గృహ రుణాలు.. రూ.27 లక్షల కోట్లు
ABN, Publish Date - May 06 , 2024 | 06:15 AM
రియల్టీ బూమ్ గృహ రుణాలకీ డిమాండ్ పెంచుతోంది. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు మంజూరు చేసిన గృహా రుణాల మొత్తం రికార్డు స్థాయిలో...
మార్చి నాటికి రికార్డు స్థాయికి చేరిక
ఆర్‌బీఐ వెల్లడి
న్యూఢిల్లీ: రియల్టీ బూమ్ గృహ రుణాలకీ డిమాండ్ పెంచుతోంది. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు మంజూరు చేసిన గృహా రుణాల మొత్తం రికార్డు స్థాయిలో రూ.27.23 లక్షల కోట్లకు చేరింది. రెండేళ్ల క్రితంతో పోలిస్తే ఇది రూ.10 లక్షల కోట్లు ఎక్కువ. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ఇందుకు సంబంధించిన తాజా గణాంకాలు విడుదల చేసింది. కొవిడ్ తర్వాత నివాస గృహాలకు డిమాండ్ విపరీతంగా పెరగడం, ప్రభుత్వ సానుకూల విధానాలు, ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ ఆప్షన్లు, సొంతింటిపై పెరిగిన మక్కువ ఇందుకు ప్రధానంగా దోహదం చేశాయి. గత రెండేళ్లలో బిల్డర్లు పెద్దఎత్తున నివాస గృహాల ప్రాజెక్టులు ప్రారంభించి అమ్మడం కూడా ఇందుకు దోహదం చేసిందని ప్రాప్‌ఈక్విటీ సీఈఓ, ఎండీ సమీర్ జసూజ తెలిపారు.
భవిష్యత్ భేష్: ఈ సంవత్సరం కూడా గృహ రుణాలకు ఢోకా ఉండదని బ్యాంకింగ్ వర్గాల అంచనా. అయితే రుణాల వృద్ధి రేటు గత రెండేళ్ల స్థాయిలో మాత్రం ఉండకపోవచ్చని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) ప్రధాన ఆర్థికవేత్త మదన్ సబ్నవిస్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏది ఎలా ఉన్నా మరో ఆరేళ్లలో గృహ రుణాల మార్కెట్ లక్ష కోట్ల డాలర్ల (ప్రస్తుత మారకం రేటు ప్రకారం సుమారు రూ.83.30 లక్షల కోట్లు) స్థాయికి చేరనుందని ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కార్తీక్ శ్రీనివాసన్ అంచనా. రెండు మూడేళ్ల క్రితం వరకు అందుబాటు ధరల గృహాలకు ఎక్కువ డిమాండ్ ఉండేది. ఇప్పుడు ఉన్నత ఆదాయ వర్గాలు ధర ఎక్కువైనా విశాలమైన నివాస గృహాల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు.
Updated Date - May 06 , 2024 | 06:15 AM