ధర పెరిగినా పసిడికి తగ్గని గిరాకీ
ABN, Publish Date - May 01 , 2024 | 05:28 AM
ఈ ఏడాది మార్చితో ముగిసిన తొలి త్రైమాసికానికి (క్యూ1) భారత్‌లో బంగారం గిరాకీ వార్షిక ప్రాతిపదికన 8 శాతం పెరిగి 136.6 టన్నులకు చేరుకుంది. ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) మంగళవారం విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. గడిచిన కొన్ని నెలల్లో
ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 8% వృద్ధి, 136.6 టన్నులుగా నమోదు
3 నెలల్లో 19 టన్నుల గోల్డ్ కొనుగోలు చేసిన ఆర్‌బీఐ : డబ్ల్యూజీసీ వెల్లడి
న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చితో ముగిసిన తొలి త్రైమాసికానికి (క్యూ1) భారత్‌లో బంగారం గిరాకీ వార్షిక ప్రాతిపదికన 8 శాతం పెరిగి 136.6 టన్నులకు చేరుకుంది. ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) మంగళవారం విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. గడిచిన కొన్ని నెలల్లో బంగారం ధరలు భారీగా పెరిగి సరికొత్త ఆల్‌టైమ్ గరిష్ఠాలకు చేరినప్పటికీ, దేశీయంగా బలమైన ఆర్థిక వాతావరణం ఈ విలువైన లోహానికి గిరాకీ కొనసాగేందుకు దోహదపడిందని డబ్ల్యూజీసీ రిపోర్టు పేర్కొంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) సైతం దూకుడుగా బంగారం కొనుగోళ్లు జరపడం మెరుగైన వృద్ధికి మరో కారణమని నివేదిక పేర్కొం ది. గత ఏడాది జనవరి-మార్చి కాలానికి గోల్డ్ డిమాండ్ 126.3 టన్నులుగా నమోదైంది. మరిన్ని ముఖ్యాంశాలు..
విలువపరంగా, క్యూ1లో బంగారం గిరాకీ 20 శాతం వృద్ధితో రూ.75,470 కోట్లకు పెరిగింది. సమీక్షా కాలంలో దేశీయంగా బంగారం ధరల సగటు 11 శాతం పెరిగినప్పటికీ, పసిడికి డిమాండ్ రెండంకెల స్థాయిలో వృద్ధి చెందడం గమనార్హం.
మొత్తం డిమాండ్‌లో స్వర్ణాభరణాల విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 4 శాతం పెరిగి 95.5 టన్నులకు చేరుకోగా.. పెట్టుబడి అవసరాల కోసం బంగారం కడ్డీలు, నాణేల కొనుగోళ్లు 19 శాతం వృద్ధి చెంది 41.1 టన్నులకు చేరుకున్నాయి. గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎ్‌ఫ)లోకి సైతం 2 టన్నులకు పైగా పెట్టుబడులు వచ్చాయి. విలువపరంగా బంగారు ఆభరణాల విక్రయాలు 15 శాతం పెరిగి రూ.52,750 కోట్లుగా, బంగారంలో పెట్టుబడులు 32 శాతం పెరిగి రూ.22,720 కోట్లుగా నమోదయ్యాయి.
ఈ జనవరి-మార్చిలో దేశీయంగా 38.3 టన్నుల బంగారం రీసైక్లింగ్ జరిగిందని, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 10 శాతం అధికమని డబ్ల్యూజీసీ తెలిపింది.
క్యూ1లో ఆర్‌బీఐ 19 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. గత ఏడాది మొత్తానికి కొనుగోలు చేసిన 16 టన్నుల కంటే అధికమిది. ఈ ఏడాదిలో మరింత బంగారం కొనుగోలు చేయనున్నట్లు ఆర్‌బీఐ సంకేతాలిచ్చిందని డబ్ల్యూజీసీ ఇండి యా రీజినల్ సీఈఓ సచిన్ జైన్ తెలిపారు.
ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో దేశంలోకి బంగారం దిగుమతులు వార్షిక ప్రాతిపదికన 25 శాతం పెరిగి 179.4 టన్నులకు చేరుకున్నాయి. 2023లో ఇదే సమయానికి 143.4 టన్నుల బంగారం దిగుమతైంది.
క్యూ1లో ప్రపంచవ్యాప్త బంగారం డిమాండ్ 3 శాతం పెరిగి 1,238 టన్నులకు చేరుకుంది. 2016 తర్వాత గోల్డ్ గ్లోబల్ డిమాండ్‌పరంగా ఇదే అత్యంత బలమైన త్రైమాసికమని డబ్ల్యూజీసీ తన నివేదికలో పేర్కొంది.
ఈ ఏడాది దేశంలో బంగారం డిమాండ్ 700-800 టన్నుల స్థాయిలో నమోదు కావచ్చు. ధరలు మరింత ఎగబాకిన పక్షంలో పసిడి గిరాకీ వార్షిక అంచనాలోని దిగువ శ్రేణికే పరిమితం కావచ్చు. గత ఏడాది గోల్డ్ డిమాండ్ 747.5 టన్నులుగా నమోదైంది. ప్రస్తుత త్రైమాసికం (ఏప్రిల్-జూన్) విషయానికొస్తే, పసిడి ధరలు ఏప్రిల్‌లో అమాంతం పెరగడంతో పాటు ఎన్నికల ప్రక్రియ నేపథ్యంలో గిరాకీ స్తబ్దుగానే ఉండనుందని భావిస్తున్నాం.
- సచిన్ జైన్, రీజినల్ సీఈఓ, ఇండియా, డబ్ల్యూజీసీ
Updated Date - May 01 , 2024 | 05:28 AM