ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పసిడి రూ.80,000కు చేరువలో

ABN, Publish Date - Oct 19 , 2024 | 06:45 AM

బంగారం ధరలు మళ్లీ దూసుకుపోతున్నాయి. శుక్రవారం పసిడి రూ.80,000 మైలురాయికి చేరువైంది.

సరికొత్త రికార్డు స్థాయికి 10 గ్రాముల ధర

ఢిల్లీ మార్కెట్లో రూ.79,900కు చేరిక

అంతర్జాతీయ విపణిలో 2,700 డాలర్లు దాటిన ఔన్స్‌ పసిడి

న్యూఢిల్లీ: బంగారం ధరలు మళ్లీ దూసుకుపోతున్నాయి. శుక్రవారం పసిడి రూ.80,000 మైలురాయికి చేరువైంది. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్లు) బంగారం మరో రూ.550 పెరిగి సరికొత్త ఆల్‌టైం రికార్డు స్థాయి రూ.79,900కు చేరుకుంది. దేశీయంగా పసిడి ధర ఎగబాకడం వరుసగా ఇది మూడో రోజు. అంతర్జాత విపణిలో స్వర్ణం మరింత ప్రియమవడం, పండగ సీజన్‌ కావడంతో ఆభరణ వర్తకులు, స్టాకిస్టులు కొనుగోళ్లు పెంచడం ఇందుకు కారణమని ఆల్‌ ఇండియా సరాఫా అసోసియేషన్‌ తెలిపింది. పుత్తడితో పాటు వెండి కూడా ఎగబాకింది. కిలో వెండి రూ.1,000 పెరిగి రూ.94,500 ధర పలికింది. కాగా, హైదరాబాద్‌ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.870 పెరుగుదలతో రూ.78,980కి చేరుకుంది. 22 క్యారెట్ల రేటు రూ.800 పెరిగి రూ.72,400గా నమోదైంది. కిలో వెండి రూ.2,000 ఎగబాకి రూ.1.05 లక్షలు ధర పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్‌ తొలిసారిగా 2,700 డాలర్ల స్థాయిని అధిగమించి, సరికొత్త జీవితకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం ఒక దశలో 0.76 శాతం పెరిగి 2,728.10 డాలర్ల వద్దకు చేరుకుంది. సిల్వర్‌ 32.30 డాలర్ల వద్ద ట్రేడైంది.


పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న విషయంలో నెలకొన్న అనిశ్చితి కారణంగా బులియన్‌ ధరలు మళ్లీ దూసుకెళ్తున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. అంతేకాదు, అమెరికాతో పాటు అభివృద్ధి చెందిన దేశాల సెంట్రల్‌ బ్యాంక్‌లు వడ్డీ రేట్లు తగ్గిస్తుండటం కూడా పసిడి ధరలను ఎగదోస్తున్నాయని హెచ్‌డీఎ్‌ఫసీ సెక్యూరిటీస్‌ కమోడిటీస్‌ విభాగ సీనియర్‌ అనలిస్ట్‌ సౌమిల్‌ గాంధీ పేర్కొన్నారు. గత ద్రవ్యపరపతి సమీక్షలో అమెరికన్‌ సెంట్రల్‌ బ్యాంకైన ఫెడరల్‌ రిజర్వ్‌ ప్రామాణిక వడ్డీ రేటును ఏకంగా 0.5 శాతం తగ్గించింది. వచ్చే సమీక్షలో ఫెడ్‌ రేట్లు మరింత తగ్గవచ్చన్న అంచనాలున్నాయి. అంతేకాదు, యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లను గురువారం మరో 0.25 శాతం తగ్గించింది. తాజా గోల్డ్‌ ర్యాలీకి ఇది కూడా కారణమైంది.

సాధారణంగా ఫెడ్‌ రేట్లు-గోల్డ్‌ డిమాండ్‌ది విలోమ సంబంధం. ఫెడ్‌ రేట్లు పెరుగుతున్న సమయంలో బంగారం కంటే స్థిర ఆదాయాన్ని పంచే బాండ్లు, మార్కెట్‌ ఫండ్స్‌కు డిమాండ్‌ పెరుగుతుంది. వడ్డీ రేట్లు తగ్గే సందర్భంలో బాండ్ల నుంచి పెట్టుబడులు విలువైన లోహాల్లోకి మళ్లుతుంటాయి.

Updated Date - Oct 19 , 2024 | 07:20 AM