ఈ ఏడాది స్టాక్ మార్కెట్లో ఎల్‌ఐసీ పెట్టుబడులు 1.30 లక్షల కోట్లు
ABN, Publish Date - Aug 12 , 2024 | 01:49 AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఈక్విటీ మార్కెట్లో రూ.1.30 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) ఎండీ, సీఈఓ సిద్ధార్ధ మొహంతి వెల్లడించారు...
ఈ ఏడాది స్టాక్ మార్కెట్లో
ఎల్‌ఐసీ పెట్టుబడులు 1.30 లక్షల కోట్లు
సంస్థ ఎండీ, సీఈఓ సిద్ధార్థ మొహంతి వెల్లడి
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఈక్విటీ మార్కెట్లో రూ.1.30 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) ఎండీ, సీఈఓ సిద్ధార్ధ మొహంతి వెల్లడించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసీ స్టాక్ మార్కెట్లో రూ.132 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టిందని, ఈ ఏడాది కూడా అదే స్థాయిలో ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో పలు షేర్లలో రూ.38,000 కోట్లు పెట్టుబడిగా పెట్టినట్లు ఆయన చెప్పారు. ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడుల ద్వారా ఎల్‌ఐసీ జూన్ త్రైమాసికంలో రూ.15,500 కోట్ల లాభం ఆర్జించిందన్నారు. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో ఆర్జించిన లాభం కన్నా ఇది 13.5 శాతం అధికమని ఆయన చెప్పారు. ఎల్‌ఐసీ పెట్టుబడులకు సంబంధించి మరిన్ని వివరాలు..
గత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో ఎల్‌ఐసీ ఈక్విటీ మార్కెట్ పెట్టుబడులు రూ.23,300 కోట్లుగా ఉన్నాయి.
ఈ ఏడాది జూన్ 30 నాటికి వివిధ కంపెనీల్లో ఎల్‌ఐసీ పెట్టుబడుల మొత్తం విలువ రూ.15 లక్షల కోట్లకు చేరింది. అదే తేదీ నాటికి మొత్తం 282 కంపెనీల్లో ఎల్‌ఐసీ పెట్టుబడులున్నాయి.
జూన్ చివరి నాటికి ఎల్‌ఐసీ నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ 16.22 శాతం పెరిగి రూ.53,58,781 కోట్లకు చేరింది. గత ఏడాది జూన్ చివరికి ఈ విలువ రూ.46,11,067 కోట్లుగా ఉంది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసీ మొత్తం పెట్టుబడులు రూ.7,30,662 కోట్ల మేరకు పెరిగి రూ.42,44,852 కోట్ల (2023 మార్చి 31) నుంచి రూ.49,75,514 కోట్లకు (2024 మార్చి 31) చేరింది.
మొత్తం పెట్టుబడిలో ఈక్విటీ పెట్టుబడుల వాటా 2022-23లో రూ.8,39,622 కోట్లుగా ఉండగా 2024 మార్చి 31 నాటికి రూ.12,39,740 కోట్లకు చేరింది. ఇదే కాలంలో ఇతర విభాగాల్లో పెట్టుబడులు రూ.34,05,190 కోట్ల నుంచి రూ.37,35,774 కోట్లకు పెరిగాయి.
Updated Date - Aug 12 , 2024 | 01:50 AM