ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భారత రియల్టీ మొఘల్‌ డీఎల్‌ఎఫ్‌ రాజీవ్‌ సింగ్‌

ABN, Publish Date - Jul 12 , 2024 | 04:57 AM

దేశీయ స్థిరాస్తి (రియల్టీ) రంగం కుబేరులకు కనక వర్షం కురిపిస్తోంది. భారత్‌లో అత్యంత ధనవంతులైన ఔత్సాహిక స్థిరాస్తి పారిశ్రామికవేత్తల జాబితాలో డీఎల్‌ఎఫ్‌ చీఫ్‌ రాజీవ్‌ సింగ్‌ మొదటి స్థానంలో నిలిచారు. ఈ ఏడాది...

ఈ ఏడాది మే నాటికి రూ.1.24 లక్షల కోట్ల సంపద

రెండు, మూడు స్థానాల్లో మంగళ్‌ సింగ్‌ లోధా, గౌతమ్‌ అదానీ,

అపర్ణ ఎస్టేట్స్‌, ఎన్‌సీసీ ప్రమోటర్లకూ స్థానం.. గ్రోహ్‌-హురున్‌ రియల్టీ లిస్ట్‌ వెల్లడి

ముంబై: దేశీయ స్థిరాస్తి (రియల్టీ) రంగం కుబేరులకు కనక వర్షం కురిపిస్తోంది. భారత్‌లో అత్యంత ధనవంతులైన ఔత్సాహిక స్థిరాస్తి పారిశ్రామికవేత్తల జాబితాలో డీఎల్‌ఎఫ్‌ చీఫ్‌ రాజీవ్‌ సింగ్‌ మొదటి స్థానంలో నిలిచారు. ఈ ఏడాది మే నెలాఖరు నాటికి రాజీవ్‌ సింగ్‌ సంపద విలువ రూ.1,24,420 కోట్లకు చేరింది. గురువారం విడుదలైన ‘2024 గ్రోహ్‌-హురున్‌ ఇండియా రియల్‌ ఎస్టేట్‌ 100’ జాబితాలో రాజీవ్‌ సింగ్‌ పేరు అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో రూ.91,700 కోట్లతో మాక్రోటెక్‌ డెవలపర్స్‌ కంపెనీ వ్యవస్థాపకుడు మంగళ్‌ ప్రభాత్‌ లోధా, ఆయన కుటుంబం ఉంది. కాగా విలువపరంగా అత్యంత విజయవంతమైన రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల జాబితాలో డీఎల్‌ఎఫ్‌ రూ.2 లక్షల కోట్లతో అత్యంత విలువైన కంపెనీగా అగ్రస్థానంలో ఉందని నివేదిక వెల్లడించింది.


రూ.1,36,730 కోట్లతో మాక్రోటెక్‌ రెండో స్థానంలో, ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ రూ.79,150 కోట్లతో మూడో స్థానంలో ఉంది.

గౌతమ్‌ అదానీకీ చోటు

ముకేశ్‌ అంబానీ తర్వాత దేశంలో రెండో అతిపెద్ద సంపన్నుడైన ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీకి రియల్టీ రంగమూ కలిసి వస్తోంది. రూ.56,500 కోట్ల రియల్టీ ఆస్తులతో గౌతమ్‌ అదానీ ఈ జాబితాలో మూడో స్థానం సంపాదించారు. గత ఏడాది కాలంలోనే గౌతమ్‌ అదానీ స్థిరాస్తుల విలువ ఏకంగా 62 శాతం పెరగడం విశేషం. రూ.44,820 కోట్ల రియల్టీ ఆస్తులతో ఒబెరాయ్‌ రియల్టీ అధినేత వికాస్‌ ఒబెరాయ్‌ నాలుగో స్థానంలో నిలిచారు. రహేజా గ్రూప్‌నకు చెందిన చంద్రు రహేజా అండ్‌ ఫ్యామిలీ రూ.43,710 కోట్లతో ఐదో స్థానంలో రూ.26.370 కోట్ల రియల్టీ ఆస్తులతో ది ఫీనిక్స్‌ మిల్స్‌ అధినేత అతుల్‌ రుయా జాబితాలో ఆరో స్థానంలో నిలిచారు.


