RBI Rates : ఎనిమిదోసారీ అదే రేటు
ABN, Publish Date - Jun 08 , 2024 | 06:15 AM
బ్యాంకింగ్ రంగంలో వడ్డీ రేట్ల ధోరణులకు దిక్సూచిగా పరిగణించే రెపో రేటును యథాతథంగా కొనసాగించాలన్న రిజర్వ్ బ్యాంక్ నిర్ణయంతో మరో రెండు నెలల పాటు గృహ,
యథాతథ స్థితికే ఆర్‌బీఐ మొగ్గు.. 6.50 శాతం వద్దే రెపో రేటు
వడ్డీ రేట్ల తగ్గింపునకు ఎంపీసీలో పెరుగుతున్న మద్దతు
అందరి ఊహలకు అనుగుణంగానే భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కీలక రెపో రేటును యథాతథంగా కొనసాగించింది. ఫలితంగా అది 6.50 శాతం వద్ద నిలకడగా ఉంది. రెపో రేటులో యథాతథ స్థితిని కొనసాగించడం వరుసగా ఇది ఎనిమిదో సారి. గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఆర్‌బీఐ రెపో రేటు విషయంలో ఇదే ధోరణి అనుసరిస్తూ వస్తోంది. అయితే రేటు తగ్గింపునకు ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ)లో క్రమంగా బలం పెరుగుతున్న సంకేతాలు మాత్రం కనిపించాయి.
ముంబై: బ్యాంకింగ్ రంగంలో వడ్డీ రేట్ల ధోరణులకు దిక్సూచిగా పరిగణించే రెపో రేటును యథాతథంగా కొనసాగించాలన్న రిజర్వ్ బ్యాంక్ నిర్ణయంతో మరో రెండు నెలల పాటు గృహ, వాహన, రిటైల్ రుణాలపై వడ్డీ భారం ఇప్పుడున్నట్టుగానే కొనసాగనుంది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన మూడు రోజుల పాటు సమావేశమైన ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) 4:2 మెజారిటీతో రెపో రేటులో యథాతథ స్థితి కొనసాగింపు నిర్ణయం తీసుకుంది. మార్చితో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఊహాతీతంగా బలమైన 8.2 శాతం వృద్ధి రేటు నమోదు కావడం, ఏప్రిల్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ కట్టడి పరిధి కన్నా పై స్థాయిలో 4.83 శాతంగా ఉండడం రెండింటినీ పరిగణనలోకి తీసుకుని ఎంపీసీ ఈ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఎంపీసీ నిర్ణయాలను దాస్ ప్రకటించారు.
వృద్ధి రేటు అంచనా 7.2 శాతం
2024-25 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాలను ఆర్‌బీఐ 7.2 శాతానికి పెంచింది. ఆసియాలో మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ గత ఏడాది అందరి ఊహలను మించి బలమైన వృద్ధి రేటును సాధించినందు వల్ల ఈ ఏడాది వృద్ధి అంచనాలను తాము గతంలో ప్రకటించిన 7 శాతం నుంచి 7.2 శాతానికి పెంచామని దాస్ వెల్లడించారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం, డిమాండ్ పెరిగినట్టు ఆయన చెప్పారు. దీనికి తోడు పట్టణ ప్రాంతాల్లో కూడా విచక్షణాత్మక వ్యయాలు పెరిగాయని, పెరిగిన వినియోగ డిమాండ్‌కు దీటుగా దేశంలో తయారీ రంగం కార్యకలాపాలు కూడా పెరగనున్నాయని ఆయన అన్నారు.
