చైనాకూ మేలు చేసేలా మన ఈవీ పాలసీ!?
ABN, Publish Date - Mar 31 , 2024 | 02:22 AM
దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) తయారీని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న విధానపరమైన చర్యలు భారత్‌లోకి పెద్ద ఎత్తున చైనా వాహన కంపెనీల ప్రవేశానికి బాటలు వేయవచ్చని...
పెద్ద ఎత్తున చైనా కంపెనీల ఎంట్రీకి దోహదం..
ఆ దేశం నుంచి ఈవీ బ్యాటరీలతో పాటు
ఇతర దిగుమతులు మరింత పెరిగే చాన్స్ : జీటీఆర్‌ఐ
న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) తయారీని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న విధానపరమైన చర్యలు భారత్‌లోకి పెద్ద ఎత్తున చైనా వాహన కంపెనీల ప్రవేశానికి బాటలు వేయవచ్చని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జీటీఆర్‌ఐ) అభిప్రాయపడింది. చైనా ప్రభుత్వ మద్దతుతో ఆ దేశంలోని ఆటో పరిశ్రమ ఈవీ టెక్నాలజీలో శరవేగంగా వృద్ధి చెందింది. దాంతో ఈవీలు, వాటి విడిభాగాల ఎగుమతిలో ప్రపంచ అగ్రగామి దేశంగా ఎదిగిందని జీటీఆర్‌ఐ రిపోర్టు పేర్కొంది. ఈవీ తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వ చర్యలతోపాటు ప్రైవేట్ రంగ ప్రయత్నాలతో చైనా నుంచి వాహన విడిభాగాల దిగుమతి అన్యూహంగా పెరగనుందని ఈ నివేదిక అంటోంది. గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో భారత వాహన పరిశ్రమ 2,030 కోట్ల డాలర్ల విలువైన వాహన విడిభాగాలను దిగుమతి చేసుకోగా.. అందులో 30 శాతం చైనా నుంచి వచ్చినవే.
ఈవీ తయారీలో మెజారిటీ వాటా చైనాదే..
దేశంలో ఈవీలపై వినియోగదారుల ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో చైనా నుంచి వాహన విడిభాగాల దిగుమతి మరింత జోరందుకోవచ్చని జీటీఆర్‌ఐ పేర్కొంది. ఎందుకంటే, ఈవీ విడిభాగాల ఎగుమతిలో ఇప్పటికీ చైనాదే ఆధిపత్యం. ఈవీ బ్యాటరీల ఉత్పత్తి సామర్థ్యంలో 75 శాతం, ప్రపంచవ్యాప్తంగా ఈవీల ఉత్పత్తి, ఎగుమతుల్లో 50 శాతం వాటా చైనాదే. మరికొన్నేళ్లలో భారత రోడ్లపైకి వచ్చే ప్రతి మూడు ఈవీల్లో ఒకటి చైనా కంపెనీ లేదా దేశీయ కంపెనీ భాగస్వామ్యంతో చైనా సంస్థ తయారు చేసినదే అయి ఉంటుందని జీటీఆర్‌ఐ రిపోర్టు అంచనా వేసింది. చైనా ఆటో కంపెనీలకు భారత మార్కెట్లోకి ప్రవేశం భారీ ఊరట కల్పించనుందని జీటీఆర్‌ఐ వ్యవస్థాపకులు అజయ్ శ్రీవాస్తవ అన్నారు. ఎందుకంటే, యాంటీ సబ్సిడీ దర్యాప్తులతో పాటు సబ్సిడీ కార్లు, ఈవీ బ్యాటరీల ఎగుమతులపై వాణిజ్య ఆంక్షల కారణంగా యూరప్, అమెరికాకు చైనా ఈవీల ఎగుమతులు తగ్గుతున్నాయని అన్నారు.
ఇప్పటికే భారత్‌లోకి ప్రవేశించిన పలు కంపెనీలు
చైనాకు చెందిన అతిపెద్ద వాహన తయారీ సంస్థ ఎస్‌ఏఐసీ, భారత వ్యాపార దిగ్గజాల్లో ఒకటైన జేఎ్‌సడబ్ల్యూ గ్రూప్ ఉమ్మడి భాగస్వామ్యం (జేవీ)లో జేఎ్‌సడబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఏర్పాటైంది. బ్రిటిష్ కార్ల బ్రాండైన ఎంజీ మోటార్‌ను ఎస్‌ఏఐసీ గతంలో కొనుగోలు చేసింది. 2019లో భారత్‌లోకి ప్రవేశించిన ఎంజీ మోటార్.. ఇప్పటివరకు దాదాపు 2 లక్షల కార్లను విక్రయించింది. ప్రస్తుతం ఎంజీ మోటార్ హెక్టార్, ఆస్టర్, గ్లోస్టర్‌తోపాటు జెడ్‌ఎస్ ఈవీ, కొమెట్ ఈవీ మోడళ్లను విక్రయిస్తోంది. రూ.5,000 కోట్ల పెట్టుబడితో వాహన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనున్నట్లు జేవీ కంపెనీ జేఎ్‌సడబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తాజాగా ప్రకటించింది. అలాగే, ఈ సెప్టెంబరు నుంచి ప్రతి 3-6 నెలలకు ఒక కొత్త మోడల్ కారును మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. అంతేకాదు, చైనాకు చెందిన మరో కార్ల కంపెనీ బీవైడీ సైతం భారత్‌లో పలు ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, ట్రక్కులను విక్రయిస్తోంది. చైనాకు చెందిన చంగన్ ఆటోమొబైల్, జింకో సోలార్‌తోపాటు జోంగ్‌టాంగ్, ఫోటాన్ మోటార్స్ వంటి బస్సు, ట్రక్కుల తయారీ కంపెనీలు సైతం భారత మార్కెట్లో తమ ఉనికిని కలిగి ఉన్నాయి.
Updated Date - Mar 31 , 2024 | 02:22 AM