రూ.1.5 లక్షల కోట్లతో 5 సెమీకండక్టర్ ప్రాజెక్టులు
ABN, Publish Date - Sep 12 , 2024 | 03:06 AM
దేశంలో సెమీ కండక్టర్ల పరిశ్రమ అభివద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్నాయి. ఇందుకోసం ప్రకటించిన ‘సెమీకాన్ 1.0’ పాలసీ కింద ఇప్ప టి వరకు రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులతో...
నాలుగు నెలల్లో సెమీకాన్ 2.0 పాలసీ.. కేంద్ర మంత్రి వైష్ణవ్
న్యూఢిల్లీ: దేశంలో సెమీ కండక్టర్ల పరిశ్రమ అభివద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్నాయి. ఇందుకోసం ప్రకటించిన ‘సెమీకాన్ 1.0’ పాలసీ కింద ఇప్ప టి వరకు రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులతో ఐదు సెమీ కండక్టర్ ప్లాంట్ల ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇందులో రెండు ప్లాంట్ల ఏర్పాటు ఇప్పటికే ప్రారంభమైనట్టు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఢిల్లీలో జరుగుతున్న సెమీకాన్ ఇండియా, 2024 సదస్సులో ఆయ న ఈ విషయం వెల్లడించారు. ఇప్పటికే 3-4 రాష్ట్రాలు సెమీకండక్టర్ ప్లాంట్ల ఏర్పాటు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు తెలిపారు. త్వరలో ఉత్తరప్రదేశ్ కూడా ఈ జాబితాలో చేరనుందన్నారు.
నాలుగు నెలల్లో సెమీకాన్ 2.0 పాలసీ
దేశంలో సెమీకండక్టర్ల కంపెనీల ఏర్పాటు కోసం ప్రకటించిన సెమీకాన్ 1.0 పాలసీ గడువు ఇప్పటికే పూర్తయిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. మూడు లేదా నాలుగు నెల ల్లో కొత్త సెమీకాన్ 2.0 పాలసీ తీసుకువస్తామన్నా రు. ఈ పాలసీ ద్వారా దేశంలో సెమీకండక్టర్ల తయారీకి దోహదం చేసే కీలక లోహాలు, రసాయనాలు, గ్యాస్‌ల ఉత్పత్తికి కూడా చర్యలు తీసుకుంటామన్నా రు. సెమీకండక్టర్ల వినియోగ కంపెనీలు కూడా దేశంలోనే సెమీకండక్టర్ల సమగ్ర సదుపాయాలు ఏర్పాటు కావాలని కోరుతున్నట్టు చెప్పారు. సెమీకండక్టర్ల త యారీలో 250 ప్రత్యేక రసాయనాలు, గ్యాస్‌లు వినియోగిస్తారనే విషయాన్ని వైష్ణవ్ గుర్తు చేశారు. అత్యంత స్వచ్ఛంగా ఉండే ఈ కీలక రసాయనాలు, గ్యాస్‌ల ఉత్పత్తి ప్రక్రియ అత్యంత క్లిష్టమైందన్నారు.
2030 నాటికి 50,000 కోట్ల డాలర్ల మార్కెట్
అంతకు ముందు ఇదే సదస్సులో ప్రసంగించిన ప్రధాని మోదీ, ప్రస్తుతం 15,000 కోట్ల డాలర్లుగా (సుమారు రూ.12.60 లక్షల కోట్లు) ఉన్న భారత ఎలకా్ట్రనిక్స్ మార్కెట్, 2030 నాటికి 50,000 కోట్ల డాలర్ల స్థాయికి ఎదగాలని లక్ష్యంగా పెట్టుకోవాలని కోరారు. అప్పటికి ఈ పరిశ్రమకు అవసరమైన సెమీకండక్టర్ల నుంచి సమస్త విడి భాగాలు భారత్‌లోనే తయారు కావాలన్నారు. యుద్ధాలు, కొవిడ్ వంటి ఉత్పాతాలు ఎదురైనపుడు కీలక ఎలకా్ట్రనిక్స్ పరికరాల సరఫరాకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడకూడదనుకుంటే, భారత సెమీకండక్టర్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఆయన తైవాన్, అమెరికా, ఇజ్రాయల్ కంపెనీలను కోరారు. స్మార్ట్‌ఫోన్లు మొదలుకుని విద్యుత్ కార్ల వరకు వినియోగించే సెమీకండక్టర్ల వ్యవస్థ మొత్తం భారత్‌లోనే తయారు కావాలని ప్రధాని కోరారు.
Updated Date - Sep 12 , 2024 | 03:06 AM