ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బ్యాంకు లాకర్లకు జోరుగా డిమాండ్‌

ABN, Publish Date - Nov 24 , 2024 | 01:42 AM

ఈ రోజుల్లో మనం ఎంత జాగ్రత్తగా ఉంటున్నా.. ఇళ్లల్లో ఉంచే విలువైన వస్తువులకు భద్రత ఉంటుందా అనేది అనుమానమే. ఇండిపెండెంట్‌ గృహాలైనా, అపార్ట్‌మెంట్స్‌ అయినా ఎప్పుడు ఏ దొంగ...

విలువైన వస్తువులకు భద్రత ఉంటుందనే భరోసా

ఈ రోజుల్లో మనం ఎంత జాగ్రత్తగా ఉంటున్నా.. ఇళ్లల్లో ఉంచే విలువైన వస్తువులకు భద్రత ఉంటుందా అనేది అనుమానమే. ఇండిపెండెంట్‌ గృహాలైనా, అపార్ట్‌మెంట్స్‌ అయినా ఎప్పుడు ఏ దొంగ కన్నం వేస్తాడో తెలియని పరిస్థితి. దీంతో ప్రజలు తమ దగ్గర ఉన్న విలువైన వస్తువులు, ఆభరణాలు, కీలక పత్రాలు భద్రపరుచుకునేందుకు బ్యాంక్‌ లాకర్లను ఆశ్రయిస్తున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా బ్యాంకు లాకర్ల కోసం ఎగబడుతున్నారు. దీంతో బ్యాంకుల్లో లాకర్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.


అర్హత : దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకులు తమ శాఖల్లో లాకర్‌ సౌకర్యం అందిస్తున్నాయి. మైనర్లు తప్ప, వయోజనులైన ప్రతి ఒక్కరు ఒంటరిగా లేదా ఉమ్మడిగా నిర్ణీత వార్షిక ఫీజుతో ఈ సౌకర్యాన్ని ఎంచుకోవచ్చు. భాగస్వామ్య సంస్థలు, లిమిటెడ్‌ కంపెనీలు, అసోసియేషన్లు, క్లబ్బులు కూడా తమ పేరు మీద బ్యాంకు లాకర్లను తీసుకోవచ్చు. బ్యాంకు-బ్యాంకు లాకర్‌ను అద్దెకు తీసుకున్న వ్యక్తి/సంస్థల మధ్య ఉండే సంబంధం.. ఏదైనా ఆస్తిని లీజుకు ఇచ్చిన వ్యక్తి-లీజుకు తీసుకున్న వ్యక్తి మధ్య ఉండే సంబంధంలాంటిదే.

నూరు శాతం భద్రత: ఇంట్లో దాచుకునే విలువైన నగ, నట్రా, కీలక పత్రాలకు పూర్తి స్థాయిలో భద్రత ఉండకపోవచ్చు. బ్యాంకు లాకర్లలో దాచుకునే వాటికి మాత్రం పూర్తి భద్రత ఉంటుందనే భరోసాతో ఉండవచ్చు. ఇందుకు చెల్లించే వార్షిక ఫీజూ నామమాత్రమే. క్రమం తప్పకుండా వార్షిక ఫీజు చెల్లిస్తూ నిబంధనలు పాటించినంత కాలం బ్యాంకులు కూడా లాకర్‌ను క్లోజ్‌ చేయవు. కాకపోతే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లాకర్‌ దొరకడమే కొద్దిగా కష్టం. ప్రైవేట్‌ బ్యాంకులతో పోలిస్తే ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్‌బీ)ల్లో లాకర్‌ ఫీజు తక్కువ. దీంతో వీటికి విపరీతమైన డిమాండ్‌ ఉంది.


నామినేషన్‌ సదుపాయం: లాకర్‌ను లీజుకు తీసుకున్న వ్యక్తులకు బ్యాంకులు నామినేషన్‌, సర్వైవర్‌షిప్‌ సదుపాయాలు కల్పిస్తున్నాయి. కొన్ని ప్రభుత్వ బ్యాంకులు నామినేషన్‌ సదుపాయాన్ని ఒకరికి మాత్రమే పరిమితం చేస్తున్నాయి. లాకర్‌ ఒకరి కంటే ఎక్కువ మంది పేరు మీద ఉండి, వారిలో ఒకరు చనిపోతే, ఆ లాకర్‌, అందులోని వస్తువులు జీవించి ఉన్న మిగతా వ్యక్తులకు వెంటనే సంక్రమించవు. నామినేషన్‌, సర్వైవర్‌షిప్‌ క్లాజును ఎంచుకున్నప్పుడు మాత్రమే, ఆ లాకర్‌ను ఆపరేట్‌ చేసే హక్కు జీవించి ఉన్న మిగతా జాయింట్‌ హోల్డర్‌ లేదా నామినీకి సంక్రమిస్తుంది.


ఫీజులు: లాకర్‌ను లీజుకు ఇచ్చినందుకు బ్యాంకుకు ఏటా ముందుగానే వార్షిక ఫీజు చెల్లించాలి. ఈ ఫీజు లాకర్‌ పరిమాణం, బ్యాంకు ఉన్న ప్రాంతాన్ని బట్టి మారుతుంటుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ)తో పోలిస్తే, ప్రైవేట్‌ రంగ బ్యాంకుల్లో ఈ ఫీజు ఎక్కువ. దాదాపు అన్ని పీఎస్‌బీలు ఒక ఆర్థిక సంవత్సరంలో 12 సార్లు ఉచితంగా లాకర్‌ను ఓపెన్‌ చేసే సదుపాయం కల్పిస్తున్నాయి. అంతకు మించితే మాత్రం ప్రతి ఓపెనింగ్‌కు రూ.100 ప్లస్‌ జీఎస్‌టీ చెల్లించాలి. ఒకవేళ లాకర్‌ తాళం పోగొట్టుకున్నా, లాకర్‌ బ్రేక్‌ చేయాల్సి వచ్చినా, సమయానికి లాకర్‌ ఫీజు చెల్లించక పోయినా రూ.1,000 ప్లస్‌ జీఎస్‌టీతో పాటు లాకర్‌ బ్రేక్‌ చేయడానికి అయ్యే ఖర్చులు కూడా చెల్లించాలి. దీనికి తోడు లాకర్‌ ఇచ్చేటప్పుడే నిర్ణీత ఫీజు సహా జీఎస్‌టీ, కొంత మొత్తం ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాలి.


అనధికార దందా: వీటికి తోడు లాకర్‌ సైజును బట్టి.. లాకర్‌ ఇచ్చే ముందే పెద్ద మొత్తంలో నగదు తమ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (ఎఫ్‌డీ) చేయమని బ్యాంకులు అడుగుతుంటాయి. ప్రైవేట్‌ బ్యాంకులు ఇందుకు లాకర్‌ సైజును బట్టి రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షలు అడుగుతుంటే, పీఎస్‌బీలూ రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. అలా చెల్లించలేని వారికి లాకర్లు ఖాళీ లేవని చెప్పేస్తున్నాయి. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) నిబంధనలకు ఇది పూర్తిగా విరుద్ధం. అయినా చాలా బ్యాంకులు ఇప్పటికీ ఈ దందా కొనసాగిస్తున్నాయి.

Updated Date - Nov 24 , 2024 | 01:42 AM