బల్క్ డిపాజిట్ల పరిమాణం రూ.3 కోట్లకు పెంపు
బ్యాంకుల ఆస్తుల నిర్వహణను బలోపేతం చేయడం లక్ష్యంగా బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల గరిష్ఠ పరిమాణాన్ని ఆర్‌బీఐ రూ.3 కోట్లకు పెంచింది. ప్రస్తుతం ఈ పరిమితి రూ.2 కోట్లుగానే ఉంది. సాధారణ ఎఫ్‌డీలతో పోల్చితే ఇలాంటి డిపాజిట్లపై వడ్డీ రేటు స్వల్పంగా అధికంగా ఉంటుంది. ఈ నిర్ణయానికి అనుగుణంగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మినహా షెడ్యూల్డ్ వాణి జ్య బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల కు సంబంధించి బల్క్ డిపాజిట్ నిర్వచనాన్ని ‘‘రూ.3 కోట్లు, ఆ పైబడిన సింగిల్ రూపీ టర్మ్ డిపాజిట్’’గా మార్చినట్టు దాస్ వెల్లడించారు. దీనివల్ల బ్యాంకులు బల్క్, రిటైల్ డిపాజిట్లను వర్గీకరించడం తేలిక అవుతుందన్నారు.
అన్‌సెక్యూర్డ్ రుణాలపై వ్యూహాలకు పదును
దీర్ఘకాలంగా నిలకడగా ఉండిపోయిన రుణాలు, డిపాజిట్ల వృద్ధిలో వ్యత్యాసం పూడ్చుకునేందుకు బ్యాంకులు తమ వ్యూహాల్లో అవసరమైన మార్పులు చేసుకోవచ్చని దాస్ చెప్పారు. అవసరమైతే సెక్యూరిటీ లేని రుణాల్లో వృద్ధిని కట్టడి చేయవచ్చని సూచించారు. అన్‌సెక్యూర్డ్ రిటైల్ రుణాల్లో మితిమీరిన వృద్ధి, బ్యాంక్ రుణాలపై ఎన్‌బీఎ్‌ఫసీల అధిక ఆధారనీయత పట్ల గత నవంబరులో ఆర్‌బీఐ ఆందోళన ప్రకటించిన నేపథ్యంలో ఈ సూచనకు ప్రాధాన్యత ఉంది. ఇలాంటి రుణాల పరిమాణం కొంత తగ్గినట్టు తాజా గణాంకాలు తెలుపుతున్నాయన్నారు.
‘‘ద్రవ్యోల్బణ కట్టడికే ద్రవ్య విధానంలో ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని 4 శాతానికి కుదించాలన్న లక్ష్యానికి మేం కట్టుబడి ఉన్నాం. ధరల్లో నిలకడతో కూడిన స్థిరత్వం ఏర్పడినట్టయితే అధిక వృద్ధికి బలమైన పునాది దానికదే ఏర్పడుతుంది. ద్రవ్యోల్బణం ఆశించిన రీతిలోనే తగ్గుతోంది. కాని 4 శాతానికి కట్టడి చేయడం అనేది చాలా కష్టమైన పని అనడంలో సందేహం లేదు. కాని దాన్ని సాధించేందుకు మేం కృషి చేస్తాం’’
- శక్తికాంత దాస్, గవర్నర్, ఆర్‌బీఐ
ఇతర ముఖ్యాంశాలు
విదేశీ వాణిజ్యంలో మారుతున్న ధోరణులకు అనుగుణంగా విదేశీ ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) 1999 కింద వస్తుసేవల ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన మార్గదర్శకాలు హేతుబద్ధం చేయనున్నారు. దీనివల్ల వ్యాపార నిర్వహణ మరింత సరళమై బ్యాంకుల అధీకృత డీలర్లకు మరింత నిర్వహణాపరమైన వెసులుబాటు ఏర్పడుతుంది. వీటికి సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో వెలువడనున్నాయి.
విదేశీ మారక నిల్వలు మే 31వ తేదీతో ముగిసిన వారంలో 483.7 కోట్ల డాలర్ల మేరకు పెరిగి 65,151 కోట్ల డాలర్లకు చేరాయి. ఇది చారిత్రక గరిష్ఠ స్థాయి. అయితే బంగారం నిల్వలు 21.2 కోట్ల డాలర్ల మేరకు తగ్గి 5650.1 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి.
