మార్కెట్లోకి సరికొత్త డిజైర్
ABN, Publish Date - Nov 12 , 2024 | 06:03 AM
సెడాన్ విభాగంలో మార్కెట్ వాటా పెంచుకోవడం తమ లక్ష్యమని మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ (ఎంఎ్‌సఐ) మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ హిసాషి టకూచి అన్నారు...
సెడాన్ విభాగంలో వాటా పెంపుపై మారుతి ఫోకస్
న్యూఢిల్లీ: సెడాన్ విభాగంలో మార్కెట్ వాటా పెంచుకోవడం తమ లక్ష్యమని మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ (ఎంఎ్‌సఐ) మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ హిసాషి టకూచి అన్నారు. ఎంట్రీ లెవెల్ చిన్న కార్ల అమ్మకాలు క్షీణించినప్పటికీ గ్రామీణ మార్కెట్ల పునరుజ్జీవం ఆ నష్టం భర్తీ కావడానికి దోహదపడిందని ఆయన చెప్పారు. సోమవారం ఆయన సరికొత్త కాంపాక్ట్ సెడాన్ డిజైర్ కారును మార్కెట్లో ప్రవేశపెట్టారు. ఢిల్లీలో దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.6.79 లక్షల నుంచి రూ.10.14 లక్షల మధ్యన ఉంది. ఈ కారుతో సెడాన్ విభాగంలో మార్కెట్ వాటాను పెంచుకోగలుగుతామన్న విశ్వాసం ఆయన ప్రకటించారు. ఇటీవలి కాలంలో ఎస్‌యూవీ విభాగం మంచి వృద్ధిని నమోదు చేస్తున్నప్పటికీ అగ్రస్థానాన్ని కాపాడుకోవాలంటే తమకి అన్ని విభాగాలూ అవసరమేనని తేల్చి చెప్పారు. ఎంఎస్‌ఐ ప్రస్తుతం కార్ల మార్కెట్లో 40 శాతం, సెడాన్ విభాగంలో 50 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది. కొత్త డిజైర్ అభివృద్ధిపై రూ.1,000 కోట్లు ఇన్వెస్ట్ చేశామని ఆయన చెప్పారు.
ప్రపంచ మార్కెట్లో డిజైర్ అద్భుత విజయం సాధించిందని, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 30 లక్షల కార్లు విక్రయించామని ఆయన తెలిపారు. మొత్తం పరిశ్రమలో సెడాన్ విక్రయాలు క్షీణిస్తున్నప్పటికీ తమకు మాత్రం ఆ మార్కెట్ బాగుందని టకూచీ చెప్పారు.
Updated Date - Nov 12 , 2024 | 06:03 AM