Jogi Ramesh : ‘అందరూ’ ఎవరు జోగి!?
ABN, Publish Date - Aug 18 , 2024 | 04:12 AM
అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్, ఆయన తనయుడు రాజీవ్‌లు.. తమకు ఏ పాపం తెలియదని, అమాయకులమని,
అగ్రి గోల్డ్ భూములు కొన్నది మీ కుటుంబం ఒక్కటే కదా?
సీఐడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న వాటిని నిషేధ జాబితాలో చేర్చారు
సామాన్యులకు రిజిస్ట్రేషన్ అసాధ్యం అధికారంతో చుట్టబెట్టింది మీరు కాదా
సర్వే నంబరు 88లో భూమిపై ప్రకటన
స్వీయ సవరణతో సర్వే నంబరు 87లో భూములు రిజిస్ట్రేషన్ చేయించలేదా?
అన్నీ తెలిసి చక్కబెట్టింది నిజం కాదా?
(విజయవాడ-ఆంధ్రజ్యోతి)
అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్, ఆయన తనయుడు రాజీవ్‌లు.. తమకు ఏ పాపం తెలియదని, అమాయకులమని, అందరూ కొన్నట్టే తాము కూడా ఆ భూములు కొన్నామని చెబుతున్నా.. వెలుగులోకి వచ్చిన వాస్తవాలు మాత్రం తండ్రీతనయులు అంత అమాయకులు కాదని, ఉద్దేశ పూర్వకంగానే అక్రమంగా అగ్రిగోల్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని స్పష్టమైంది. ఆ భూమిని కబ్జా చేయాలన్న దురాలోచనతో.. పక్కా ప్రణాళికతోనే జోగి కుటుంబ సభ్యులు 2,160 చదరపు గజాల అగ్రి భూములను రిజిస్టర్ చేయించుకున్నారని తేలిపోయింది. ఆ తర్వాత వాటిని విక్రయించారని రికార్డులే చెబుతున్నాయి.
ఎక్కడి నుంచి ఎక్కడి దాకా!
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గ్రామీణ ప్రాంతంలోని అంబాపురంలో రెవెన్యూ సర్వే(ఆర్‌ఎస్) నంబరు 87లో మొత్తం 18.33 ఎకరాల పట్టా భూమి ఉంది. ఈ భూమి యజమానుల్లో ఒకరైన గరికపాటి జయలక్ష్మికి 2.81 ఎకరాలు ఉండగా దీనిలో 3,120 గజాలను అల్లూరి కృష్ణమూర్తికి విక్రయించారు. ఆయన ఆ భూమిని అగ్రిగోల్డ్ యజమానులైన అవ్వ ఉదయభాస్కర్‌తోపాటు మరో 8 మందికి 2293.05 గజాలను 9 ప్లాట్లుగా విడగొట్టి విక్రయించారు. అగ్రి గోల్డ్ యజమానులు కొనుగోలు చేసిన 2293.05 గజాలను 2018, 2019ల్లో జీవో నంబర్లు 117, 133 ద్వారా సీఐడీ అటాచ్ చేసింది. సీఐడీ అటాచ్ చేసుకున్న భూములను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిషేధిత జాబితాలో పేర్కొంటారు. ఈ భూములను కొనుగోలు చేయడం సామాన్యులకు సాధ్యం కాదు. అలాంటి భూములపై జోగి కుటుంబ సభ్యులు కన్నేశారు.