ఆసియాలో మనదే పెద్ద మార్కెట్‌

చైనా రియల్టీ మార్కెట్లో కొనసాగుతున్న సంక్షోభం మన దేశానికి బాగానే కలిసొచ్చింది. దీంతో 100 కోట్ల డాలర్లు, అంతకంటే ఎక్కువ విలువ ఉన్న ఆసియా రియల్టీ కంపెనీలు మన దేశంలో 36కు చేరాయి. చైనా కంటే ఇది ఆరు కంపెనీలు ఎక్కువని గ్రోహ్‌-హురున్‌ వెల్లడించింది. సంక్షోభానికి ముందు చైనాలో ఇలాంటి రియల్టీ కంపెనీలు 100 వరకు ఉండేవి. సంక్షోభం పుణ్యమాని ఇప్పుడవి 30కి పడిపోయినట్టు తెలిపింది.

రెండు తెలుగు కంపెనీలకూ చోటు

‘2024 గ్రోహ్‌-హురున్‌ ఇండియా రియల్‌ ఎస్టేట్‌ 100’ జాబితాలో రెండు తెలుగు కంపెనీలకూ స్థానం లభించింది. రూ.33,130 కోట్ల రియల్‌ ఎస్టేట్‌ ఆస్తులతో అపర్ణ ఎస్టేట్స్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ అధినేత సుబ్రమణ్యం రెడ్డి 11వ స్థానంలో, రూ.18,040 కోట్ల రియల్టీ ఆస్తులతో ఎన్‌సీసీ లిమిటెడ్‌ అధినేత ఏవీ రంగరాజు 20వ స్థానంలో నిలిచారు. గత ఏడాది కాలంలో అపర్ణ ఎస్టేట్స్‌ రియల్టీ ఆస్తుల విలువ 24 శాతం, ఎన్‌సీసీ రియల్టీ ఆస్తుల విలువ 141 శాతం పెరిగినట్టు నివేదిక తెలిపింది. మరోవైపు ఎన్‌సీసీ 20,615 మంది ఉద్యోగులతో టాప్‌ 100 జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఇక ఈ సంవత్సరం జాబితాలో ఇద్దరు మహిళలకు స్థానం లభించింది. అందులో హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే తాజ్‌ జీవీకే అధినేత్రి ఇందిరా కృష్ణారెడ్డి ఒకరు. ఈ ఏడాది మే నాటికి ఆమె రియల్టీ ఆస్తుల విలువ రూ.2,050 కోట్లని హురున్‌ నివేదిక తెలిపింది. కాగా బెంగళూరు కేంద్రంగా ఉన్న బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజె్‌సకి చెందిన పవిత్ర శంకర్‌ ఆస్తుల విలువ రూ.29,690 కోట్లుగా ఉంది.


హైదరాబాద్‌ నుంచి 6 కంపెనీలు

గ్రోహ్‌-హురున్‌ జాబితాలో హైదరాబాద్‌ నుంచి 6 కంపెనీలకు చోటు లభించింది. ఈ కంపెనీల మొత్తం విలువ రూ.68,290 కోట్లుగా ఉంది. కాగా ముంబై నుంచి అత్యధికంగా 33 కంపెనీలు ఉండగా వాటి విలువ రూ.6,40,560 కోట్లుగా ఉంది. ఆ తర్వాతి స్థానంలో బెంగళూరు నుంచి 15 కంపెనీలు (రూ.2.13,720 కోట్లు), న్యూఢిల్లీ నుంచి 14 (రూ.87,460 కోట్లు), గురుగ్రామ్‌ నుంచి 10 (రూ.2,49,320 కోట్లు) కంపెనీలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.

Updated Date - Jul 12 , 2024 | 04:58 AM

Advertising
Advertising
<