రికార్డు స్థాయికి ఎంఎఫ్‌ల పెట్టుబడులు
ABN, Publish Date - May 07 , 2024 | 03:14 AM
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) లో నమోదైన కంపెనీల షేర్లలో మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్) పెట్టుబడులు రికార్డు స్థాయికి చేరాయి. 2024 మార్చితో ముగిసిన త్రైమాసికంలో...
మార్చి త్రైమాసికంలో రూ.81,539 కోట్లు ఇన్వెస్ట్
11 నెలల కనిష్ఠ స్థాయికి ఎఫ్‌పీఐల వాటా
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) లో నమోదైన కంపెనీల షేర్లలో మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్) పెట్టుబడులు రికార్డు స్థాయికి చేరాయి. 2024 మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఈ కంపెనీల ఈక్విటీలో ఎంఎఫ్‌ల పెట్టుబడులు గతంలో ఎన్నడూ లేని విధంగా 8.92 శాతానికి చేరాయి. 2023 డిసెంబరు త్రైమాసికంతో పోలిస్తే ఇది 0.11 శాతం ఎక్కువ. మార్చి త్రైమాసికంలో ఎంఎఫ్‌లు.. ఈక్విటీ మార్కెట్‌లో రూ.81,539 కోట్లు పెట్టుబడి పెట్టాయి.
ఎల్‌ఐసీదే అగ్రస్థానం
ఎన్‌ఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల షేర్లలో సంస్థాగత మదుపరుల పెట్టుబడుల విషయంలో ఎల్‌ఐసీదే అగ్రస్థానం. ఈ ఏడాది మార్చి నెలాఖరుకు ఎన్‌ఎస్‌ఈలో లిస్టయిన దాదాపు 280 కంపెనీల ఈక్విటీలో ఎల్‌ఐసీ ఒక శాతానికి పైగా వాటా కలిగి ఉంది. మొత్తం పెట్టుబడులను పరిగణనలోకి తీసుకుంటే 2023 డిసెంబరు త్రైమాసికానికి ఈ కంపెనీల ఈక్విటీలో ఎల్‌ఐసీకి సగటున 3.64 శాతం వాటా ఉంది. మార్చి త్రైమాసికానికి ఇది 3.75 శాతానికి పెరిగింది.
తగ్గిన ఎఫ్‌పీఐల వాటా
అయితే ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో ఎన్‌ఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల ఈక్విటీలో విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) పెట్టుబడులు 18.19 శాతం నుంచి 17.68 శాతానికి పడిపోయాయి. గత 11 ఏళ్లలో ఎఫ్‌పీఐల పెట్టుబడులు ఈ స్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి. ఇదే సమంయలో ఎంఎఫ్‌లు, బీమా కంపెనీలు, బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ వంటి దేశీయ సంస్థాగత మదుపరుల (డీఐఐ) పెట్టుబడుల వాటా 15.96 శాతం నుంచి 16.05 శాతానికి పెరిగాయి.
మార్చి త్రైమాసికంలో ఈ సంస్థలన్నీ కలిసి దేశీయ స్టాక్ మార్కెట్లో రూ.1.08 లక్షల కోట్లు మదుపు చేయడం ఇందుకు ప్రధాన కారణం. పెట్టుబడుల జోరు ఇదే స్థాయిలో కొనసాగితే వచ్చే కొద్ది త్రైమాసికాల్లో డీఐఐల పెట్టుబడులు ఎఫ్‌పీఐలను మించి పోతాయని ప్రైమ్‌డేటా బేస్ గ్రూప్ ఎండీ ప్రణవ్ హల్డియా అంటున్నారు.
Updated Date - May 07 , 2024 | 03:14 AM