Elon Musk: వోడాఫోన్ ఐడియాలో వాటాను కొనుగోలు చేయనున్న ఎలాన్ మస్క్?
ABN, Publish Date - Jan 02 , 2024 | 05:14 PM
ఇప్పటికే ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్(Elon Musk) మరో సంస్థ వోడాఫోన్( Vodafone Idea)లో వాటాను తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కంపెనీ షేర్లు పెద్ద ఎత్తున పెరిగాయి. ఈ క్రమంలోనే సంస్థ ఈ మేరకు క్లారిటీ ఇచ్చింది.
2024 కొత్త సంవత్సరం మొదటి రోజున వోడాఫోన్ ఐడియా(Vodafone Idea) లిమిటెడ్ షేర్స్ స్టాక్‌లలో భారీ పెరుగుదల కనిపించింది. అయితే ఈ పెరుగుదలకు ఓ కారణం ఉందని సోషల్ మీడియాలో ఓ వార్త హల్‌చల్ చేస్తుంది. అది ఏంటంటే వోడాఫోన్‌లో కొంత వాటాను బిలియనీర్ ఎలాన్ మస్క్(Elon Musk) కొనుగోలు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతను తన శాటిలైట్ ఇంటర్నెట్ కంపెనీ అయిన స్టార్‌లింక్ కోసం తీసుకోనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అంతేకాదు వోడాఫోన్ ఐడియాలో 33% వాటాను ఎలాన్ మస్క్ తీసుకోనున్నట్లు పుకార్లు వచ్చాయి. దీంతో వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ స్టాక్ కొత్త సంవత్సరం మొదటి రోజున 52 వారాల గరిష్ట స్థాయి రూ.18.42కి చేరుకుంది. అయితే ఈ పరిణామంపై సెబీ భారతదేశపు మూడవ అతిపెద్ద టెలికాం సర్వీస్ ప్రొవైడర్ అయిన వోడాఫోన్‌ను వివరణ కోరింది. దీనిపై స్పందించిన వోడాఫోన్ అటువంటి చర్చలు ప్రస్తుతానికి లేవని తెలిపింది. ప్రస్తుతం వస్తున్న వార్తల్లో నిజం కాదని స్పష్టం చేసింది. అయితే Vodafone Idea స్పష్టం చేసిన తర్వాత కంపెనీ షేర్లు ఐదు శాతం తగ్గి జనవరి 2న మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు రూ.16.20 ట్రేడ్ అయ్యాయి.
రెండు సెషన్లలో ఈ స్టాక్ భారీ డెలివరీ ఆధారిత కొనుగోళ్లను చవిచూసింది. ఈ నేపథ్యంలో గత రెండు ట్రేడింగ్ రోజుల్లో ఈ షేర్ 28.3% జంప్ అయ్యింది. డిసెంబరు 28న రూ.13.25 నుంచి జనవరి 1న రూ.17కి పెరగడం విశేషం. సోమవారం ఇంట్రాడే గరిష్ట స్థాయి రూ.18.42కి చేరింది. ఈ క్రమంలో ఇది రూ.3,095.6 కోట్ల ట్రేడెడ్ విలువతో NSEలో టాప్ ట్రేడెడ్ స్టాక్‌గా నిలిచింది. దీంతో బీహెచ్ఈఎల్, యెస్ బ్యాంక్ వంటి దిగ్గజాల కంటే ఇది ముందుకు చేరింది.
మరోవైపు శాటిలైట్ సర్వీసెస్ (GMPCS) లైసెన్స్ ద్వారా గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్స్ కోసం Starlink ఇప్పటికే దరఖాస్తు చేసింది. ఇది త్వరలో మంజూరు చేసే అవకాశం ఉంది. ఇది బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడానికి ఉపగ్రహాలను ఉపయోగించడానికి అనుమతిస్తుంది. టెలికమ్యూనికేషన్స్ చట్టం శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడానికి స్పెక్ట్రమ్ పరిపాలనాపరమైన కేటాయింపును అనుమతిస్తుంది.
Updated Date - Jan 02 , 2024 | 05:14 PM