అదానీ విదేశీ ఫండ్లలో సెబీ చీఫ్‌కు వాటాలు!
ABN, Publish Date - Aug 11 , 2024 | 02:39 AM
ఏడాదిన్నర క్రితం అదానీ గ్రూప్‌పై సంచలన ఆరోపణలు చేసిన అమెరికన్ షార్ట్ సెల్లింగ్, మార్కెట్ రీసెర్చ్ కంపెనీ హిండెన్‌బర్గ్..తాజాగా మరో బాంబు పేల్చింది. అదానీ గ్రూప్ అక్రమంగా నిధుల మళ్లింపునకు...
మరో బాంబు పేల్చిన హిండెన్‌బర్గ్
అదానీ విదేశీ కంపెనీల్లో సెబీ చీఫ్‌కు వాటాలు
బెర్ముడా, మారిషస్‌లలో రహస్య పెట్టుబడులు
ఇందుకు అదానీ సోదరుడు వినోద్ సాయం
పెట్టుబడుల తర్వాతే సెబీలో మాధవి చేరిక
ఏడాదిన్నర కిందట అదానీ గ్రూప్‌పై సంచలన ఆరోపణలు చేసిన హిండెన్‌బర్గ్.. తాజాగా మరో బాంబు పేల్చింది. ఈసారి నేరుగా సెబీ చీఫ్ మాధవి పురి బచ్‌పైనే ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలను కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన బెర్ముడా, మారిషస్ ఫండ్లలో మాధవి, ఆమె భర్త ధవల్ బచ్‌కు రహస్య వాటాలు ఉన్నాయని పేర్కొంది. గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ ఇండియా ఇన్ఫోలైన్ ద్వారా 2015 జూన్ 5న సింగపూర్‌లో ఈ ఖాతా తెరిచారని తెలిపింది. ఈ మేరకు శనివారం తన వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన బ్లాగ్‌లో ఆరోపించింది. ఓ ప్రజా వేగు అందించిన పత్రాల ఆధారంగా ఈ ఆరోపణలు చేసింది. మాధవి దంపతులు 2015లో అదానీ విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టగా.. ఆ తర్వాత అంటే 2017లో మాధవి బచ్ సెబీలో శాశ్వత డైరెక్టర్ పదవి చేపట్టారు. అనంతరం 2022 మార్చిలో సెబీ చీఫ్‌గా నియమితులయ్యారు. అదానీ గ్రూప్ అక్రమ నిధుల మళ్లింపు వ్యవహారంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సెబీ ఇప్పటికే సుప్రీం కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. దాంతో, సెబీ చీఫ్‌పైనే హిండెన్‌బర్గ్ ఆరోపణలు ఎక్కుపెట్టింది. ఈ వ్యవహారంపై మరోసారి రాజకీయంగా రగడ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
న్యూఢిల్లీ: ఏడాదిన్నర క్రితం అదానీ గ్రూప్‌పై సంచలన ఆరోపణలు చేసిన అమెరికన్ షార్ట్ సెల్లింగ్, మార్కెట్ రీసెర్చ్ కంపెనీ హిండెన్‌బర్గ్..తాజాగా మరో బాంబు పేల్చింది. అదానీ గ్రూప్ అక్రమంగా నిధుల మళ్లింపునకు ఉపయోగించిన విదేశీ (బెర్ముడా, మారిషస్) ఫండ్లలో సెబీ చైర్‌పర్సన్ మాధవి పురి బుచ్‌తో పాటు ఆమె భర్త ధవల్ బుచ్‌కు రహస్య వాటాలున్నాయని హిండెన్‌బర్గ్ శనివారం తన వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన బ్లాగ్‌లో ఆరోపించింది. ఓ ప్రజావేగు (విజిల్ బ్లోయర్) అందించిన పత్రాల ఆధారంగా ఈ ఆరోపణలు చేసింది. బుచ్ దంపతులు ఐపీఈ ప్లస్ ఫండ్ 1లో ఖాతాను 2015 జూన్ 5న సింగపూర్‌లో తెరిచారని, ఈ ఆఫ్‌షోర్ మారిషస్ ఫండ్‌ను గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ.. ఇండియా ఇన్ఫోలైన్ (ఐఐఎఫ్‌ఎల్) ద్వారా తెరిచారని ప్రజావేగు పత్రాలను బట్టి తెలుస్తున్నదని హిండెన్‌బర్గ్ పేర్కొంది. అయితే, మాధవి పురి బుచ్ సెబీలో చేరకముందు విషయమిది. ఎందుకంటే, బుచ్ 2017లో సెబీలో పర్మినెంట్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 2022 మార్చిలో సెబీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు. కాగా, హిండెన్‌బర్గ్ తాజా ఆరోపణలపై సెబీ, బుచ్ స్పందించలేదు. ఐఐఎ్‌ఫఎల్ ప్రిన్సిపల్ సంతకం చేసిన డిక్లరేషన్ ఆఫ్ ఫండ్స్ ప్రకారం..
