లాభాల్లో హైదరాబాద్ విమానాశ్రయం
ABN, Publish Date - Nov 05 , 2024 | 04:07 AM
జీఎంఆర్ గ్రూప్ నిర్వహణలోని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్‌ఐఏఎల్) లాభాల బాట పట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) నుంచి...
ఈ ఏడాది నుంచి డివిడెండ్ జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్
ముంబై: జీఎంఆర్ గ్రూప్ నిర్వహణలోని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్‌ఐఏఎల్) లాభాల బాట పట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) నుంచి ఈ విమానాశ్రయం డివిడెండ్ చెల్లిస్తుందని జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) సౌరబ్ చావ్లా ఎకనామిక్ టైమ్స్ పత్రికకు తెలిపారు. మరో రెండు మూడేళ్లలో తమ నిర్వహణలోని ఢిల్లీ ఎయిర్‌పోర్టూ లాభాల బాటపడుతుందన్నారు. అలాగే హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సెజ్‌లు, కార్యాలయ భవనాలు, విద్యా సంస్థలు, సీనియర్ సిటిజన్ల నివాస వసతుల కల్పన కోసం రూ.800 కోట్ల నుంచి రూ.900 కోట్లతో వివిధ నిర్మాణాలు చేపడుతున్నట్టు చావ్లా వెల్లడించారు.
భూముల నగదీకరణ: దీనికి తోడు వచ్చే ఐదేళ్లలో హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో 1,400 ఎకరాలు, ఢిల్లీ, గోవా ఎయిర్‌పోర్టులోని 200 ఎకరాలు, కొత్తగా ఏర్పాటు చేసే భోగాపురం ఎయిర్‌పోర్టులో 200 ఎకరాల్లో కొత్త వసతులు, నిర్మాణాలు చేపట్టి.. వాటి నుంచీ పెద్దఎత్తున ఆదాయ ఆర్జనకు కృషి చేస్తామని చావ్లా తెలిపారు. హైదరాబాద్, ఢిల్లీ విమానాశ్రయాల ఆధునీకరణ కోసం ఇప్పటి వరకు రూ.12,000 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు వెల్లడించారు.
అప్పుల భారం తగ్గింపే లక్ష్యం: అప్పుల భారం తగ్గించుకోవడమే లక్ష్యంగా ప్రస్తుతం తాము పని చేస్తున్నట్టు సౌరభ్ చావ్లా తెలిపారు. ఇటీవల అబుదాబీ ఇన్వె్‌స్టమెంట్ అథారిటీ (ఏడీఐఏ) సమకూర్చిన రూ.6,300 కోట్ల దీర్ఘకాలిక రుణంతో కంపెనీకి పెద్ద మొత్తంలో వడ్డీలు, అప్పుల చెల్లింపుల భారం తగ్గుతుందన్నారు. ప్రస్తుతం కంపెనీ అప్పులు- స్థూల లాభం నిష్పత్తి 6 శాతంగా ఉంది. విమానాశ్రయేతర ఆదాయాల పెంపు చర్యలు, ఏడీఐఏ సమకూర్చిన రుణాలతో వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో ఇది 3.5 నుంచి 5 శాతానికి తగ్గే అవకాశం ఉందని చావ్లా చెప్పారు.
Updated Date - Nov 05 , 2024 | 04:11 AM