ఎల్‌ఐసీ లాభం రూ.7,621 కోట్లు
ABN, Publish Date - Nov 09 , 2024 | 06:15 AM
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం భారతీయ జీవిత బీమా కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) సెప్టెంబరు 30వ తేదీతో ముగిసిన రెండో త్రైమాసిక నికర లాభంలో 3.8 శాతం క్షీణత నమోదు చేసింది.
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం భారతీయ జీవిత బీమా కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) సెప్టెంబరు 30వ తేదీతో ముగిసిన రెండో త్రైమాసిక నికర లాభంలో 3.8 శాతం క్షీణత నమోదు చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే లాభం రూ.7,925 కోట్ల నుంచి రూ.7,621 కోట్లకు తగ్గింది. అయితే ప్రీమియంల ద్వారా సమకూరిన ఆదాయం మాత్రం రూ.1,09,397 కోట్ల నుంచి రూ.1,19,901 కోట్లకు పెరిగింది. ఇతర ఆదాయం మాత్రం రూ.248 కోట్ల నుంచి రూ.145 కోట్లకు పడిపోయింది. క్యూ2 మొత్తం ఆదాయం రూ.2,29,620 కోట్లుగా, మొత్తం వ్యయాలు రూ.2,22,366 కోట్లుగా నమోదయ్యాయి. సాల్వెన్సీ నిష్పత్తి 190 శాతం నుంచి 198 శాతానికి పెరిగింది. రెండో త్రైమాసికం ముగిసే నాటికి స్థూల మొండి బకాయిలు (ఎన్‌పీఏ) 2.43 శాతం నుంచి 1.72 శాతానికి తగ్గాయి. కొత్త ప్రీమియం ఆదాయం రూ.29,538 కోట్లుగా నమోదైంది.
ఆరోగ్య బీమాలోకి ప్రవేశం
ఆరోగ్య బీమా అందిస్తున్న ఏదైనా ఒక కంపెనీలో వాటాలు కొనుగోలు చేసే విషయంలో నిర్ణయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తీసుకుంటామని ఎల్‌ఐసీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సిద్ధార్థ మొహంతి తెలిపారు. ప్రస్తుతం క్షేత్రస్థాయి పని జరుగుతోందని, సరైన కంపెనీ కోసం అన్వేషణ కొనసాగుతున్నదని ఆయన చెప్పారు. ఎంత మొత్తంలో వాటా తీసుకుంటారు అన్న ప్రశ్నకు కంపెనీ విలువ సహా పలు అంశాలపై అది ఆధారపడి ఉంటుందన్నారు. క్షేత్ర స్థాయి పని పూర్తి కాగానే అనుమతి కోరుతూ బోర్డుకు ప్రతిపాదన పంపుతామని మొహంతి తెలిపారు.
Updated Date - Nov 09 , 2024 | 06:15 AM