పదేళ్లలో ఫార్మా ఎగుమతులు 13,000 కోట్ల డాలర్లు
ABN, Publish Date - Jul 05 , 2024 | 05:26 AM
భారత ఫార్మా ఎగుమతులు వచ్చే పదేళ్ల కాలంలో 13000 కోట్ల డాలర్లకు (రూ.10.85 లక్షల కోట్లు) చేరనున్నాయని ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ అసోసియేషన్ (ఇప్కా) ప్రెసిడెంట్ డాక్టర్ బి.పార్థసారథి రెడ్డి అన్నారు...
ప్రస్తుతం 2500 కోట్ల డాలర్లు; తెలంగాణ వాటా 35 శాతం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): భారత ఫార్మా ఎగుమతులు వచ్చే పదేళ్ల కాలంలో 13000 కోట్ల డాలర్లకు (రూ.10.85 లక్షల కోట్లు) చేరనున్నాయని ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ అసోసియేషన్ (ఇప్కా) ప్రెసిడెంట్ డాక్టర్ బి.పార్థసారథి రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఫార్మా ఎగుమతుల పరిమాణం 2500 కోట్ల డాలర్లున్నదని (రూ.2.08 లక్షల కోట్లు), అందులో ఒక్క తెలంగాణ వాటానే 35 శాతం ఉంద ని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లో శుక్రవారం నుంచి జరుగనున్న 73వ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ (ఐపీసీ) వివరాలు తెలియచేయడానికి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రపంచ ఔషధ మార్కెట్‌కు భారత్ ఎన్నో కీలక ఔషధాలు అందిస్తున్నదని తెలిపారు. ప్రపంచ మార్కెట్లో భారత ఫార్మాను మరింత విస్తరించి, పటిష్ఠం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నాయన్నారు. ప్రపంచ ఫార్మా రంగ ప్రముఖులందరినీ ఒకే వేదిక పైకి తెచ్చి ఫార్మా రంగాన్ని మరింత ఉత్తేజితం చేయడమే లక్ష్యంగా శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో ఐపీసీ నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. ప్రపంచంలోని భిన్న దేశాలకు చెందిన 12 వేల మంది ప్రతినిధులు, 74 మంది వక్తలు ఈ సదస్సుకు హాజరవుతున్నారని ఆయన తెలిపారు. పది సంవత్సరాల తర్వాత ఇంత భారీ స్థాయిలో ఐపీసీ సదస్సు హైదరాబాద్ వేదికగా జరుగుతోందని ఆయన వెల్లడించారు.
ప్లేస్‌మెంట్ కాంక్లేవ్
ఫార్మా కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ప్లేస్‌మెంట్ కోసం ఐపీసీలో భాగంగా ప్లేస్‌మెంట్ కాంక్లేవ్ నిర్వహిస్తున్నట్టు ఐపీఏ అధ్యక్షుడు టీవీ నారాయణ చెప్పారు. పలు ఫార్మా కంపెనీలు ఇందులో పాల్గొని విద్యార్థుల కోసం క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయని, అర్హులైన వారికి ప్లేస్‌మెంట్ లేఖలు కూడా అందచేయనున్నాయని ఆయన తెలిపారు. ఐపీసీలో ఇలాంటి ప్లేస్‌మెంట్ కాంక్లేవ్ నిర్వహించడం ఇదే ప్రథమమని చెప్పారు. అ లాగే స్టార్ట్‌పల కోసం ప్రత్యేక సెషన్ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. విద్యార్థులు తమ ఊహాత్మక ప్రాజెక్టులను ఇక్కడ ఆవిష్కరించినట్టయితే ఉత్తమ ఆవిష్కరణను కార్యరూపంలోకి తెచ్చేందుకు అవసరమైన ఆర్థిక సహా యం, అందచేయనున్నట్టు ఆయన చెప్పారు.
డబ్ల్యూహెచ్‌ఓ అభియోగంలో నిజం లేదు
భారతదేశంలో తయారవుతున్న ఔషధాల్లో 35 శాతం కల్తీ ఔషధాలే అన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికను ఐపీసీ ప్రతినిధులు ఖండించారు. తక్కువ ధరలో నాణ్యమైన ఔషధాల కోసం ప్రపంచం యావత్తు భారతదేశం వైపే చూస్తున్నదన్నారు. ప్రపంచ ఫార్మాగా ప్రసిద్ధి చెందిన మన దేశం కొవిడ్ సంక్షోభ కాలంలో 150 పైగా దేశాలకు వ్యాక్సిన్లు సరఫరా చేసిందని, అలాగే ఎన్నో కీలకమైన వ్యాక్సిన్లు ప్రపంచానికి అందించి ప్రజల ప్రాణాలు కాపాడుతున్నదని గుర్తు చేశారు.
Updated Date - Jul 05 , 2024 | 05:26 AM