రిటైల్ డిజిటల్ చెల్లింపుల జోరు..
ABN, Publish Date - Jul 15 , 2024 | 03:13 AM
జేబులో సరిపడా చిల్లర లేదా? అయినా ఇబ్బంది లేదు. మీ మొబైల్ ఫోన్‌లో ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే ఉంటే చాలు. జేబులో పైసా లేకపోయినా.. కావలసిన వస్తువులు కొని డిజిటల్ చెల్లింపులు...
2030 నాటికి రూ.600 లక్షల కోట్లకు చేరే చాన్స్.. ప్రస్తుతం రూ.300 లక్షల కోట్ల స్థాయిలో
కెర్నీ-అమెజాన్ పే నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: జేబులో సరిపడా చిల్లర లేదా? అయినా ఇబ్బంది లేదు. మీ మొబైల్ ఫోన్‌లో ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే ఉంటే చాలు. జేబులో పైసా లేకపోయినా.. కావలసిన వస్తువులు కొని డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు. అది ఆన్‌లైన్ కావచ్చు. ఆఫ్‌లైన్ కావచ్చు. దేనికైనా సరే, అవసరమైన వస్తువులు కొని నింపాదిగా డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు. ఇప్పుడు తోపుడు బండ్ల మీద కూరగాయలు, పండ్లు, పూలు అమ్మే వీధి వ్యాపారులు కూడా డిజిటల్ చెల్లింపులకు మారిపోయారు. దీంతో 2018లో మన దేశంలో 30,000 కోట్ల డాలర్లుగా ఉన్న రిటైల్ డిజిటల్ చెల్లింపులు గత ఏడాది 3.6 లక్షల కోట్ల డాలర్లకు (సుమారు రూ.300 లక్షల కోట్లు) చేరాయి. మరో ఆరేళ్లలో అంటే 2030 నాటికి ఈ చెల్లింపులు 7 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరతాయని కెర్నీ-అమెజాన్ పే సంస్థలు ‘హౌ అర్బన్ ఇండియా పేస్’ పేరుతో రూపొందించిన నివేదికలో తెలిపాయి. ప్రస్తుత డాలర్-రూపాయి మారక రేటు ప్రకారం ఇది దాదాపు రూ.600 లక్షల కోట్లకు సమానం.
ఆన్‌లైన్ కొనుగోళ్లే ఊతం: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్ల ద్వారా చేసే కొనుగోళ్లు రిటైల్ డిజిటల్ చెల్లింపులకు బాగా ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుతం ఈ కొనుగోళ్లకు చేసే చెల్లింపుల్లో 90 శాతం డిజిటల్ చెల్లింపులే. సంపన్న వినియోగదారులైతే తమ ఆన్‌లైన్ కొనుగోళ్లకు నగదు కంటే డిజిటల్ చెల్లింపులకే మొగ్గు చూపుతున్నట్టు నివేదిక తెలిపింది. ఇక ఆఫ్‌లైన్ చెల్లింపుల్లోనూ డిజిటల్ చెల్లింపులదే హవా. పాన్ షాపులు, కిరాణా దుకాణాల్లోనూ ఇప్పుడు డిజిటల్ చెల్లింపులను అనుమతిస్తున్నారు. మిలీనియల్స్, జెనరేషన్ ఎక్స్, స్త్రీలు-పురుషులనే తేడా లేకుండా ప్రస్తుతం అందరూ డిజిటల్ చెలింపులకే మొగ్గు చూపుతున్నట్టు కెర్నీ-అమెజాన్ పే తెలిపింది.
యూపీఐతో మరింత జోరు: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ)తో డిజిటల్ చెల్లింపులు మరింత జోరందుకున్నాయి. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరం (2023-24) దేశంలో యూపీఐ చెల్లింపులు 138 శాతం పెరిగాయి. ప్రస్తుతం కార్డులు, డిజిటల్ వాలెట్ల చెల్లింపులు కూడా క్రమంగా ప్రజల్లో మంచి ఆదరణ పొందుతున్నాయి. మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో వీటి వాటా ప్రస్తుతం 10 శాతం వరకు ఉంటుందని నివేదిక తెలిపింది.
ప్రపంచంలో 46 శాతం వాటా
ప్రస్తుతం ప్రపంచ డిజిటల్ చెల్లింపుల్లో భారత్‌దే హవా. 2022లో ప్రపంచంలో జరిగిన డిజిటల్ చెల్లింపుల్లో 46 శాతం మన దేశంలోనే జరిగాయి. దీన్నిబట్టి మన దేశంలో డిజిటల్ చెల్లింపులు ఎంత ప్రాచుర్యం పొందాయో ఊహించుకోవచ్చు. చిన్నచిన్న పట్టణాల్లో 65 శాతం, పెద్దపెద్ద నగరాల్లో జరిగే చెల్లింపుల్లో 75 శాతం డిజిటల్ చెల్లింపులని కెర్నీ-అమెజాన్ పే నివేదిక తెలిపింది. అయితే బ్యాండ్‌విడ్త్ చాలినంత లేకపోవడం, పెరిగిపోతున్న సైబర్ మోసాలు రిటైల్ డిజిటల్ చెల్లింపులకు పెద్ద సవాల్‌గా మారాయి.
Updated Date - Jul 15 , 2024 | 03:13 AM