రియల్టీలోకి ఈక్విటీ పెట్టుబడుల వెల్లువ
ABN, Publish Date - Nov 21 , 2024 | 05:55 AM
ఈ ఏడాది స్థిరాస్తి రంగంలోకి ఈక్విటీ పెట్టుబడులు వార్షిక ప్రాతిపదికన 49 శాతం వృద్ధితో 1,100 కోట్ల డాలర్లకు (రూ.92,400 కోట్లు) చేరుకోవచ్చని, తొలిసారిగా 1,000 కోట్ల డాలర్ల మైలురాయిని
49 శాతం వృద్ధితో రూ.92,400 కోట్లు వస్తాయని అంచనా
న్యూఢిల్లీ: ఈ ఏడాది స్థిరాస్తి రంగంలోకి ఈక్విటీ పెట్టుబడులు వార్షిక ప్రాతిపదికన 49 శాతం వృద్ధితో 1,100 కోట్ల డాలర్లకు (రూ.92,400 కోట్లు) చేరుకోవచ్చని, తొలిసారిగా 1,000 కోట్ల డాలర్ల మైలురాయిని దాటనున్నాయని సీఐఐ-సీబీఆర్‌ఈ సంయుక్త నివేదిక అంచనా వేసింది. గృహ, వాణిజ్య సముదాయాలకు బలమైన డిమాండ్ నెలకొనడం ఇందుకు దోహదపడనుందని పేర్కొంది. 2023లో దేశీయ రియల్టీలోకి 740 కోట్ల డాలర్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. కాగా, ఈ ఏడాదిలో గడిచిన మూడు త్రైమాసికాల్లో (జనవరి-సెప్టెంబరు) వచ్చిన పెట్టుబడులు 46 శాతం పెరిగి 890 కోట్ల డాలర్లుగా (రూ.74,760 కోట్లు) నమోదయ్యాయి. అందులో దాదాపు 40 శాతం పెట్టుబడులు సంస్థాగత, కలెక్టివ్ వెహికిల్ ఇన్వెస్టర్లకు చెందినవే. కాగా, డెవలపర్ కంపెనీల ఈక్విటీ పెట్టుబడుల వాటా 41 శాతంగా ఉంది. మొదటి మూడు త్రైమాసికాల్లో వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 600 కోట్ల డాలర్లు లేదా 65 శాతం దేశీయ ఇన్వెస్టర్లకు (ముఖ్యంగా డెవలపర్లు) చెందినవేనని నివేదిక వెల్లడించింది. కాగా, విదేశీ ఇన్వెస్టర్లు 310 డాలర్ల మేర పెట్టుబడులు పెట్టారు. అందులోనూ ఉత్తర అమెరికా, సింగపూర్ ఇన్వెస్టర్ల వాటాయే 85 శాతంగా ఉంది. వేగంగా వృద్ధి చెందుతున్న భారత స్థిరాస్తి రంగంపై ఇన్వెస్టర్ల ఆసక్తి పెరుగుతున్నదనడానికిదే నిదర్శనమని సీబీఆర్‌ఈ ఇండియా చైర్మన్, సీఈఓ అన్షుమన్ మాగజైన్ అన్నారు.
Updated Date - Nov 21 , 2024 | 05:55 AM