‘కోహాన్స్’ విలీనంతో కొత్త బలం
ABN, Publish Date - Nov 02 , 2024 | 06:18 AM
కోహాన్స్ లైఫ్ సైన్సెస్ విలీనంతో తమ వ్యాపారం మరింత పెరుగుతుందని హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే సువెన్ ఫార్మా భావిస్తోంది.
2029 నాటికి రూ.6,000 కోట్ల టర్నోవర్ లక్ష్యం
ఈ నెల 28న వాటాదారుల భేటీ
సువెన్ ఫార్మా ఎండీ ప్రసాద రాజు
న్యూఢిల్లీ: కోహాన్స్ లైఫ్ సైన్సెస్ విలీనంతో తమ వ్యాపారం మరింత పెరుగుతుందని హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే సువెన్ ఫార్మా భావిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం (2023-24) రెండు కంపెనీలు రూ.2,392 కోట్ల టర్నోవర్ నమోదు చేశాయి. విలీనంతో 2029 మార్చి నాటికి ఇది రూ.6,000 కోట్లకు చేరుతుందని ఆశిస్తున్నట్టు సువెన్ ఫార్మా ఎండీ ప్రసాద రాజు తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే ఉన్న ఉత్పత్తి సామర్ధ్యాన్ని విస్తరించడంతో పాటు, కొత్త కంపెనీల కొనుగోలుకూ సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించిన సువెన్ ఫార్మా-కోహాన్స్ లైఫ్ సైన్సెస్ కంపెనీల విలీనానికి బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ ఇప్పటికే ఆమోదం తెలిపాయి. వాటాదారుల ఆమోదమే ఇంకా మిగిలి ఉంది. ఎన్‌సీఎల్‌టీ ఆదేశాల మేరకు రెండు కంపెనీల వాటాదారులు ఇందుకోసం ఈ నెల 28న భేటీ అవుతున్నారు.
మూడు అంశాలపై దృష్టి
విలీనం తర్వాత కూడాకాంట్రాక్టు పద్దతిలో సరికొత్త ఔషధాలు, వాటి ముడి పదార్ధాల అభివృద్ధి, ఉత్పత్తిపై (సీడీఎంఓ) ప్రత్యేక దృష్టి పెట్టాలని కంపెనీ భావిస్తోంది. ముఖ్యంగా ఫార్మా సీడీఎంఓ, స్పెషాలిటీ కెమికల్స్ (సీడీఎంఓ), తుది ఔషధాల తయారీలో ఉపయోగించే ప్రధాన ముడి పదార్ధాలు యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడియంట్స్ (ఏపీఐ) విభా గాలపై దృష్టి పెడతామని ప్రసాద రాజు తెలిపారు. సరికొత్త ఔషధాల కోసం చూసే అంతర్జాతీయ ఔషధ కంపెనీలకు వ్యూహాత్మక భాగస్వామ్య సంస్థగా ఎదగడం తమ లక్ష్యమన్నారు. విశ్వసనీయమైన సీడీఎంఓ సేవ లు అందించే సంస్థలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అమెరికా బయోసెక్యూర్ చట్టం కూడా ఇందుకు కలిసి వస్తుందన్నారు.
అపార అవకాశాలు
కొవిడ్ తర్వాత సరఫరాలకు అంతరాయం లేకుండా విశ్వసనీయ సీడీ ఎంఓ సేవలు అందించే ఫార్మా కంపెనీలకు డిమాండ్ మరింత పెరిగింది. ప్రస్తుతం అంతర్జాతీయ సీడీఎంఓ మార్కెట్‌లో మన దేశం వాటా 2.7 శాతం మాత్రమే. వచ్చే నాలుగైదు సంవత్సరాల్లో ఇది ఐదు నుంచి ఏడు శాతం వరకు చేరుకుంటుందని అంచనా. విలీనం తర్వాత ఉత్పత్తి సామ ర్ధ్య విస్తరణ, నూతన ఔషధాల అభివృద్ధికి దోహదం చేసే సరికొత్త రసాయనాల (మాలిక్యూల్స్) అభివృద్ధి ద్వారా సీడీఎంఓ మార్కెట్‌పై పట్టు మరింత పెంచుకోవాలని భావిస్తున్నట్టు రాజు చెప్పారు.
Updated Date - Nov 02 , 2024 | 06:18 AM