ఓలా ఈ-స్కూటర్లలో.. ఇక ఓలా బ్యాటరీలు
ABN, Publish Date - Jul 01 , 2024 | 05:28 AM
ఓలా ఎలక్ట్రిక్.. తన ఎలక్ట్రిక్ స్కూటర్ల (ఈవీ)లో తాను సొంతంగా ఉత్పత్తి చేయనున్న లిథియం అయాన్ బ్యాటరీ సెల్స్‌ను వినియోగించనుంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఓలా ఎలక్ట్రిక్...
దేశీయంగా తయారీ.. వచ్చే ఏడాది అందుబాటులోకి
ఓలా ఎలక్ట్రిక్ చైర్మన్ భవిష్ అగర్వాల్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఓలా ఎలక్ట్రిక్.. తన ఎలక్ట్రిక్ స్కూటర్ల (ఈవీ)లో తాను సొంతంగా ఉత్పత్తి చేయనున్న లిథియం అయాన్ బ్యాటరీ సెల్స్‌ను వినియోగించనుంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఓలా ఎలక్ట్రిక్ పోర్టుఫోలియోలోని అన్ని స్కూటర్లను దేశీయంగా తయారు చేయనున్న బ్యాటరీలతో అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ చైర్మన్, ఎండీ భవిష్ అగర్వాల్ వెల్లడించారు. కంపెనీ తమిళనాడులోని కృష్ణగిరిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఓలా గిగా ఫ్యాక్టరీలో లిథియం అయాన్ బ్యాటరీలను ఉత్పత్తి చేయనున్నట్లు ఆయన చెప్పారు. దీంతో ఈవీ బ్యాటరీల దిగుమతుల భారం తగ్గటమే కాకుండా ఉత్పత్తి వ్యయం గణనీయంగా తగ్గనుందని తెలిపారు. ప్రస్తుతం ఈ గిగా ఫ్యాక్టరీలో ప్రయోగాత్మకంగా ఉత్పత్తిని ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. అంతర్జాతీయంగా అడ్వాన్స్‌డ్ సెల్ టెక్నాలజీతో లిథియం అయాన్ బ్యాటరీలను తయారు చేస్తున్న కంపెనీలు కొన్ని మాత్రమే ఉన్నాయని, అందులో భారత్ నుంచి ఓలా ఎలక్ట్రిక్ ఒక్కటే ఈ జాబితాలో ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌లోని ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీలు.. చైనా, తైవాన్, జపాన్, కొరియా దేశాల నుంచి పెద్దఎత్తున బ్యాటరీలను దిగుమతి చేసుకుంటాయన్నారు.
రూ.835 కోట్ల పెట్టుబడి
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం (పీఎల్‌ఐ) కింద కేంద్ర ప్రభుత్వం 30 గిగావాట్ల (జీడబ్ల్యూహెచ్) సామర్థ్యం గల ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపిందని, ఇందులో ఓలా ఒక్కటే 20 గిగావాట్ల సామర్థ్యంతో కూడిన ప్రాజెక్ట్‌ను దక్కించుకుందని భవిష్ తెలిపారు. 110 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ గిగా ఫ్యాక్టరీలో తొలుత 5 గిగావాట్ అవర్స్ (జీడబ్ల్యూహెచ్) సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన చెప్పారు. ఆ తర్వాత దశలవారీగా ఈ ప్లాంట్ పూర్తి సామర్థ్యం 100 జీడబ్ల్యూహెచ్‌కు పెంచాలని చూస్తున్నట్లు తెలిపారు. ఈ ప్లాంట్‌పై ఇప్పటికే రూ.835 కోట్ల వరకు పెట్టుడులు పెట్టినట్లు ఆయన చెప్పారు. కాగా ఇప్పటికే ఈ ప్లాంట్‌లో 1.4 జీడబ్ల్యూహెచ్ సామర్థ్యం గల బ్యాటరీలను ఉత్పత్తి చేస్తున్నట్లు అగర్వాల్ పేర్కొన్నారు. అయితే సాంప్రదాయ 2170 సెల్స్ కంటే మరింత అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలతో కూడిన 4680 సెల్స్‌ను కూడా కంపెనీ దేశీయంగా అభివృద్ధి చేసిందని, దీనికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) నుంచి సర్టిఫికేషన్ కూడా లభించిందన్నారు. ఈ బ్యాటరీలనే వచ్చే ఏడాది నుంచి తమ ఈవీల్లో వినియోగించాలని చూస్తున్నట్లు చెప్పారు. అలాగే లిథియం అయాన్ కంటే మెరుగైన సాలిడ్ స్టేట్ బ్యాటరీ్‌సపై కూడా ప్రయోగాలు జరుపుతున్నట్లు తెలిపారు.
వచ్చే ఏడాది ఓలా ఈవీ మోటార్‌సైకిళ్లు
కృష్ణగిరిలోని కంపెనీ ఫ్యూచర్ ఫ్యాక్టరీలో కంపెనీ నాలుగు ఈవీ మోడల్స్‌ను ఉత్పత్తి చేస్తోందని అగర్వాల్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 10 లక్షల యూనిట్లుగా ఉందన్నారు. అయితే డిమాండ్‌కు అనుగుణంగా ఈ ప్లాంట్‌లో ఉత్పత్తిని చేపడుతున్నామని, ప్రస్తుతం రోజుకు 2,200 యూనిట్లను ఉత్పత్తి చేస్తున్నట్లు ఆయన వివరించారు. కాగా కంపెనీ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోందన్నారు. వచ్చే ఏడాది నాటికల్లా కనీసం మూడు మోటార్ సైకిల్స్‌ను మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది.
Updated Date - Jul 01 , 2024 | 05:28 AM