హెచ్‌సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
ABN, Publish Date - Apr 27 , 2024 | 05:35 AM
టెక్నాలజీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్ మార్చితో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం లో రూ.3,986 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో ఆర్జించిన రూ.3,983 కోట్లతో పోల్చితే లాభం
మొత్తం ఆదాయం రూ.28,499 కోట్లు ..
ఒక్కో షేరుకు రూ.18 మధ్యంతర డివిడెండ్
న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్ మార్చితో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం లో రూ.3,986 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో ఆర్జించిన రూ.3,983 కోట్లతో పోల్చితే లాభం నామమాత్రంగానే పెరిగింది. అయితే అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో ఆర్జించిన రూ.4,350 కోట్ల తో పోల్చితే మాత్రం లాభం 8.4 శాతం క్షీణించిందని కంపెనీ తెలిపింది. పన్ను చెల్లింపుల ముందు లాభం (ఎబిటా) సైౖతం ముందు త్రైమాసికంతో పోల్చితే 10.6 శాతం దిగజారి రూ.5,018 కోట్లకే పరిమితమైంది. ఇక ఇదే కాలంలో కంపెనీ ఆదాయం 7.11 శాతం పెరిగి రూ.26,606 కోట్ల నుంచి రూ.28,499 కోట్లకు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ వ్యయాలు తగ్గిపోవటంతో పాటు ఉద్యోగుల వ్యయాలు గణనీయంగా పెరగటం పనితీరుపై ప్రభావం చూపించిందని హెచ్‌సీఎల్ టెక్ సీఈఓ సీ విజయ్ కుమార్ వెల్లడించారు. మార్చి త్రైమాసికంలో ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం 12.1 శాతం, మాన్యుఫ్యాక్చరింగ్ రంగం 9.8 శాతం వృద్ధి చెందిందన్నారు. కాగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో స్థిర కరెన్సీ విలువల ప్రకారం కంపెనీ ఆదాయం 3 నుంచి 5 శాతం మేరకు, ఎబిటా మార్జిన్ 18 నుంచి 19 శాతం మేరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అయితే మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.1,09,913 కోట్ల ఆదాయంపై రూ.15,702 కోట్ల లాభం ఆర్జించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఆదాయం 8.33 శాతం, లాభం 5.73 శాతం పెరిగాయి. కంపెనీ డైరెక్టర్ల బోర్డు రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.18 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. మే 15వ తేదీన మధ్యంతర డివిడెండ్‌ను వాటాదారులకు చెల్లించనున్నట్టు కంపెనీ తెలిపింది.
10,000 మంది ఫ్రెషర్స్ నియామకాలు
మార్చి త్రైమాసికంలో ఉద్యోగులపై వ్యయాలు 11.5 శాతం మేరకు పెరిగాయని, వలస రేటు మాత్రం గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే 19.5 శాతం నుంచి 12.4 శాతానికి తగ్గిందని కంపెనీ ప్రకటించింది. కాగా మార్చి ముగిసే నాటికి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,27,481గా ఉందని పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 10,000 మంది ఫ్రెషర్స్‌ను నియమించుకున్నామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా అదే స్థాయిలో నియామకాలు చేపట్టే వీలుందని కంపెనీ చీఫ్ పీపుల్ ఆఫీసర్ రామచంద్రన్ సుందరరాజన్ తెలిపారు. 2023-24లో మొత్తం 73 డీల్స్‌ను కుదుర్చుకోగా ఇందులో 21 డీల్స్‌ను ఒక్క మార్చి త్రైమాసికంలోనే కుదుర్చుకున్నట్లు చెప్పారు.
Updated Date - Apr 27 , 2024 | 05:35 AM