ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భారత్‌పై సుంకాల కత్తి

ABN, Publish Date - Nov 07 , 2024 | 03:33 AM

నాకు అన్నింటి కన్నా అమెరికా ప్రయోజనాలే ముఖ్యం’ (అమెరికా ఫస్ట్‌) అని ఎన్నికలకు ముందే ట్రంప్‌ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. ఇందుకోసం ‘మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌’ పేరుతో ఓటర్లను...

హెచ్‌-1బీ వీసాలకూ చెక్‌.. ఐటీ రంగం బిత్తర చూపులు

న్యూఢిల్లీ: నాకు అన్నింటి కన్నా అమెరికా ప్రయోజనాలే ముఖ్యం’ (అమెరికా ఫస్ట్‌) అని ఎన్నికలకు ముందే ట్రంప్‌ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. ఇందుకోసం ‘మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌’ పేరుతో ఓటర్లను ఆకర్షించి మరోసారి శ్వేతసౌధాధిపతి కాబోతున్నారు. దీంతో ట్రంప్‌ ద్వితీయ పట్టాభిషేకం ప్రభావం భారత ఎగుమతులు, ఆర్థిక వ్యవస్థపై ఎలా ఉండబోతోందో పరిశీలిద్దాం.

సుంకాల ముప్పు

ప్రస్తుతం అమెరికా మన దేశానికి అతి పెద్ద వాణిజ్య భాగస్వామి. గత ఏడాది రెండు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం వస్తు, సేవలతో కలిపి 19,000 కోట్ల డాలర్లకు (సుమారు రూ.16.01 లక్షల కోట్లు) చేరింది. ఇందులో మన దేశానికే మిగులు ఉంది. ప్రధాని మోదీతో ఎంత దోస్తానా ఉన్నా ‘తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే’ అనేలా భారత్‌ నుంచి వచ్చే దిగుమతులపైనా సుంకాల (టారిఫ్‌) పెంపు తప్పదని ట్రంప్‌ ఇప్పటికే తేల్చేశారు. దీంతో మన దేశానికి చెందిన టెక్స్‌టైల్‌, ఆటోమొబైల్‌, ఫార్మా కంపెనీలు బిక్కు బిక్కు మంటున్నాయి.


‘ఐటీ’కీ కష్టాలే!

మన ఐటీ కంపెనీల ఆదాయాల్లో 80 శాతానికి ఇప్పటికీ అమెరికానే దిక్కు. మన ఐటీ కంపెనీలు హెచ్‌-1బీ వీసాలపై అనేక మంది భారత ఐటీ నిపుణులను అమెరికా పంపించి, అక్కడి ప్రాజెక్టులు పూర్తి చేస్తుంటాయి. స్థానిక అమెరికన్లతో పోలిస్తే వీరికి చెల్లించే జీతాలు తక్కువ. ఈ వీసాలతో స్థానిక అమెరికన్లకు పెద్దగా ఉద్యోగాలు దొరకడం లేదని ఎప్పటి నుంచో విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ వీసాల జారీని కట్టుదిట్టం చేయడంతో పాటు, జీతాల వ్యత్యాసాన్నీ రూపుమాపుతానని ట్రంప్‌ ఎన్నికల ప్రచారంలో హామీలు గుప్పించారు. ఇదే జరిగితే భారత ఐటీ నిపుణులకు అమెరికా ఒక కలగానే మిగిలి పోతుంది. అధిక జీతాల భారంతో భారత ఐటీ కంపెనీల ఖర్చులు పెరిగిపోయి వాటి ఆదాయాలు, లాభాలకూ గండి పడే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. అదే జరిగితే ఐటీ రంగంలో మరిన్ని కొలువుల కోతలు తప్పక పోవచ్చు.


అవకాశాలూ ఉన్నాయ్‌

అమెరికా ఫస్ట్‌ అని ట్రంప్‌ ఎంతగా అరిచి గీపెట్టినా, వాస్తవ పరిస్థిలు అందుకు పూర్తిగా కలిసి రాకపోవచ్చు. భారత్‌కు మరంత దగ్గర కావడం ద్వారా చైనాకు సైనికంగానేగాక, ఆర్థికంగానూ చెక్‌ పెట్టాలనేది అమెరికా వ్యూహం. చైనా అంటేనే పగబట్టిన తాచులా లేచే ట్రంప్‌, ఈ వ్యూహానికి మరింత పదును పెడతారని భావించవచ్చు. దీంతో అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే అనేక అమెరికా కంపెనీలు తమ చైనా+ వ్యూహంలో భాగంగా భారత్‌, వియత్నాం, థాయ్‌లాండ్‌, ఇండోనేషియా వైపు చూస్తున్నాయి. యాపిల్‌ కంపెనీ ఇప్పటికే తన అన్ని మోడళ్ల ఐ ఫోన్లను భారత్‌లో అసెంబ్లింగ్‌ చేయించుకుంటోంది. ఇక అమెరికా ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌, చైనాకు గుడ్‌బై చెప్పి భారత్‌లో తన వ్యాపారాన్ని పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు మన కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. దీంతో ట్రంప్‌ భారత దిగుమతులపై సుంకాల పెంపు విషయంలో ఎన్నికల ప్రచారంలో చెప్పినంత కఠినంగా ఉండకపోవచ్చని భావిస్తున్నారు.


ప్రతీకార చర్యలు

ఒకవేళ ట్రంప్‌ ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టు భారత దిగుమతులపైనా సుంకాల పెంపుకు సిద్ధమైతే, ఆ దేశం నుంచి వచ్చే దిగుమతులపై సుంకాలు పెంచడం భారత్‌కూ తప్పదు. అమెరికాలో ఔషధాల ధరలు తక్కువగా ఉండడానికి ప్రధాన కారణం మన ఫార్మా కంపెనీలే. ట్రంప్‌ ఎన్ని ప్రోత్సాహకాలు, రాయితీలు ఇచ్చినా అమెరికా ఫార్మా కంపెనీలు, మన కంపెనీలంత చౌకగా జెనరిక్‌ ఔషధాలు అందించలేవు. ‘అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా, మన దేశం అందించినంత సమర్ధవంతంగా మరే దేశం అమెరికా కంపెనీలకు ఐటీ సేవలు అందించలేదు’ అని నాస్కామ్‌ కొత్త చైర్‌పర్సన్‌ సింధు గంగాధరన్‌ చెప్పడం విశేషం.

Updated Date - Nov 07 , 2024 | 03:33 AM