డాక్టర్ రెడ్డీస్ లాభం రూ.1,342 కోట్లు
ABN, Publish Date - Nov 06 , 2024 | 01:26 AM
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జులై-సెప్టెంబరు త్రైమాసికానికి గాను కంపెనీ నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 9.35 శాతం క్షీణించి...
సెప్టెంబరు త్రైమాసికంలో 9% తగ్గుదల
ఆదాయంలో 17% వృద్ధి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జులై-సెప్టెంబరు త్రైమాసికానికి గాను కంపెనీ నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 9.35 శాతం క్షీణించి రూ.1,341.50 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.1,480 కోట్లుగా ఉంది. త్రైమాసిక సమీక్షా కాలంలో కంపెనీ మొత్తం ఆదాయం మాత్రం 16.51 శాతం వృద్ధితో రూ.6,880.20 కోట్ల నుంచి రూ.8,016.20 కోట్లకు చేరుకుంది. ఒక త్రైమాసిక కాలంలో రూ.8,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించటం ఇదే తొలిసారని కంపెనీ పేర్కొంది. ఈ కాలంలో గ్లోబల్ జెనరిక్స్ ఆదాయాలు మెరుగ్గా ఉండటం ఎంతగానో కలిసివచ్చిందని డాక్టర్ రెడ్డీస్ తెలిపింది.
వర్ధమాన మార్కెట్లు సహా భారత్, యూరప్, అమెరికా మార్కెట్ల నుంచి రెవెన్యూలు అంచనాలకు తగ్గట్టుగా ఉన్నాయని పేర్కొంది. త్రైమాసిక కాలంలో మొత్తం నిర్వహణ వ్యయాలు 34.3 శాతం వృద్ధి చెంది రూ.3,021.80 కోట్లకు చేరుకున్నాయని తెలిపింది. కంపెనీకి చెందిన అన్ని విభాగాలు నిలకడైన వృద్ధిని సాధించటంతో సెప్టెంబరు త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు రాబట్టుకోగలిగినట్లు డాక్టర్ రెడ్డీస్ కో చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ అన్నారు. నెస్లే భాగస్వామ్యంలో ఏర్పాటు చేసిన సంస్థ కార్యకలాపాలు ప్రారంభించటంతో పాటు నికోటినల్, ఇతర బ్రాండ్ల కొనుగోలు పూర్తి కావటంతో భవిష్యత్‌లో మంచి వృద్ధిని కనబరిచే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
అమెరికా ఆదాయం రూ. 3,728 కోట్లు
సెప్టెంబరు త్రైమాసికంలో కంపెనీ గ్లోబల్ జెనరిక్స్ ఆదాయాలు 17 శాతం వృద్ధి చెంది రూ.7,157.60 కోట్లుగా ఉన్నాయని డాక్టర్ రెడ్డీస్ సీఎ్‌ఫఓ ఎంవీ నరసింహం చెప్పారు. కాగా అమెరికా ఆదాయాలు కూడా 17 శాతం వృద్ధితో రూ.3,728.10 కోట్లకు చేరుకున్నాయన్నారు. అమ్మకాలు గణనీయంగా పెరగటంతో పాటు అమెరికా మార్కెట్లోకి కొత్తగా నాలుగు ఔషధాలను విడుదల చేయటం కలిసివచ్చిందని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు యూరప్, వర్ధమాన దేశాల మార్కెట్ల నుంచి రెవెన్యూలు వరుసగా 9 శాతం, 20 శాతం మేరకు పెరిగాయని తెలిపారు. రష్యా మార్కెట్లో కొన్ని ఔషధాల బ్రాండ్ల ధరలు పెంచటంతో పాటు అమ్మకాలు పెరగటంతో కలిసివచ్చిందన్నారు. భారత మార్కెట్లో కూడా కంపెనీ ఆదాయాలు 18 శాతం వృద్ధి చెంది రూ.1,397.10 కోట్లకు చేరుకున్నాయని వివరించారు. ఈ కాలంలో దేశీయ మార్కెట్లోకి కంపెనీ కొత్తగా మూడు ఔషధ బ్రాండ్లను విడుదల చేసిందని నరసింహం తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు కంపెనీ మొత్తం 16 ఔషధాలను విడుదల చేసిందని చెప్పారు.
రూ.1,200 కోట్ల పెట్టుబడులు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.2,500 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించగా ఇప్పటి వరకు రూ.1,200 కోట్లు ఖర్చు చేసినట్లు సీఎఫ్‌ఓ నరసింహం తెలిపారు. సెప్టెంబరు ముగిసే నాటికి కంపెనీ వద్ద రూ.1,889 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయని వివరించారు. కాగా బయోసిమిలర్స్, ఇతర ఇన్నోవేటివ్ ఉత్పత్తులపై డాక్టర్ రెడ్డీస్ పెట్టుబడులను యథాతథంగా కొనసాగించనుందని కంపెనీ సీఈఓ ఎరెజ్ ఇజ్రాయెలీ తెలిపారు. 2027 నాటికి అమెరికా, యూరోపియన్ మార్కెట్లలోకి కనీసం మూడు బయోసిమిలర్ ఉత్పత్తులను విడుదల చేయాలని చూస్తున్నట్లు చెప్పారు.
Updated Date - Nov 06 , 2024 | 01:26 AM