YS Jagan: ఇవాళ గుంటూరు జిల్లా జైలుకు వైఎస్ జగన్.. ఎందుకంటే?
ABN, Publish Date - Sep 11 , 2024 | 08:51 AM
కుటిల రాజకీయాలకు పర్యాయపదమైన వైఎస్ జగన్ ఇవాళ (బుధవారం) మరో ఫక్తు రాజకీయ పరామర్శకు సిద్ధమయ్యారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ అయ్యి గుంటూరు జిల్లా జైలులో ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను ఆయన పరామర్శించనున్నారు.
గుంటూరు: కుటిల రాజకీయాలకు పర్యాయ పదమైన వైఎస్ జగన్ ఇవాళ (బుధవారం) మరో ఫక్తు రాజకీయ పరామర్శకు బయలుదేరబోతున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ అయ్యి గుంటూరు జిల్లా జైలులో ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను ఆయన పరామర్శించనున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సురేశ్‌తో పాటు ఇవాళ క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ ఈద సాంబిరెడ్డిని కూడా పరామర్శించనున్నారు. ఇటీవల జరిగిన ఓ ఘర్షణలో సాంబిరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అందుకే జగన్ ఓదార్చనున్నారని సమాచారం.
గుంటూరు జైల్లో ఉన్న నందిగం సురేశ్..
కాగా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు ఇటీవలే అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో ఉన్న ఆయనను అదుపులోకి తీసుకొని మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. నందిగం సురేశ్‌తో పాటు అరెస్టయిన మరికొందరిని కూడా జైలుకు పంపించారు.
అరెస్ట్ ముందు ముందస్తు బెయిల్ కావాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. అరెస్టు భయంతో సురేశ్ సెల్‌ఫోన్ స్విచాఫ్ చేసుకున్నారు. అంతేకాదు అజ్ఞాతంలోకి కూడా వెళ్లిపోయారంటూ వార్తలు వచ్చాయి. దీంతో మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా సురేశ్ ఎక్కడ ఉన్నారో పోలీసులు గుర్తించారు. ఆచూకీ గుర్తించిన ఏపీ పోలీసులు హైదరాబాద్ వెళ్లి అక్కడ అరెస్ట్ చేశారు. పారిపోతున్నారని సమాచారం రావడంతో ఈ మేరకు పోలీసులు అప్రమత్తం అయిన విషయం తెలిసిందే.
Updated Date - Sep 11 , 2024 | 09:12 AM