మణిపాల్‌సిగ్నాపై ఎల్‌ఐసీ ఆసక్తి!?
ABN, Publish Date - Nov 29 , 2024 | 05:58 AM
ఆరోగ్య బీమా సంస్థ మణిపాల్‌సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్‌లో 50 శాతం వాటా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్‌ఐసీ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థలో వాటా...
సంస్థలో 50ు వాటా కొనుగోలు ద్వారా ‘ఆరోగ్య బీమా’లోకి ప్రవేశం
న్యూఢిల్లీ: ఆరోగ్య బీమా సంస్థ మణిపాల్‌సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్‌లో 50 శాతం వాటా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్‌ఐసీ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థలో వాటా కొనుగోలు ద్వారా ఎల్‌ఐసీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలోకి ప్రవేశించినట్లవుతుంది. త్వరలో ఆరోగ్య బీమాలో సేవల్లోకీ అడుగు పెడతామని, ఈ విభాగానికి చెందిన ఏదైనా కంపెనీలో వాటా కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు ఎల్‌ఐసీ సీఈఓ, ఎండీ సిద్ధార్థ మొహంతీ ఈ మధ్య వెల్లడించారు. మణిపాల్‌సిగ్నా యాజమాన్యంతో ఎల్‌ఐసీ చర్చలింకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని, ఇరు వర్గాలు నాన్ డిస్‌క్లోజర్ ఒప్పందం చేసుకొని చర్చలను ప్రారంభించాయని తెలిసింది. దేశీయ సాధారణ బీమా మార్కెట్ పరిమాణం రూ.3 లక్షల కోట్ల స్థాయికి చేరుకోగా.. అందులో హెల్త్ ఇన్సూరెన్స్ విభాగ వాటా 37 శాతంగా ఉంది.
బెంగళూరుకు చెందిన మణిపాల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ గ్రూప్, అమెరికన్ ఇన్సూరెన్స్ కంపెనీ సిగ్నా కార్పొరేషన్ ఉమ్మడి భాగస్వామ్యంలో ఏర్పాటు చేసిన సంస్థే మణిపాల్‌సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్. ఇందులో మణిపాల్ గ్రూప్ 51 శాతం, సిగ్నా కార్పొరేషన్ 49 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఎల్‌ఐసీకి వాటా విక్రయంలో భాగంగా ఈ భాగస్వామ్య సంస్థలో మణిపాల్ గ్రూప్‌తోపాటు సిగ్నా కార్ప్ కూడా వాటాను తగ్గించుకోనున్నట్లు సమాచారం. ఈ ఒప్పందంలో భాగంగా మణిపాల్‌సిగ్నా విలువను రూ. 4,000 కోట్లుగా లెక్కగట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Updated Date - Nov 29 , 2024 | 05:58 AM