YS Jagan : విద్యార్థులకు రూ.3,500 కోట్లు బకాయిపెట్టి పోయి!
ABN, Publish Date - Dec 05 , 2024 | 05:25 AM
అధికారంలో ఉండగా ప్రజలకు.. గద్దెదిగాక సొంత పార్టీ నేతలకు అబద్ధాలు చెప్పడం వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు అలవాటుగా మారింది.
ఫీజులపై ఆందోళనకు జగన్ పిలుపు
జనవరి 4లోగా చెల్లించాలని గడువు
ధాన్యం కొనుగోళ్లపై ఈ నెల 27న ధర్నా
ఆ తర్వాత విద్యుత్ చార్జీలపై నిరసన
సంక్రాంతి తర్వాత జనంలోకి మాజీ సీఎం
అప్పటిలోగా ప్రభుత్వ వ్యతిరేకత పెంచాలని
వైసీపీ నేతలకు ఆ పార్టీ అధినేత ఆదేశం
అమరావతి, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): అధికారంలో ఉండగా ప్రజలకు.. గద్దెదిగాక సొంత పార్టీ నేతలకు అబద్ధాలు చెప్పడం వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు అలవాటుగా మారింది. అధికారం కోల్పోయేనాటికి విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.2,100 కోట్లు, వసతి దీవెన కింద మరో 1,400 కోట్లు.. మొత్తం రూ.3,500 కోట్లు బకాయిపెట్టి పోయిన ఆయన.. తాను ఫీజు బకాయిలన్నీ చెల్లించేశానంటూ పార్టీ నేతల ముందు బొంకేశారు. ఇక ఐదేళ్లలో 9 సార్లు కరెంటు చార్జీలు పెంచిన ఆయన.. తాను పైసా పెంచలేదని.. చంద్రబాబు సీఎం అయ్యాక మళ్లీ బాదుడే బాదుడు మొదలుపెట్టారని అమాంతం అబద్దం ఆడేశారు. బుధవారమిక్కడ తాడేపల్లి ప్యాలె్‌సలో వైసీపీ ముఖ్య నేతలు, రాష్ట్ర కార్యదర్శులు, జిల్లా నాయకులతో ఆయన సమావేశమయ్యారు. సంక్రాంతి తర్వాత తాను ప్రజల్లోకి వస్తానని.. ఆలోపు ఆందోళనలతో రాష్ట్రాన్ని వేడెక్కించాలని పిలుపిచ్చారు.
జనవరి నాలుగో తేదీలోగా ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోతే ఆందోళన చేద్దామన్నారు. వైసీపీ హయాంలో రైతుల నుంచి నేరుగా ధాన్యం కొన్నామని.. కూటమి ప్రభుత్వం వచ్చాక దళారీలు చేరారని ఆరోపించారు. ఈ అంశంపై ఈ నెల 27న కలెక్టరేట్ల వద్ద ధర్నా చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత 15 రోజులకు విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ డిస్కంలు, ఎస్‌ఈ కార్యాలయాల వద్ద ధర్నా చేయాలన్నారు. వాస్తవానికి ఇప్పుడు పెరిగిన సర్దుబాటు చార్జీల పాపం ఆయనదే. ఆయన సీఎంగా ఉండగానే.. 2022-23 సంవత్సరానికి సంబంధించి రూ.8,648 కోట్ల మేర ప్రజల నుంచి సర్దుబాటు చార్జీలు వసూలు చేసుకుంటామని డిస్కంలు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ (ఏపీఈఆర్‌సీ)ని కోరాయి. అలాగే 2023-24కి సంబంధించి మరో రూ.11,626 కోట్ల వసూలుకు ఇంకో పిటిషన్ వేశాయి. జగన్ అధికారంలో ఉండగా.. వీటిపై నిర్ణయం తీసుకోని కమిషన్ చైర్మన్.. పదవీకాలం పూర్తయ్యేముందు ప్రజాభిప్రాయ సేకరణ పెట్టి రెండు భారీ బాదుళ్లకూ ఆమోదముద్ర వేశారు. తన పాపాన్ని కప్పిపుచ్చుకునేందుకు జగన్ ఈ నెపాన్ని చంద్రబాబు ప్రభుత్వంపై మోపుతూ ఆందోళనకు సిద్ధమయ్యారు. సంక్రాంతి తర్వాత తాను లోక్‌సభా స్థానం కేంద్రంగా జిల్లాల్లో పర్యటిస్తానని పార్టీ నేతలకు ఆయన చెప్పారు. ఆలోపు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగేలా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే అప్పటికి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కమిటీలు వేయాలని సూచించారు.
Updated Date - Dec 05 , 2024 | 05:26 AM