2025 డిసెంబరు నాటికి నిఫ్టీ @: 26,100
ABN, Publish Date - Dec 15 , 2024 | 02:27 AM
ఈ ఏడాది దేశీయ స్టాక్ మార్కెట్ భారీ ఒడుదుడుకులకు లోనైంది. వరుస రికార్డులు మురిపించగా.. భారీ పతనాలు కుదిపేశాయి. ఈ సెప్టెంబరులో సరికొత్త జీవితకాల గరిష్ఠ స్థాయి 26,277 వద్దకు ఎగబాకిన నిఫ్టీ..
2025 డిసెంబరు నాటికి నిఫ్టీ @ : 26,100
కోటక్ సెక్యూరిటీస్ అంచనా
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఈ ఏడాది దేశీయ స్టాక్ మార్కెట్ భారీ ఒడుదుడుకులకు లోనైంది. వరుస రికార్డులు మురిపించగా.. భారీ పతనాలు కుదిపేశాయి. ఈ సెప్టెంబరులో సరికొత్త జీవితకాల గరిష్ఠ స్థాయి 26,277 వద్దకు ఎగబాకిన నిఫ్టీ.. విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు పోటెత్తించడంతో అక్టోబరు, నవంబరులో భారీ నష్టాలను చవిచూసింది. ప్రస్తుతం సూచీ 24,750 ఎగువ స్థాయిలో ట్రేడవుతోంది. అయినప్పటికీ, ఈ ఏడాదిలో ఇప్పటివరకు సూచీ 11 శాతం మేర వృద్ధి కనబరిచింది. అయితే, వచ్చే ఏడాదిలో మార్కెట్ పనితీరుపై కోటక్ సెక్యూరిటీస్ అప్రమత్తతతో కూడిన ఆశాభావాన్ని వ్యక్తపరిచింది. 2025 డిసెంబరు నాటికి నిఫ్టీ 26,100 వద్దకు చేరవచ్చని తాజా నివేదికలో అంచనా వేసింది. ప్రస్తుత స్థాయితో పోలిస్తే, వచ్చే ఏడాది కాలంలో సూచీ కేవలం 6 శాతం వృద్ధి కనబరిచే అవకాశం ఉంది.
ఐటీ, ఫార్మా పనితీరు మెరుగ్గా ఉండే చాన్స్
సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు రెండేళ్ల కనిష్ఠ స్థాయి 5.4 శాతానికి జారుకుంది. అక్టోబరులో రిటైల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 6 శాతానికి ఎగువన నమోదైంది. నవంబరులో 5.48 శాతానికి దిగివచ్చినప్పటికీ.. ఇంకా ఆందోళనకర స్థాయిలోనే ఉంది. నెమ్మదించిన వృద్ధి, దిగిరానంటోన్న ధరలతో పాటు అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య విధానాలు, సుంకాల వడ్డనలు, బలోపేతమవుతున్న డాలర్ వంటి అంశాలు మార్కెట్లకు సవాళ్లుగా పరిణమించవచ్చని కోటక్ సెక్యూరిటీస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఈక్విటీ రిటర్నులపై పెద్దగా ఆశలు పెట్టుకోవద్దని సూచిస్తోంది.
కొత్త సంవత్సరంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎ్‌ఫఎస్‌ఐ), ఐటీ, రియల్టీ, ఫార్మా అండ్ హెల్త్‌కేర్ రంగాలు మెరుగైన పనితీరు కనబరిచే అవకాశం ఉందని నివేదికలో పేర్కొంది. ఇప్పటికే చాలా కంపెనీల షేర్లు అధిక ధరల వద్ద ట్రేడవుతున్న నేపథ్యంలో ఆకర్షణీయ ధరల్లో లభిస్తోన్న నాణ్యమైన స్టాక్స్‌ను ఎంచుకోవడం మేలని కోటక్ సూచిస్తోంది.
వచ్చే డిసెంబరు నాటికి నిఫ్టీ అంచనా
బుల్ ట్రెండ్ 28,800
బేరిష్ ట్రెండ్ 23,300
బేస్ కేస్ 26,100
రూపాయి మరింత పతనం
వచ్చే ఏడాదిలో రూపాయి విలువ మరింత క్షీణించవచ్చని కోటక్ సెక్యూరిటీస్ భావిస్తోంది. వచ్చే ఏడాది చివరి నాటికి డాలర్‌తో రూపాయి మారకం రేటు రూ.86/87 స్థాయికి చేరవచ్చని అంచనా వేసింది. డాలర్ ఆధిపత్యమే లక్ష్యంగా ట్రంప్ చేపట్టనున్న ఆర్థిక, వాణిజ్య విధానాలు, సుంకాలు వడ్డనలు ప్రపంచ మార్కెట్లను, కరెన్సీలను తీవ్రంగా ప్రభావితం చేయవచ్చని బ్రోకరేజీ సంస్థ అభిప్రాయపడింది.
Updated Date - Dec 15 , 2024 | 02:27 AM