టెక్ మహీంద్రా లాభంలో 23% వృద్ధి
ABN, Publish Date - Jul 26 , 2024 | 04:34 AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024- 25)లో జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికానికి (క్యూ) టెక్ మహీంద్రా రూ.851 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఇదే కాలానికి గడించిన రూ.692.5 కోట్ల లాభంతో పోలిస్తే, ఈసారి 23 శాతం వృద్ధి...
క్యూ1లో రూ.851 కోట్లుగా నమోదు..
రూ.13,005 కోట్లకు తగ్గిన ఆదాయం
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024- 25)లో జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికానికి (క్యూ) టెక్ మహీంద్రా రూ.851 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఇదే కాలానికి గడించిన రూ.692.5 కోట్ల లాభంతో పోలిస్తే, ఈసారి 23 శాతం వృద్ధి నమోదైంది. కాగా, ఈ క్యూ1లో కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 1.2 శాతం తగ్గి రూ.13,005 కోట్లకు పరిమితమైంది. ఆదాయం తగ్గినప్పటికీ, మొత్తం వ్యయాలు 2.3 శాతం తగ్గి రూ.955 కోట్లకు పరిమితం కావడం, వడ్డీ ఖర్చులు 40 శాతం తగ్గి రూ.715 కోట్లకు దిగిరావడం లాభాల్లో మెరుగైన వృద్ధికి దోహద పడింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మరింత మెరుగైన పనితీరు కనబర్చనుందని టెక్ మహీంద్రా కొత్త ఎండీ, సీఈఓ మోహిత్ జోషి అన్నారు.
సేవల వ్యయం తగ్గడంతో క్యూ1లో కంపెనీ నిర్వహణ లాభాల మార్జిన్ మరో 1.9 శాతం పెరిగి 12 శాతంగా నమోదైంది. ఇకపై లాభాల మార్జిన్ క్రమంగా పుంజుకోనుందని మోహిత్ జోషి అన్నారు.
గడిచిన మూడు నెలల్లో కంపెనీ 53.4 కోట్ల డాలర్ల విలువైన కొత్త డీల్స్‌ను కుదుర్చుకుంది. అయితే, ఐటీ రంగం ఇంకా అనిశ్చితిలోనే కొనసాగుతోందని, ఈ మధ్యనే చేపట్టిన పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళిక కంపెనీకి దోహదపడుతోందని జోషి పేర్కొన్నారు.
6,000 మంది ఫ్రెషర్ల నియామకాలు
గత మూడు నెలల్లో టెక్ మహీంద్రా ఉద్యోగులు నికరంగా 2,165 మంది పెరిగారు. దాదాపు 1,000 మంది ఫ్రెషర్ల నియామకాలతో పాటు బీపీఓ విభాగంలో మరింత మందిని చేరుకున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రాంగణ నియామకాల ద్వారా 6,000 మంది ఫ్రెషర్లను చేర్చుకోవాలనుకుంటున్నట్లు కంపెనీ ఇదివరకే ప్రకటించింది.
ద్వితీయార్ధంలో సిబ్బందికి వేతన పెంపు
తమ కంపెనీలో పనిచేస్తున్న 1.47 లక్షలకు పైగా ఉద్యోగులకు వేతనాన్ని పెంచాలనుకుంటున్నట్లు జోషీ వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో (2024 అక్టోబరు-2025 మార్చి) పెంపు ఉంటుందని, ఇదే విషయాన్ని సిబ్బందికి తెలియజేయడం జరిగిందన్నారు. ఐటీ రంగ కంపెనీలకు ఉద్యోగుల జీతాలే ప్రధాన వ్యయం.
Updated Date - Jul 26 , 2024 | 04:34 AM