డాక్టర్ రెడ్డీస్ షేర్ల విభజన
ABN, Publish Date - Jul 28 , 2024 | 02:17 AM
హైదరాబాద్‌కు చెందిన ఔషధ తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్ షేర్లను 1:5 నిష్పత్తిలో విభజించనున్నట్లు శనివా రం ప్రకటించింది. ప్రస్తుతం రూ.5 ముఖ విలువ కలిగిన...
ఒక షేరు ఐదు షేర్లుగా... అమెరికన్ డిపాజిటరీ షేర్లు సైతం
హైదరాబాద్(ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్‌కు చెందిన ఔషధ తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్ షేర్లను 1:5 నిష్పత్తిలో విభజించనున్నట్లు శనివా రం ప్రకటించింది. ప్రస్తుతం రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరును రూపాయి ముఖ విలువ కలిగిన ఐదు షేర్లుగా విభజించేందుకు బోర్డు ఆమోదం తెలిపిందని త్రైమాసిక ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు కంపెనీ సమాచారం అందించింది. షేర్ల విభజనకు రికార్డు తేదీని తర్వాత వెల్లడిస్తామని సంస్థ పేర్కొంది. అంతేకాదు, ప్రస్తుతం ప్రతి అమెరికన్ డిపాజిటరీ షేరు (ఏడీఆర్) కూడా ఒక ఈక్విటీ షేరుతో సమానమని.. విభజన ఫలితంగా ఏడీఆర్‌లు సైతం ఈక్విటీ షేర్లకు సమానంగా పెరుగుతాయని కంపెనీ స్పష్టం చేసింది. డాక్టర్ రెడ్డీస్ తన షేర్లను విభజించడం ఇది రెండోసారి. 2001 అక్టోబరులో కంపెనీ రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరును రూ.5 ముఖ విలువతో కూడిన రెండు షేర్లుగా విభజించింది. శుక్రవారం డాక్టర్ రెడ్డీస్ షేరు బీఎ్‌సఈలో 0.55 శాతం పెరుగుదలతో రూ.6,892 వద్ద ముగిసింది.
క్యూ1 లాభం రూ.1,392 కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి డాక్టర్ రెడ్డీస్ రూ.1,392 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి గడించిన రూ.1,403 కోట్ల లాభంతో పోలిస్తే 0.7 శాతం తగ్గినప్పటికీ, మార్కెట్ అంచనాలను మించి నమోదైంది. కంపెనీ ఆదాయం 14 శాతం పెరిగి రూ.7,673 కోట్లకు చేరుకుంది. ఇప్పటివరకు కంపెనీ ఆర్జించిన అత్యధిక త్రైమాసికాదాయం ఇదే. 2023-24లో ఇదే సమయానికి ఆదాయం రూ.6,738 కోట్లుగా ఉంది. పన్ను భారం 24 శాతం నుంచి 26 శాతానికి పెరగడం లాభాలను ప్రభావితం చేసింది. కాగా, ఉత్తర అమెరికాతోపాటు భారత మార్కెట్లో జనరిక్ ఔషధాల విక్రయాలు పెరగడం ఆదాయ వృద్ధికి దోహదపడింది.
స్విస్ యూనిట్లోకి
50 కోట్ల పౌండ్లు
స్విట్జర్లాండ్ అనుబంధ విభాగమైన ‘డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్ ఎస్‌ఏ’లో 50 కోట్ల పౌండ్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. స్విస్ అనుబంధ విభాగం ఈ నిధులను నికోటినెల్, ఇతర బ్రాండ్ల కొనుగోలుకు ఉపయోగించుకోనుంది.
మరిన్ని ముఖ్యాంశాలు..
మొత్తం ఆదాయంలో గ్లోబల్ జనరిక్స్ విక్రయాల వాటా 90 శాతంగా నమోదైంది. ఈ క్యూ1లో గ్లోబల్ జనరిక్స్ ద్వారా రాబడి 15 శాతం పెరిగి రూ.6,886 కోట్లకు చేరుకుంది. ఫార్మాస్యూటికల్ సేవలు, యాక్టివ్ ఇంగ్రెడియెంట్స్ ద్వారా రెవెన్యూ 14 శాతం వృద్ధితో రూ.770 కోట్లుగా నమోదైంది.
గ్లోబల్ జనరిక్స్ ఆదాయాన్ని మార్కెట్ల వారీగా పరిశీలిస్తే, ఉత్తర అమెరికా నుంచి రెవెన్యూ 20 శాతం వృద్ధితో రూ.3,846 కోట్లుగా నమోదైంది. విక్రయాలు పుంజుకోవడం, మూడు కొత్త ఉత్పత్తుల విడుదల ఇందుకు కలిసివచ్చాయి. యూరప్ మార్కెట్ రెవెన్యూ 4 శాతం పెరిగి రూ.527 కోట్లుగా, భారత మార్కెట్ నుంచి రాబడి 15 శాతం పుంజుకొని రూ.1,325 కోట్లుగా నమోదయ్యాయి. వర్ధమాన మార్కెట్ల నుంచి రెవెన్యూ 3 శాతం పెరిగి రూ.1,188 కోట్లకు చేరుకుంది.
ఈ ఆర్థిక సంవత్సరానికి కంపెనీ భారత మార్కెట్ నుంచి రెండంకెల స్థాయి ఆదాయ వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. బేస్ బిజినెస్ ఇందుకు దోహదపడగలదని భావిస్తోంది. గడిచిన మూడు నెలల్లో కంపెనీ దేశీయ మార్కెట్లో 13 కొత్త ఉత్పత్తులను విడుదల చేసింది.
కొత్త ఆర్థిక సంవత్సరానికి కంపెనీ శుభారంభం చేసింది. జనరిక్ ఔషధాల వ్యాపారం కంపెనీ వృద్ధి, లాభదాయకతను ముందుకు నడిపించాయి. ఒకవైపు మా కీలక వ్యాపారాలను బలోపేతం చేస్తూనే మరోవైపు వ్యాపార విలువను పెంచేందుకు బయోలాజిక్స్, కన్జ్యూమర్ హెల్త్‌కేర్, ఆవిష్కరణల్లో వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టాం.
జీవీ ప్రసాద్, డాక్టర్ రెడ్డీస్
సహ చైర్మన్, ఎండీ
Updated Date - Jul 28 , 2024 | 02:17 AM