Layoffs: ప్రముఖ టెక్ కంపెనీలో 4 వేల ఉద్యోగాల కోత.. రోడ్డున పడ్డ 35 వేల మంది!
ABN, Publish Date - Feb 15 , 2024 | 02:42 PM
చిన్న సంస్థల్లో ఉద్యోగ భద్రత ఉండదనే కారణంతో ఉద్యోగులు పెద్ద కంపెనీల్లో చేరితే అక్కడ కూడా వారికి చేదు అనుభవమే మిగులుతుంది. రాత్రి పగలు కష్టపడి పనిచేసే ఉద్యోగి చివరికి రోడ్డున పడుతున్నాడు.
చిన్న సంస్థల్లో ఉద్యోగ భద్రత ఉండదనే కారణంతో ఉద్యోగులు పెద్ద కంపెనీల్లో చేరితే అక్కడ కూడా వారికి చేదు అనుభవమే మిగులుతుంది. రాత్రి పగలు కష్టపడి పనిచేసే ఉద్యోగి చివరికి రోడ్డున పడుతున్నాడు. దీంతో EMI వాయిదాలపై జీవించే సామాన్య ఉద్యోగి జీవితం సంక్షోభంలోకి నెట్టేస్తుంది. ఇప్పటికే ప్రముఖ టెక్ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగించగా..తాజాగా అంతర్జాతీయ సంస్థ సిస్కో(cisco) సిస్టమ్స్ కూడా 4 వేల మందిని తొలగించనున్నట్లు తెలిసింది.
సిస్కో సంస్థ నెట్‌వర్కింగ్ పరికరాల తయారీకి ప్రసిద్ధి చెందింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థలో 85,000 కంటే ఎక్కువ మంది సిబ్బంది పనిచేస్తున్నారు. రాయిటర్స్ నుంచి వచ్చిన తాజా వార్తల ప్రకారం ఈ కంపెనీ తన ఉద్యోగులలో 5 శాతం మందిని తొలగించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పింక్ స్లిప్పులు ఇచ్చి 4 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించనున్నారు.
అయితే అనేక ఇతర కంపెనీల మాదిరిగా సిస్కో కూడా ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ క్రమంలోనే ఖర్చును తగ్గించుకోవడం, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనే ప్రయత్నాల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే సిస్కో తన వార్షిక ఆదాయ లక్ష్య అంచనాను $52.5 బిలియన్ల నుంచి $51.5 బిలియన్లకు తగ్గించింది. ఈ కారణంగానే బుధవారం కంపెనీ షేర్లు 5 శాతానికి పైగా పడిపోయాయి.
Updated Date - Feb 15 , 2024 | 02:42 PM