లేని భూమిని కొన్నట్టు
అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూముల చెంత ఆర్‌ఎస్ నంబరు 88లో మొత్తం 7.47 ఎకరాల పట్టా భూమి ఉంది. దీనిలో 4 ఎకరాలను బొమ్ము వెంకట చలమారెడ్డి కొన్నారు. దీనిలో ఒక ఎకరాను 2001లో పోలవరపు మురళీ మోహన్‌కు బొమ్ము విక్రయించా రు. మురళీ మోహన్ 2003లో ప్లాట్లు వేసి విక్రయించారు. అయితే, 2014లో అదే భూమిని మహాలక్ష్మి ప్రాపర్టీస్ అండ్ ఇన్వె్‌స్టమెంట్స్ తరఫున అడుసుమిల్లి మోహనరామదాసు అనే వ్యక్తి తాను కొనుగోలు చేసినట్లు పత్రాలు సృష్టించారు. కానీ, మురళీమోహన్ తాను 2014లో ఎవరికీ విక్రయించలేదని, నకిలీ ఆధార్ కార్డుతో ఆ రిజిస్ట్రేషన్ జరిగిందని ఆరోపిస్తున్నారు. ఇక అడుసుమిల్లి మోహనరామదాసు నుంచే 2022లో జోగి వెంకటేశ్వరరావు, జోగి రాజీవ్ 2,160 చదరపు గజాల భూమిని కొన్నారు. భూమి కొనుగోలు చేసే సమయంలో సర్వే నంబరు 88కి సంబంధించి ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్(ఈసీ) పరిశీలిస్తే ఆ భూమికి ఎవరెవరు యజమానులన్నది స్పష్టంగా తెలిసిపోతుంది. అదేమీ చేయకుండా డబుల్ రిజిస్ట్రేషన్ జరిగిన భూమిని మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఏ విధంగా కొనుగోలు చేస్తారన్నది ప్రశ్న.
మోసపూరితంగానే..
సర్వే నంబరు 88లో 2,160 గజాల భూమిని కొనుగోలు చేస్తున్నామని, దానిపై ఏమైనా వివాదాలు ఉంటే తెలియజేయాలని జోగి రాజీవ్, జోగి వెంకటేశ్వరరావు పత్రికా ప్రకటన ఇచ్చారు. ఆ సమయంలోనైనా సర్వే నంబరు 88లో ఉన్న లొసుగులు వారికి తెలిసి ఉండాలి. అయితే, అగ్రిగోల్డ్ భూములపై కన్నేసిన వారు ఉద్దేశ పూర్వకంగానే సర్వే నంబరు 88లో భూమిని కొన్నారు. అక్కడి నుంచి ముందు అనుకున్న విధంగా స్వీయ సవరణ దస్తావేజు డ్రామాతో అగ్రిగోల్డ్ భూమికి ఎసరు పెట్టారు. సర్వే నంబరు 88లో 2160 గజాలను 2022లో రిజిస్టర్ చేయించుకున్న జోగి కుటుంబ సభ్యులు అనంతరం దస్తావేజుల్లో తప్పు దొర్లిందని పేర్కొంటూ 2023లో అగ్రి భూములున్న సర్వే నంబరు 87ను అసలు నంబరుగా పేర్కొన్నారు. ఇవి నిషేధిత జాబితాలో ఉన్న విషయాన్ని నున్న సబ్ రిజిస్ట్రార్.. జోగి కుటుంబానికి తెలియజేసి ఉంటారు. కానీ, అగ్రి గోల్డ్ భూములు కబ్జా చేయాలన్న ఆలోచనతో ఉన్న వారు సబ్ రిజిస్ట్రార్‌పై ఒత్తిడి తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నది స్పష్టంగా తెలుస్తోంది. అనంతరం అదే ఏడాది మేలో ఆ భూమిని వైసీపీ కార్పొరేటర్ చైతన్యరెడ్డి కుటుంబ సభ్యులకు విక్రయించారు.
‘‘ఆ అగ్రిగోల్డ్ ఏమిటో.. దాని ఆస్తుల గోలేమిటో మాకు తెలీదు. అందరూ ఎలా కొన్నారో మేం కూడా అలానే కొన్నాం. పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి.. అధికారులు నివేదిక ఇచ్చిన తర్వాత ఆ భూమిని కొనుగోలు చేశాం’’- ఈ నెల 13న జోగి రాజీవ్‌ను అరెస్టు చేసిన సమయంలోను, ఈ నెల 16న మంగళగిరి డీఎస్పీ కార్యాలయం వద్ద మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలు ఇవి.
‘‘అందరూ కొన్నట్టే మేం కూడా అగ్రి భూములు కొన్నాం. ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగానే నన్ను అరెస్టు చేయించింది’’ - ఈ నెల 13న ఇబ్రహీంపట్నంలో తనను అరెస్టు చేసిన సమయంలో జోగి రాజీవ్ చేసిన వ్యాఖ్యలు ఇవి. కానీ, వాస్తవాలు మాత్రం వేరుగా ఉన్నాయి. జోగి కుటుంబం అక్రమాలు బట్టబయలయ్యాయి.
Updated Date - Aug 18 , 2024 | 09:19 AM