టీసీఎస్.. భేష్
ABN, Publish Date - Jul 12 , 2024 | 04:53 AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికానికి (క్యూ1) టీసీఎస్ ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాల అంచనాలను మించాయి. క్యూ1లో కంపెనీ ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 8.7 శాతం వృద్ధితో...
అంచనాలు మించిన కంపెనీ ఫలితాలు
క్యూ1లో రూ.12,040 కోట్ల నికర లాభం
రూ.62,613 కోట్లకు పెరిగిన ఆదాయం
ఒక్కో షేరుకు రూ.10 మధ్యంతర డివిడెండ్
3 నెలల్లో 5,452 నికర నియామకాలు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికానికి (క్యూ1) టీసీఎస్ ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాల అంచనాలను మించాయి. క్యూ1లో కంపెనీ ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 8.7 శాతం వృద్ధితో రూ.12,040 కోట్లకు పెరిగింది. 2023 -24లో ఇదే కాలానికి కంపెనీ లాభం రూ.11,074 కోట్లుగా నమోదైంది. ఈ జనవరి -మార్చి త్రైమాసికంలో నమోదైన రూ.12,434 కోట్ల లాభంతో పోలిస్తే మాత్రం 3.1 శాతం తగ్గింది. ఆదాయం విషయానికొస్తే, ఈ క్యూ1లో వార్షిక ప్రాతిపదికన 5.4 శాతం వృద్ధితో రూ.62,613 కోట్లకు చేరుకుంది. క్రితం ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి ఆదాయం రూ.59,381 కోట్లుగా నమోదైంది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరానికి గాను టీసీఎస్ తన వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.10 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఇందుకు అర్హులైన వాటాదారుల రికార్డు తేదీని ఈనెల 20గా ప్రకటించిన కంపెనీ.. ఆగస్టు 5న డివిడెండ్ చెల్లించనుంది. మరిన్ని ముఖ్యాంశాలు..
ఈ ఏప్రిల్- జూన్ కాలానికి టీసీఎస్ నిర్వహణ మార్జిన్ వార్షిక ప్రాతిపదికన 1.5 శాతం పెరుగుదలతో 24.7 శాతంగా నమోదైంది. నికర మార్జిన్ 19.2 శాతంగా ఉంది.
వరుసగా మూడు త్రైమాసికాలుగా తగ్గుతూ వచ్చిన టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య.. ఈ జూన్ 30తో ముగిసిన క్వార్టర్‌లో మాత్రం 6,06,998కి పెరిగింది. గడిచిన మూడు నెలల్లో కంపెనీ నికరంగా 5,452 మందిని ఉద్యోగంలో చేర్చుకుంది. గత త్రైమాసికంలో కంపెనీ ఉద్యోగుల వలసల (అట్రిషన్) రేటు సైతం 12.1 శాతానికి తగ్గింది.
గడిచిన మూడు నెలల్లో 11,000 మంది ట్రెయినీలను ఆహ్వానించినట్లు టీసీఎస్ హెచ్‌ఆర్ చీఫ్ మిలింద్ లక్కడ్ తెలిపారు. అందులో కొందర్ని గత ఆర్థిక సంవత్సరంలోనే కంపెనీలో చేర్చుకోవాల్సి ఉన్నప్పటికీ, అనుకోని పరిస్థితుల కారణంగా జాప్యమైందన్నారు.
ఈ క్యూ1లో కంపెనీ దక్కించుకున్న ఆర్డర్ల విలువ మాత్రం 830 కోట్ల డాలర్లకు తగ్గింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో లభించిన 1,020 కోట్ల డాలర్ల ఆర్డర్లతో పోలిస్తే 18.6 శాతం తగ్గగా.. ఈ జనవరి-మార్చి క్వార్టర్‌లో లభించిన 1,320 కోట్ల డాలర్ల ఆర్డర్లతో పోలిస్తే 37 శాతం క్షీణించింది. కాగా, జనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డీల్స్ రెట్టింపై 150 కోట్ల డాలర్ల స్థాయికి చేరుకున్నాయని కంపెనీ తెలిపింది. అయితే, అందులో చాలా వరకు ప్రాజెక్టులు రెండు త్రైమాసికాలకు మించని స్వల్పకాలిక ఆర్డర్లేనని సంస్థ పేర్కొంది.
ప్రాంతాలవారీగా పరిశీలిస్తే, క్యూ1లో కంపెనీకి భారత మార్కెట్ నుంచి లభించిన ఆదాయంలో వృద్ధి వార్షిక ప్రాతిపదికన 61.8 శాతం పెరిగింది. ఎంఈఏ రెవెన్యూ 8.5 శాతం, యూకే 6 శాతం, యూరప్ 0.9 శాతం, లాటిన్ అమెరికా 6.3 శాతం పెరిగింది. ఐటీ రంగానికి కీలక మార్కెట్ అయిన ఉత్తర అమెరికా ఆదాయం మాత్రం 1.1 శాతం తగ్గింది.
రంగాల వారీగా చూస్తే, లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్‌కేర్, మాన్యుఫాక్చరింగ్, ఎనర్జీ అండ్ రిసోర్సెస్ అండ్ యుటిలిటీస్ రంగాల ఆదాయాల్లో మాత్రమే వృద్ధి నమోదైంది. కంపెనీ మొత్తం రాబడిలో 40 శాతం వరకు వాటా కలిగిన బీఎ్‌ఫఎ్‌సఐతో పాటు మిగతా అన్నీ రంగాల ఆదాయం (వార్షిక ప్రాతిపదికన) క్షీణించింది.
బీఎ్‌సఈలో టీసీఎస్ షేరు గురువారం 0.33 శాతం లాభంతో రూ.3,922.70 వద్ద ముగిసింది.
కొత్త ఆర్థిక సంవత్సరాన్ని ఆల్ రౌండ్ వృద్ధితో ప్రారంభించామని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాను. క్లయింట్లతో సంబంధాలను మరింత విస్తరించుకోవడంతోపాటు ఆధునిక సాంకేతికతల్లో కొత్త సామర్థ్యాల ఏర్పాటు, ఆవిష్కరణల్లో పెట్టుబడులను కొనసాగిస్తున్నాం. అయితే, వ్యాపార వృద్ధి స్థిరంగా కొనసాగుతుందని ఇప్పుడు చెప్పలేం. ఎందుకంటే, మార్చితో ముగిసిన త్రైమాసికంతో పోలిస్తే జూన్ త్రైమాసికంలో మార్కెట్ పరిస్థితుల్లో పెద్దగా మార్పేమీ లేదు. కాబట్టి, మార్కెట్ సెంటిమెంట్ గురించి కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. కాకపోతే, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం మెరుగ్గా ఉండనుందని భావిస్తున్నాం.
కే కృతివాసన్, సీఈఓ, ఎండీ,
టీసీఎస్
Updated Date - Jul 12 , 2024 | 04:53 AM