ఏఐ, ఎంఎల్ జాబ్స్‌కు డిమాండ్
ABN, Publish Date - Jul 22 , 2024 | 06:03 AM
ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ (ఐటీ) ఇండస్ట్రీ స్తబ్దుగా ఉంది. నియామకాలకు కంపెనీలు దాదాపుగా ఫుల్‌స్టాప్ పెట్టాయి. క్యాంపస్ రిక్రూట్‌మెంట్లో ఎంపికైన అభ్యర్థులకూ కంపెనీలు ఏదో ఒక సాకుతో రిక్తహస్తం చూపిస్తున్నాయి. అయితే కృత్రిమ మేధ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) వంటి సరికొత్త టెక్నాలజీలపై...
2022 నుంచి 433% పెరుగుదల : ఇన్‌డీడ్
ముంబై: ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ (ఐటీ) ఇండస్ట్రీ స్తబ్దుగా ఉంది. నియామకాలకు కంపెనీలు దాదాపుగా ఫుల్‌స్టాప్ పెట్టాయి. క్యాంపస్ రిక్రూట్‌మెంట్లో ఎంపికైన అభ్యర్థులకూ కంపెనీలు ఏదో ఒక సాకుతో రిక్తహస్తం చూపిస్తున్నాయి. అయితే కృత్రిమ మేధ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) వంటి సరికొత్త టెక్నాలజీలపై పట్టున్న ఇంజనీర్లను మాత్రం ఐటీ కంపెనీలు మంచి మంచి ప్యాకేజీలతో ఎగరేసుకుపోతున్నాయి. 2022తో పోలిస్తే ఐటీ రంగంలో ఇలాంటి ఇంజనీర్ల డిమాండ్ 433 శాతం పెరిగింది. ఇదే సమయంలో బిజినెస్ ప్రాసెసింగ్ ఔట్‌సోర్సింగ్ (బీపీఓ) రంగమూ రాణిస్తోంది. ఈ రంగానికి చెందిన ఎగ్జిక్యూటివ్స్ డిమాండ్ గత రెండేళ్లలో 314 శాతం పెరిగింది. ఉద్యోగ నియామకాల తీరుతెన్నులను పరిశీలించే ‘ఇన్‌డీడ్’ అనే సంస్థ ఒక నివేదికలో ఈ విషయం తెలిపింది.
ఇతర రంగాలదీ అదే బాట: కొవిడ్ తర్వాత పర్యాటక, ఇతర వ్యాపారాలు బాగా పుంజుకున్నాయి. ఏ మాత్రం టైమ్ దొరికినా ఉద్యోగులు తీర్థయాత్రకో, విహార యాత్రకో చెక్కేస్తున్నారు. దీంతో గత రెండేళ్లలో ట్రావెల్ కన్సల్టెంట్ల గిరాకీ 285 శాతం పెరిగింది. ఇదే సమయంలో ఫ్రంట్ ఆఫీస్ సిబ్బందిలో అతి ముఖ్యమైన రిసెప్షనిస్టుల డిమాండ్ 310 శాతం పెరిగినట్టు ఇన్‌డీడ్ వెల్లడించింది. రియల్టీ బూమ్‌తో శానిటేషన్, నిర్మాణ రంగ నిపుణులు, ఎలక్ట్రీషియన్‌ల గిరాకీ కూడా గత రెండేళ్లలో 121 నుంచి 258 శాతం వరకు పెరిగింది. వీటికి తోడు గత రెండేళ్లలో విద్య, వైద్య పరిశోధన రంగాల నిపుణులకూ గిరాకీ భారీగా పెరిగినట్టు నివేదిక తెలిపింది.
Updated Date - Jul 22 , 2024 | 06:03 AM