ఏపీ, తెలంగాణలో ‘ఆక్సిలో ఫిన్‌సర్వ్’ విస్తరణ
ABN, Publish Date - Dec 17 , 2024 | 01:08 AM
విదేశాల్లో ఉన్నత విద్య కోసం రుణాలు అందించే ‘ఆక్సిలో ఫిన్‌సర్వ్ (ప్రైవేట్) లిమిటెడ్ కంపెనీ రెండు తెలుగు రాష్ట్రాల్లో తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): విదేశాల్లో ఉన్నత విద్య కోసం రుణాలు అందించే ‘ఆక్సిలో ఫిన్‌సర్వ్ (ప్రైవేట్) లిమిటెడ్ కంపెనీ రెండు తెలుగు రాష్ట్రాల్లో తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే ఆరు నెలల్లో విజయవాడ, విశాఖపట్నం, నిజామాబాద్‌లలో కొత్త టచ్ పాయింట్లు ఏర్పాటు చేస్తోంది. కంపెనీ ఓవర్‌సీస్ ఎడ్యుకేషన్ లోన్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ శ్వేత గురు ఈ విషయం చెప్పారు. హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీసు నుంచి ఈ టచ్ పాయింట్లను నిర్వహిస్తామన్నారు. త్వరలో గుంటూరు, వరంల్, తిరుపతి, కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల్లోనూ టచ్ పాయింట్లు ఏర్పాటు చేసే యోచన ఉందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికి రూ.930 కోట్ల విద్యా రుణాలివ్వగా అందులో తెలుగు రాష్ట్రాల వాటా రూ.350 కోట్ల వరకు ఉందన్నారు.
ఈ రాష్ట్రాల్లో గత మూడేళ్లుగా తమ విద్యా రుణాల పోర్టుఫోలియో ఏటా 50 శాతం చొప్పున పెరుగుతోందన్నారు. వివిద అంశాల ఆధారంగా ఒక్కో విద్యార్థికి రూ.25 లక్షల నుంచి రూ.65 లక్షల వరకు, ప్రత్యేక కోర్సులకు రూ.75 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తామన్నారు. రుణంపై 10.7 శాతం నుంచి 13.5 శాతం వరకు వడ్డీ ఉంటుందని తెలిపారు.
Updated Date - Dec 17 , 2024 | 01:08 AM