ఓఎన్‌జీసీకి గుదిబండగా దీన్ దయాళ్ బ్లాక్
ABN, Publish Date - Jun 24 , 2024 | 06:38 AM
కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్‌లోని దీన్ దయాళ్ వెస్ట్ బ్లాక్ ప్రభుత్వ రంగంలోని ఓఎన్‌జీసీకి గుదిబండలా మారింది. 2017 జనవరిలో గుజరాత్ ప్రభుత్వ రంగంలోని...
సహజ వాయువు నిల్వలపై ‘గ్యాస్’ కొట్టిన జీఎ్‌సపీసీ
న్యూఢిల్లీ: కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్‌లోని దీన్ దయాళ్ వెస్ట్ బ్లాక్ ప్రభుత్వ రంగంలోని ఓఎన్‌జీసీకి గుదిబండలా మారింది. 2017 జనవరిలో గుజరాత్ ప్రభుత్వ రంగంలోని గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ (జీఎ్‌సపీసీ) ఈ క్షేత్రంలో తనకు ఉన్న 80 శాతం వాటాను ఓఎన్‌జీసీకి 120 కోట్ల డాలర్లకు విక్రయించింది. కేంద్ర ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే ఓఎన్‌జీసీ ఈ బ్లాక్‌ను కొనుగోలు చేసిందని అప్పట్లోనే వార్తలు గుప్పుమన్నాయి.
అరకొర నిక్షేపాలే: ఓఎన్‌జీసీకి ఈ బ్లాక్‌ను విక్రయించే సమయంలో ఈ క్షేత్రంలో దాదాపు 20 లక్షల కోట్ల ఘనపుటడుగుల (టీసీఎఫ్) గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయని, రోజూ 20 నుంచి 30 కోట్ల ఘనపుటడుగుల గ్యాస్ ఉత్పత్తి చేయవచ్చని జీఎ్‌సపీసీ చెప్పింది. తీరా చూస్తే ఇక్కడ ఉన్న గ్యాస్ నిక్షేపాలు 1.94 టీసీఎఫ్ మాత్రమేనని తేలింది. అయినా ఆశ చావక ఓఎన్‌జీసీ పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేసి ఈ బ్లాక్‌లో ఇప్పటి వరకు మొత్తం ఏడు బావులు డ్రిల్లింగ్ చేసింది. అందులో నాలుగు బావుల్లో మాత్రమే స్వల్ప పరిమాణంలో గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి. మరో మూడు బావుల్ని వివిధ సాంకేతిక సవాళ్లతో మూసేయాల్సి వచ్చింది.
ఆశ చావని ఓఎన్‌జీసీ: దీన్ దయాళ్ వెస్ట్ బ్లాక్‌పై ఓఎన్‌జీసీకి ఇప్పటికీ ఆశ చావలేదు. మంచి టెక్నాలజీ, పుష్కలంగా నిధులు ఉన్న విదేశీ ఆయిల్ కంపెనీలతో ఈ బ్లాక్‌లో మరోసారి అన్వేషణ చేయించి, మరిన్ని బావులు తవ్వాలని నిర్ణయించింది. ఇందుకు ఆసక్తి ఉన్న సంస్థలు ముందుకు వస్తే ఆ సంస్థలకు కొంత భాగస్వామ్యం కూడా ఇస్తామని తాజాగా టెండర్ ఫ్లోట్ చేసింది. ఆసక్తి ఉన్న సంస్థలు ఈ ఏడాది సెప్టెంబరు 12లోగా తమ బిడ్స్, సమర్పించాలని కోరింది. ఈ బ్లాక్ కొన్న పాపానికి ఓఎన్‌జీసీకి ఇప్పటికే చేతి చమురు వదిలించుకోవటమే కాకుండా కంపెనీ రిజర్వు నిధులు తగ్గిపోయాయి. జీఎ్‌సపీసీ మాత్రం ఓఎన్‌జీసీ చెల్లించిన డబ్బులతో తన అప్పులు గణనీయంగా తగ్గించుకుంది.
Updated Date - Jun 24 , 2024 | 06:38 AM