విదేశీ ఫండ్లలో వీరి పెట్టుబడి జీతం ద్వారా సమకూరిందని పేర్కొనగా.. దంపతుల మొత్తం ఆస్తి కోటి డాలర్లు (సుమారు రూ.84 కోట్లు)గా ఉండవచ్చని అంచనా వేసింది. సెబీ చైర్‌పర్సన్‌గా తన నియంత్రణ పరిధిలోకి వచ్చే వేలాది మ్యూచువల్ ఫండ్లు ఉండగా.. తాను, తన భర్త మాత్రం అతి తక్కువ ఆస్తులతో కూడిన, హై రిస్క్ ప్రాంతాల్లో ఏర్పాటైన, అదానీ అక్రమ నిధుల మళ్లింపు కుంభకోణంతో సంబంధాలున్న మల్లీ లేయర్డ్ విదేశీ ఫండ్లలో పెట్టుబడి పెట్టారని ప్రజావేగు పత్రాలు తెలుపుతున్నాయంది. ఈ షెల్ కంపెనీల ద్వారానే వినోద్ అదానీ నిధులను మళ్లించి అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల ధరలను కృత్రిమంగా పెంచేందుకు ఉపయోగించినట్లు హిండెన్‌బర్గ్ గతంలోనే ఆరోపించింది.
ఇంకా చర్యలు తీసుకోనేలేదు..
అదానీ అక్రమాలపై తాము నివేదిక విడుదల చేసి 18 నెలలు అవుతున్నప్పటికీ, అదానీ బహిర్గతం చేయని మారిషస్, ఇతర విదేశీ షెల్ కంపెనీలపై చర్యలు చేపట్టేందుకు సెబీ ఏమాత్రం ఆసక్తి చూపకపోవడం విస్మయం కలిగించిందని హిండెన్‌బర్గ్ తన బ్లాగ్‌లో అభిప్రాయపడింది. అదానీ ఆఫ్‌షోర్ ఫండ్లకు ఎవరు నిధులు సమకూర్చారనే విషయాన్ని సెబీ తన దర్యాప్తు పత్రాల్లో ఖాళీగా ఉంచిందన్న సుప్రీంకోర్టు ఆర్డరు కాపీని ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఒకవేళ ఈ విదేశీ ఫండ్ హోల్డర్లను గుర్తించాలనుకుంటే సెబీ చైర్‌పర్సన్‌కు తన ముఖమే తొలుత ప్రతిబింబించేదని తెలిపింది. తమ చీఫ్ గుట్టు విప్పే దర్యాప్తు జరిపేందుకు సెబీ ఇష్టపడకపోవడం తమకు ఆశ్చర్యం కలిగించలేదని హిండెన్‌బర్గ్ పేర్కొంది. అదానీ గ్రూప్ చాలాకాలంగా అకౌంటింగ్ మోసాలకు పాల్పడటంతోపాటు అనుచిత పద్ధతుల్లో గ్రూప్ కంపెనీల షేర్ల ధరలను కృత్రిమంగా పెంచుకుంటూ వచ్చిందని 2023 జనవరి 24న విడుదల చేసిన నివేదికలో హిండెన్‌బర్గ్ ఆరోపించిన విషయం తెలిసిందే. దాంతో అదానీ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతో గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన ఎల్‌ఐసీతోపాటు చిన్న మదుపరులు భారీగా నష్టపోయారు. హిండెన్‌బర్గ్ నివేదికతో స్టాక్ మార్కెట్‌తో పాటు కార్పొరేట్ రంగమూ భారీ కుదుపునకు లోనైంది. ఈ విషయంపై దర్యాప్తు చేయాలని సెబీని ఆదేశించడంతోపాటు గత ఏడాది మార్చి 2న సుప్రీంకోర్టు ఓ నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది.
ఎవరీ ధవల్ బుచ్: ఐఐటీ ఢిల్లీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ధవల్ బుచ్ ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్‌స్టోన్‌తో పాటు అల్వరెజ్ అండ్ మర్సల్‌కు సీనియర్ అడ్వైజర్‌గా సేవలందిస్తున్నారు. అలాగే, గ్లిడాన్ బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నారు. గతంలో బుచ్ యూనిలీవర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గానూ పనిచేశారు.
మాధవి పురి బుచ్ గురించి
ఫైనాన్షియల్ రంగంలో తనదైన ముద్ర వేసిన మాధవి 1966లో ముంబైలో జన్మించారు. ఐఐఎం అహ్మదాబాద్ నుంచి ఎంబీఎ పట్టా అందుకున్న మాధవి 1989లో ఐసీఐసీఐ బ్యాంక్‌లో చేరి తన కెరీర్ ప్రారంభించారు. ఐసీఐసీఐలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆమె 2009లో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తొలి మహిళా ఎండీ, సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత చైనా, షాంఘైలో న్యూ డెవల్‌పమెంట్ బ్యాంక్ కన్సల్టెంట్‌గా, ప్రైవేట్ ఈక్విటీ సంస్థ గ్రేటర్ పసిఫిక్ క్యాపిటల్‌కు సారథ్యం వహించారు. అనంతరం 2017లో సెబీ హోల్‌టైమ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 2022 మార్చిలో చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు.
Updated Date - Aug 11 , 2024 | 05:56 AM