ఎగుమతులపై మారుతి ఫోకస్
ABN, Publish Date - Apr 08 , 2024 | 05:57 AM
మార్చితో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరంలో రికార్డు ఎగు మతులు నమోదు చేసిన దేశీయ కార్ల దిగ్గజం ఆ జోరును కొనసాగించి కొత్త ఆర్థిక సంవత్సరంలో 3 లక్షల ఎగుమతుల మైలురాయిని...
2030 నాటికి 8 లక్షలు టార్గెట్
న్యూఢిల్లీ: మార్చితో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరంలో రికార్డు ఎగు మతులు నమోదు చేసిన దేశీయ కార్ల దిగ్గజం ఆ జోరును కొనసాగించి కొత్త ఆర్థిక సంవత్సరంలో 3 లక్షల ఎగుమతుల మైలురాయిని చేరాలని భావిస్తోంది. అలాగే 2030 నాటికి 8 లక్షల కార్ల ఎగుమతుల లక్ష్యం నిర్దేశించుకుంది. 100 పైగా దేశాలకు మారుతి సుజుకీ కార్లు ఎగుమతులు చేస్తోంది. ఈ మార్కెట్లన్నింటిలోనూ రాబోయే కాలంలో మరిన్ని కొత్త కార్లు విడుదల చేయాలని కూడా మారుతి యాజమాన్యం నిర్ణయించింది. అలాగే పంపిణీ నెట్‌వర్క్ విస్తరించడంతో పాటు డీలర్‌షిప్‌ల వద్దనే బ్యాంక్ ఫైనాన్సింగ్, సర్వీసింగ్ సదుపాయాల పటిష్ఠతపై దృష్టి సారించాలని కూడా భావిస్తోంది. కొద్ది కాలం క్రితం వరకు తమ ఎగుమతులు 1 నుంచి 1.2 లక్షల పరిధిలోనే ఉండేవని, 2022-23లో 2.59 లక్షలు, 2023-24లో 2.83 లక్షల కార్లు ఎగుమతి చేయగలిగామని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాహుల్ భారతి తెలిపారు. ఇతర కంపెనీల ఎగుమతులు దిగజారిన సమయంలో సైతం తాము 9 శాతం వృద్ధిని సాధించగలగడం విశేషమని ఆయన చెప్పారు. ప్రస్తుత కార్లనే కాకుండా ఈ ఏడాదిలో ఉత్పత్తి ప్రారంభించనున్న విద్యుత్ కార్లను సైతం జపాన్, యూరప్ వంటి మార్కెట్లకు ఎగుమతి చేయాలని నిర్ణయించామన్నారు. 2030 నాటికి ఎగుమతులను 7.5 లక్షల నుంచి 8 లక్షలకు పెంచడం తమ లక్ష్యమని ఆయన చెప్పారు. ఈ ఏడాది 3 లక్షల ఎగుమతుల మైలురాయిని దాటగలమన్న విశ్వాసం ఆయన ప్రకటించారు. ప్రస్తుత తాము ఉత్పత్తి చేస్తున్న మోడళ్లన్నీ 100 మార్కెట్లలోనూ అందుబాటులో లేవని, ఈ కారణంగా మరిన్ని దేశాల్లో మరిన్ని మోడళ్లను ప్రవేశపెట్టనున్నామని రాహుల్ వెల్లడించారు. దీనికి తోడు భారతదేశంలో తాము అనుసరిస్తున్న ఉత్తమ మార్కెటింగ్ వ్యూహాలన్నీ ప్రవేశపెట్టడం వల్ల ఆయా దేశాల కస్టమర్లలో విశ్వాసం పెరుగుతుందని భావి స్తున్నట్టు చెప్పారు. ఇటీవలే ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరంలో తాము 2,83,067 కార్లు ఎగుమతి చేసినట్లు ఆయన తెలిపారు. విదేశాలకు తాము భారీగా ఎగుమతి చేస్తున్న మోడళ్లలో బాలెనో, డిజైర్, స్విఫ్ట్, ఎస్‌ప్రెసో, గ్రాండ్ విటారా, జిమ్నీ, సెలీరియో, ఎర్టిగా ఉన్నాయని చెప్పారు.
Updated Date - Apr 08 , 2024 | 06:00 AM