పదేళ్లలో రూ.84 లక్షల కోట్లు
ABN, Publish Date - Nov 12 , 2024 | 06:08 AM
భారత కుటుంబాలు తమ ఆస్తుల్లో కేవలం 3 శాతం షేర్లలో పెట్టుబడిగా పెట్టడం ద్వారా గత పదేళ్లలో స్టాక్ మార్కెట్ నుంచి లక్ష కోట్ల డాలర్లు (రూ.84 లక్షల కోట్ల పైమాటే) ఆర్జించి ఉంటాయని అంతర్జాతీయ...
స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల ద్వారా భారత కుటుంబాలకు సమకూరిన సంపద ఇది
దశాబ్ద కాలంలో రూ.714 లక్షల కోట్ల సంపద వృద్ధి
అందులో 11% ఈక్విటీల నుంచి.. : మోర్గాన్ స్టాన్లీ
న్యూఢిల్లీ: భారత కుటుంబాలు తమ ఆస్తుల్లో కేవలం 3 శాతం షేర్లలో పెట్టుబడిగా పెట్టడం ద్వారా గత పదేళ్లలో స్టాక్ మార్కెట్ నుంచి లక్ష కోట్ల డాలర్లు (రూ.84 లక్షల కోట్ల పైమాటే) ఆర్జించి ఉంటాయని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. గత పదేళ్లలో భారత కుటుంబాలు తమ సంపదను 8.5 లక్షల కోట్ల డాలర్ల (రూ.714 లక్షల కోట్లు) మేర పెంచుకున్నాయని.. అందులో 11 శాతం స్టాక్ మార్కెట్ నుంచి గడించాయని మోర్గాన్ స్టాన్లీ నివేదిక వెల్లడించింది. అయితే, ఈక్విటీల్లో భారత కుటుంబాల పెట్టుబడులు ఇప్పటికీ చాలా తక్కువేనని మోర్గాన్ స్టాన్లీ ఇండియా ఎండీ రిధమ్ దేశాయ్ అన్నారు. మొత్తం ఆస్తుల్లో 3 శాతంగా ఈక్విటీ పెట్టుబడులు మున్ముందు సంవత్సరాల్లో రెండంకెల స్థాయికి పెరగవచ్చన్నారు. మరిన్ని విషయాలు..
కంపెనీ వ్యవస్థాపకుల ఈక్విటీ వాటాలను సైతం పరిగణనలోకి తీసుకుంటే, భారత కుటుంబాల సంపద గత దశాబ్దకాలంలో 9.7 లక్షల కోట్ల డాలర్లు పెరిగిందని.. అందులో 20 శాతం లేదా 2 లక్షల కోట్ల డాలర్లు స్టాక్ మార్కెట్ నుంచి సమకూరిందని అంచనా.
ప్రస్తుతం భారత కుటుంబాల ఆస్తుల్లో ఈక్విటీల వాటా చాలా తక్కువే అయినప్పటికీ, గత పదేళ్లలో స్టాక్స్ వీరి పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. మున్ముందు ఈ పెట్టుబడులు మరింత వేగంగా వృద్ధి చెందనున్నాయని నివేదిక అంచనా వేసింది.
బంగారం సైతం అతిపెద్ద సంపద సృష్టికర్తగా ఉంది. గత పదేళ్లలో పసిడి ద్వారా సంపద 22 శాతం పెరిగింది.
2014 మార్చిలో 1.2 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న భారత లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్.. గత పదేళ్లలో భారీగా వృద్ధి చెంది ప్రస్తుతం 5.4 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. మార్కెట్ క్యాప్ పరంగా ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద స్టాక్ మార్కెట్ మనదే.
ప్రపంచ మార్కెట్ క్యాప్‌లో భారత్ స్టాక్ మార్కెట్ వాటా 2013లో 1.3 శాతంగా ఉండగా.. 2024 నవంబరు నాటికి 4.3 శాతానికి పెరిగింది. వర్ధమాన దేశాల్లో రెండో అత్యధిక వాటా మనదే.
గత దశాబ్ద కాలంలో బంగారం, ఈక్విటీలే అత్యుత్తమ ప్రతిఫలాలు అందించాయి. భారత కుటుంబాల ఆస్తుల్లో అత్యధిక వాటా స్థిరాస్తులదే అయినప్పటికీ, వాటి విలువ మాత్రం మిగతా వాటితో పోలిస్తే అంతగా పెరగలేదని మోర్గాన్ స్టాన్లీ నివేదిక పేర్కొంది.
Updated Date - Nov 12 , 2024 | 06:08 AM