మార్కెట్లో లాభాల స్వీకరణ
ABN, Publish Date - Sep 05 , 2024 | 02:51 AM
అమెరికా ఆర్థిక మందగమన భయాల నేపథ్యంలో దేశీయ ఇన్వెస్టర్లు బుధవారం ఐటీ, బ్యాంకింగ్, మెటల్ షేర్లలో లాభాలు స్వీకరించడంతో సెన్సెక్స్ 202.80 పాయింట్లు కోల్పోయి 82,352.64కి జారుకుంది...
సెన్సెక్స్ 203 పాయింట్లు డౌన్
ముంబై: అమెరికా ఆర్థిక మందగమన భయాల నేపథ్యంలో దేశీయ ఇన్వెస్టర్లు బుధవారం ఐటీ, బ్యాంకింగ్, మెటల్ షేర్లలో లాభాలు స్వీకరించడంతో సెన్సెక్స్ 202.80 పాయింట్లు కోల్పోయి 82,352.64కి జారుకుంది. 14రోజుల వరుస ర్యాలీకి తెర దించిన నిఫ్టీ 81.15 పాయింట్లు కోల్పోయి 25,198.70 వద్ద ముగిసింది.
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (జీఐసీ ఆర్‌ఈ) వాటా కొనుగోలుకు సంస్థాత ఇన్వెస్టర్లు బుధవారం రూ.2,300 కోట్ల విలువైన బిడ్లు సమర్పించారు. కేంద్ర ప్రభుత్వం జీఐసీ ఆర్‌ఈలో 6.78 శాతం వరకు వాటాను ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో విక్రయానికి పెట్టింది. ఒక్కో షేరును రూ.395గా నిర్ణయించింది.
క్రాస్ లిమిటెడ్ ఐపీఓ ధరల శ్రేణిని రూ.228-240గా నిర్ణయించింది. కంపెనీ ఇష్యూ ఈనెల 9న ప్రారంభమై 11న ముగియనుంది. ఐపీఓ ద్వారా కంపెనీ రూ.500 కోట్లు సమీకరించాలనుకుంటోంది.
రూ.1650 తగ్గిన వెండి ధర
ఢిల్లీ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.450 తగ్గుదలతో రూ.73,600కు జారుకోగా.. కిలో వెండి ఏకంగా రూ.1,650 తగ్గి రూ.83,600కు దిగివచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ ఒకదశలో 2,520 డాలర్లు, సిల్వర్ 28 డాలర్ల స్థాయిలో ట్రేడయ్యాయి.
Updated Date - Sep 05 , 2024 | 02:51 AM