రూ.1.14 లక్షల కోట్లు వెనక్కి
ABN, Publish Date - Nov 03 , 2024 | 02:00 AM
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) గత నెలలో స్టాక్ మార్కెట్ నుంచి 1,350 కోట్ల డాలర్ల (రూ.1.13,859 కోట్ల్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఇప్పటివరకు ఒక నెల రోజుల వ్యవధిలో సెకండరీ మార్కెట్ నుంచి ఎఫ్‌పీఐలు ఉపసంహరించుకున్న...
అక్టోబరులో ఎఫ్‌పీఐ పెట్టుబడుల ఉపసంహరణ
మార్కెట్ చరిత్రలో ఇప్పటివరకిదే అత్యధికం..
ముంబై: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) గత నెలలో స్టాక్ మార్కెట్ నుంచి 1,350 కోట్ల డాలర్ల (రూ.1.13,859 కోట్ల్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఇప్పటివరకు ఒక నెల రోజుల వ్యవధిలో సెకండరీ మార్కెట్ నుంచి ఎఫ్‌పీఐలు ఉపసంహరించుకున్న అత్యధిక నిధుల రికార్డు ఇదే. అయితే, ఈ అక్టోబరులో ఎఫ్‌పీఐలు ప్రైమరీ మార్కెట్లో మాత్రం రూ.19,842 కోట్ల పెట్టుబడులు పెట్టారు. దీన్ని మినహాయిస్తే, దేశీయ మార్కెట్ నుంచి ఎఫ్‌పీఐల నికర పెట్టుబడుల ఉపసంహరణ రూ.94,017 కోట్లుగా నమోదైంది. కొవిడ్ సంక్షోభ కాలంలో (2020 మార్చి) వెనక్కి తీసుకున్న రూ.61,973 కోట్ల నికర పెట్టుబడుల కన్నా కూడా ఇది అధికం. ఎఫ్‌పీఐల భారీ అమ్మకాల కారణంగా గతనెలలో ఈక్విటీ సూచీలు ఆల్‌టైం రికార్డు గరిష్ఠ స్థాయిల నుంచి 8 శాతం మేర క్షీణించాయి.
అక్టోబరులో ఎఫ్‌పీఐ నిధుల ఉపసంహరణ లోటును దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐ) భర్తీ చేశారు. క్యాష్ మార్కెట్లో డీఐఐలు రూ.98,400 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు.
అక్టోబరు 31తో ముగిసిన ‘సంవత్ 2080’’లో డీఐఐలు క్యాష్ మార్కెట్లో ఏకంగా రూ.4.64 లక్షల కోట్ల పెట్టుబడులు గుమ్మరించారు. ఈ జనవరి, ఏప్రిల్, మే, అక్టోబరులో ఎఫ్‌పీఐల భారీ అమ్మకాల కారణంగా ఏర్పడిన నష్టాలను డీఐఐల పెట్టుబడులు పూడ్చగలిగాయి.
ఈ జనవరి-సెప్టెంబరు మధ్యకాలానికి నికర పెట్టుబడులు రూ.లక్ష కోట్ల స్థాయిలో ఉన్నాయి. అక్టోబరులో ఏకంగా రూ.1.14 లక్షల కోట్లు వెనక్కి తీసుకోవడంతో గడిచిన 10 నెలల కాలానికి వారి నికర పెట్టుబడులు గణనీయంగా తగ్గి రూ.6,593 కోట్లకు పరిమితమయ్యాయి.
అధిక రాబడులపై ఆశతోనే...
ఎఫ్‌పీఐలు తాము వెనక్కి తీసుకున్న పెట్టుబడులను అమెరికన్ బాండ్ మార్కెట్లోకి, చైనా స్టాక్ మార్కెట్లోకి తరలించారు. అమెరికా డాలర్ విలువతో పాటు బాండ్ల రిటర్నుల రేటు గణనీయంగా పెరగడం, చైనా ఈక్విటీలు ఆకర్షణీయ ధరకు లభిస్తుండటం ఇందుకు ప్రధాన కారణం. దేశీయ మార్కెట్ సూచీలతో పాటు అనేక కంపెనీల షేర్లు ఆల్‌టైం గరిష్ఠాల వద్ద ట్రేడవుతుండటం, రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల సీజన్ నిరాశాజనకంగా ఉండడంతో ఎఫ్‌పీఐలు పెద్దఎత్తున లాభాల స్వీకరణకు పాల్పడ్డారని విశ్లేషకులు పేర్కొన్నారు.
తాత్కాలిక పరిణామమే.. : ఎఫ్‌పీఐల పెట్టుబడుల ఉపసంహరణ తాత్కాలికమేని మార్కెట్ నిపుణులన్నారు. భారత ఈక్విటీల్లో ఎఫ్‌పీఐలు మొత్తం 80,000 కోట్ల డాలర్ల (రూ.67.20 లక్షల కోట్లు) పెట్టుబడులను కలిగి ఉన్నారని.. గతనెలలో వెనక్కి తీసుకున్నది కేవలం 1.7 శాతమేనని వారు చెప్పారు. కాబట్టి, ఈ విషయంపై చిన్న ఇన్వెస్టర్లు అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అంతేకాదు, స్టాక్ మార్కెట్ మొత్తం సంపదలో కేవలం 0.1 లేదా 0.2 శాతమేనని వారన్నారు. చాలా వరకు దేశీయ కంపెనీల షేర్లు అధిక ధరల వద్ద ట్రేడవుతున్న నేపథ్యంలో మార్కెట్ సూచీలు భవిష్యత్‌లో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే, ప్రస్తుతం ఈ మాత్రం దిద్దుబాటు ఆవశ్యకమేనని వారు అభిప్రాయపడ్డారు. కాగా, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి నేపథ్యంలో ఎఫ్‌పీఐల అమ్మకాలు మరికొంత కాలం కొనసాగవచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వె్‌స్టమెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్ కుమార్ అన్నారు. అయితే, మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మెరుగైతే మన మార్కెట్లోకి ఎఫ్‌పీఐల పెట్టుబడులు మళ్లీ పుంజుకోవచ్చని అబాకస్ అసెట్ మేనేజ్‌మెంట్ ఎల్‌ఎల్‌పీ వ్యవస్థాపకులు సునీల్ సింఘానియా ఆశాభావం వ్యక్తం చేశారు.
Updated Date - Nov 03 , 2024 | 02:00 AM