అదానీ గూటికి పెన్నా సిమెంట్
ABN, Publish Date - Jun 14 , 2024 | 03:22 AM
దేశ సిమెంట్ రంగం లో మరో భారీ కొనుగోలు చోటు చేసుకుంది. అదానీ గ్రూప్ సిమెంట్ కంపెనీ అంబుజా సిమెంట్.. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (పీసీఐఎల్)ను కొనుగోలు చేసింది...
డీల్ విలువ రూ.10,422 కోట్లు
100% వాటా కొనుగోలు చేసిన అంబుజా సిమెంట్
దక్షిణ భారత మార్కెట్‌పై మరింత పట్టు
శ్రీలంకమార్కెట్లోకి ప్రవేశం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): దేశ సిమెంట్ రంగం లో మరో భారీ కొనుగోలు చోటు చేసుకుంది. అదానీ గ్రూప్ సిమెంట్ కంపెనీ అంబుజా సిమెంట్.. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (పీసీఐఎల్)ను కొనుగోలు చేసింది. పెన్నా సిమెంట్ ప్రధాన ప్రమోటర్ పీ ప్రతాప్ రెడ్డి, అతని కుటుంబ సభ్యుల నుంచి 100 శాతం వాటాలను రూ.10,422 కోట్ల ఎంటర్‌ప్రైజ్ వాల్యూకి (అప్పులు, నగదు నిల్వలతో కలిపి) చేజిక్కించుకున్నట్లు అంబుజా సిమెంట్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించింది. ఈ మేరకు పెన్నా సిమెంట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది.
నాలుగు నెలల్లో డీల్ పూర్తి: ప్రభుత్వ, రెగ్యులేటరీ సంస్థల నుంచి వెంటనే అనుమతులు లభిస్తే మూడు నుంచి నాలుగు నెలల్లోనే ఈ కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుందని అంబుజా సిమెంట్ సీఈఓ, హోల్‌టైమ్ డైరెక్టర్ అజయ్ కపూర్ వెల్లడించారు. ఈ కొనుగోలుకు అవసరమైన నిధులను పూర్తిగా అంతర్గత వనరుల నుంచి సమకూర్చుకోనున్నట్లు ఆయన తెలిపారు. కాగా పెన్నా సిమెంట్ కొనుగోలుతో అదానీ గ్రూప్ వార్షిక సిమెంట్ ఉత్పత్తి సామర్ధ్యం మరో 1.4 కోట్ల టన్నులు పెరిగి మొత్తం 8.9 కోట్ల టన్నులకు చేరనుంది. ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ అలా్ట్రటెక్ సిమెంట్ తర్వాత దేశంలో మరే సిమెంట్ కంపెనీకి ఇంత ఉత్పత్తి సామర్ధ్యం లేదు. దక్షిణాది మార్కెట్లో వాటాను పెంచుకునేందుకు పీసీఐఎల్ కొనుగోలు ఎంతగానో దోహదపడటమే కాకుండా దేశవ్యాప్తంగా సిమెంట్ రంగంలో అగ్రస్థానాన్ని దక్కించుకునేందుకు మార్గం సుగమం కానుందని కపూర్ తెలిపారు.
4 రాష్ట్రాల్లో పెన్నా సిమెంట్ యూనిట్లు: 1991లో కార్యకలాపాలు ప్రారంభించిన పెన్నా సిమెంట్.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని తలారిచెరువు, బోయరెడ్డిపల్లి, తెలంగాణలోని గణేశ్‌పహడ్, తాండూ రు, మహారాష్ట్రలోని పటాస్ వద్ద సిమెంట్, క్లింకర్ యూనిట్లను నిర్వహిస్తోంది. మరోవైపు శ్రీలంకలో నేరుగా, స్థానిక అనుబంధ సంస్థ ద్వారా పెన్నా సిమెంట్ కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ ప్లాంట్ల వార్షిక సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం కోటి టన్నులుగా ఉంది. పెన్నా సిమెంట్‌కు చెందిన ప్లాంట్లలో ఎక్కువ భాగం రైల్వే లైన్లకు సమీపంలో ఉన్నాయి. కాగా కార్యకలాపాల విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం వద్ద ఏటా 20 లక్షల టన్నుల సామర్థ్యం గల ప్లాంట్‌తో పాటు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ వద్ద ఏటా 20 లక్షల టన్నుల సామర్థ్యంతో కొత్త ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. వచ్చే ఆరు నుంచి 12 నెలల కాలంలో ఈ ప్లాంట్లు వాణిజ్యపరంగా అందుబాటులోకి రానున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో పెన్నా సిమెంట్ కన్సాలిడేటెడ్ టర్నోవర్ రూ.1,241 కోట్లుగా ఉంది.
మార్కెట్‌పై మరింత పట్టు: పెన్నా సిమెంట్ కొనుగోలుతో దక్షిణ భారత మార్కెట్లో అదానీ గ్రూప్ వాటా 8 శాతానికి పెరగనుంది. దేశవ్యాప్తంగా చూసినా మార్కెట్ వాటా 2 శాతానికి పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు పెన్నా సిమెంట్‌కు మంచి సున్నపురాయి గనులు కూడా ఉండటం అదానీ గ్రూప్‌నకు కలిసిరానుంది. దీంతో 2028 మార్చి నాటికి వార్షిక సిమెంట్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని 14 కోట్ల టన్నులకు పెంచుకోవాలన్న అదానీ గ్రూప్ కల నెరవేరనుంది.
మరిన్ని కొనుగోళ్లు!
పెన్నా సిమెంట్ కొనుగోలు పూర్తి కావడంతో అదానీ గ్రూప్ ఇప్పుడు సౌరాష్ట్ర సిమెంట్, జైపీ అసోసియేట్స్ సిమెంట్ ప్లాంట్లు, ఏబీజీ షిప్‌యార్డ్ అనుబంధ సంస్థ వద్రాజ్ సిమెంట్ కంపెనీలపై కన్నేసింది. ఇందులో వద్రాజ్ సిమెంట్, జైపీ సిమెంట్స్ దివాలా ప్రక్రియలో ఉన్నాయి. అదానీ గ్రూప్ సరైన ఆఫర్ ఇస్తే ఈ రెండు సంస్థల రుణదాతలు వన్‌టైమ్ సెటిల్‌మెంట్‌కు ఆమోదించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Updated Date - Jun 14 , 2024 | 03:22 AM