బ్రిటన్ నుంచి 100 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలను వెనక్కి తీసుకురావడంపై అనవసర ఆందోళన అవసరం లేదు. దేశీయంగా తగినంత నిల్వ సామర్థ్యం ఉన్నందు వల్లనే బంగారం తిరిగి తెచ్చాం. అంతకు మించి ఆలోచించవద్దు. దేశంలో బంగారం నిల్వలు 2024 ఆర్థిక సంవత్సరంలో 27.46 మెట్రిక్ టన్నులు పెరిగి 822 మెట్రిక్ టన్నులకు చేరింది. అందులో అధిక శాతం విదేశాల్లోనే నిల్వ ఉంది.
నలుగురు ఇటు.. ఇద్దరు అటు
ఎంపీసీలో రేట్ల తగ్గింపునకు మద్దతు పెరిగింది. గత సమావేశాల్లో సభ్యుల్లో ఒకరు మాత్రమే రేట్ల తగ్గింపునకు మద్దతు ప్రకటించగా ఈసారి ఆ సంఖ్య రెండుకి పెరిగింది. వెలుపలి సభ్యులైన అషిమా గోయెల్, జయంత్ వర్మ రేట్ల తగ్గింపునకు అనుకూలంగా ఓటు వేశారు. రెపో రేటు కనీసం 0.25 శాతం తగ్గించాలని వారిద్దరూ వాదించారు. కాగా దాస్‌తో పాటు శశాంక్ భిడే, రాజీవ్ రంజన్, మైకేల్ దేవవ్రత పాత్రా యథాతథ స్థితిని బలపరిచారు. కీలక రేట్ల విషయంలో ఆర్‌బీఐ ఎప్పుడూ ‘‘అమెరికన్ ఫెడరల్‌నే అనుసరిస్తుంది’’ అనే అభిప్రాయం పలువురిలో ఉందని, కాని దేశంలో నెలకొన్న విభిన్న పరిస్థితుల ఆధారంగానే ఎంపీసీ నిర్ణయం ఉంటుందని తాను ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా స్పష్టం చేస్తున్నానని దాస్ తెలిపారు.
యూపీఐ లైట్ మరింత సరళం
తక్కువ విలువ గల డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే లక్ష్యంతో ఆన్ డివైస్ వ్యాలెట్ యూపీఐ లైట్‌లో కస్టమర్లు ఈ-మాండేట్ ద్వారా ఆటోమేటిగ్గా నిధులు తిరిగి నింపే వెసులుబాటు కల్పించాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. ప్రస్తుతం యూపీఐ లైట్‌లో రోజువారీ గరిష్ఠ పరిమితి రూ.2,000 కాగా సింగిల్ పేమెంట్ గరిష్ఠ పరిమితి రూ.500గా ఉంది. తాజా నిర్ణయం ప్రకారం యూపీఐ లైట్ వ్యాలెట్ వినియోగదారులు తమ ఖాతాలో నిధులు నిర్దేశిత పరిమితి కన్నా తగ్గిపోతే వెనువెంటనే నిధులు నింపేలా తమ బ్యాంకుకు అనుమతి ఇవ్వవచ్చు. తరచుగా చేసే చెల్లింపులకు ఈ-మాండేట్ విధానం నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ఫాస్టాగ్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (ఎన్‌సీఎంసీ) వంటి ఉపకరణాల్లో ఎలాంటి నిర్దేశిత గడువు ఏదీ లేకుండా అవసరమైనప్పుడల్లా నిధులు నింపే వెసులుబాటు కలుగుతుంది. చెల్లింపులు సరళతరం అవుతాయి. అలాగే డిజిటల్ చెల్లింపులకు సంబంధించిన వాస్తవిక సమాచారం అందచేయడం కోసం డిజిటల్ పేమెంట్స్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ ఒకటి ఏర్పాటు చేయాలని కూడా ఆర్‌బీఐ ప్రతిపాదించింది.
Updated Date - Jun 08 , 2024 | 06:15 AM