలనలో ప్రత్యేక హోదా గురించి జగన్ ఒక్కరోజైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. జగన్ పులి కాదని, బీజేపీ చేతిలో పిల్లిగా మారిపోయారని షర్మిల ఎద్దేవా చేశారు. ‘బాపట్ల ఎమ్మెల్యే ఇసుక మొదలుకొని భూ దందాలతో విపరీతంగా దోచుకున్నారు. పేదలకిచ్చిన ఇళ్ల స్థలాలను కూడా తక్కువ మొత్తానికి తీసుకున్నారు. తిరిగి ఆయనకే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆయనపై ఇన్ని ఆరోపణలు ఉంటే ఒక్క విచారణ అయినా వేశారా?’ అని ఆమె ప్రశ్నించారు.
షర్మిలకు స్వల్ప అస్వస్థత...
చీరాల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ ఇంటి నుంచి షర్మిల ర్యాలీగా బయలుదేరారు. ఆమంచికి స్వయంగా బీ-ఫాంను అందించారు. ర్యాలీ చీరాలలోని గడియార స్థంభం వద్దకు చేరుకునే సరికి మధ్యాహ్నం 2గంటలు దాటింది. ఎండ తీవ్రతతో జనం తిరుగుముఖం పట్టారు. ఉదయం నుంచి ర్యాలీలో ఉన్న షర్మిల స్వల్ప అస్వస్థతకు లోనవడంతో చీరాల బహిరంగ సభలో మాట్లాడకుండానే బాపట్లకు వచ్చారు. అక్కడి ఇంజనీరింగ్ కళాశాలలో సాయంత్రం వరకు విశ్రాతి తీసుకున్నారు. సాయంత్రం 5 గంటలకు కర్లపాలెం బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు. కాగా, సభలో జనం రాకుండా అడ్డుగా పెట్టిన బారికేడ్లను తీసేయాలని ఆమె పోలీసులకు సూచించారు. అయినా పోలీసులు స్పందించకపోవడంతో ‘నన్ను తీయమంటారా... మీరు తీస్తారా..’ అని ఆమె అనడంతో ఎట్టకేలకు వాటిని తొలగించారు.
Updated Date - Apr 24 , 2024 | 03:35 AM