జోరు తగ్గిన కార్పొరేట్ రంగం
ABN, Publish Date - Nov 21 , 2024 | 05:53 AM
భారత కార్పొరేట్ రంగం పరుగుకు బ్రేక్ పడింది. నిన్న మొన్నటి వరకు రేసుగుర్రం లా పరిగెత్తిన కార్పొరేట్ రంగం ఇపుడు నీరసిస్తోంది. సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలే
నీరసించిన డిమాండ్.. నిరాశ పరిచిన క్యూ2 ఆర్థిక ఫలితాలు
‘బేర్’మంటున్న స్టాక్ మార్కెట్
మోతీలాల్ ఓస్వాల్
న్యూఢిల్లీ: భారత కార్పొరేట్ రంగం పరుగుకు బ్రేక్ పడింది. నిన్న మొన్నటి వరకు రేసుగుర్రం లా పరిగెత్తిన కార్పొరేట్ రంగం ఇపుడు నీరసిస్తోంది. సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలే ఇందుకు నిద ర్శనం. ఇప్పటి వరకూ క్యూ2 ఆర్థిక ఫలితాలు ప్రకటించిన కంపెనీల్లో 44 శాతం కంపెనీల ఆదాయం, లాభాలు మార్కెట్ వర్గాలను నిరాశ పరిచాయి. 41 శాతం కంపెనీల ఫలితాలు మార్కెట్ అంచనాలను మించగా, 15 శాతం కంపెనీల ఆర్థిక ఫలితాలు మాత్రమే అంచనాలకు అనుగుణంగా వచ్చాయి. గత రెండేళ్లలో కార్పొరేట్ రంగం ఆదాయం, లాభాల వృద్ధిరేటుకు ఇలా బ్రేక్ పడడం ఇదే మొదటిసారని ప్రముఖ బ్రోకరేజి సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఒక నివేదికలో తెలిపింది. 2026 మార్చి వరకు ఈ రంగం పనితీరు ఇలానే ఉంటుందని పేర్కొంది. ఇందుకు దోహదపడుతున్న కారణాలు...
డిమాండ్ క్షీణత: ప్రస్తుతం గ్రామీణ డిమాండ్ బాగానే ఉంది. అయితే పట్టణ డిమాండ్ మాత్రం నీరసించింది. ఐటీసీ, హెచ్‌యూఎల్, నెస్లే, డాబర్ వంటి ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ కంపెనీల క్యూ2 ఆర్థిక ఫలితాలే ఇందుకు చక్కటి ఉదాహరణ. ఎన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించినా వినియోగదారులను పెద్దగా ఆకర్షించలేకపోతున్నట్టు కంపెనీలు చెబుతున్నాయి. దీంతో 2024-26 వరకు కార్పొరేట్ ఆదాయాల వృద్ధిరేటు 12 నుంచి 14 శాతం మించక పోవచ్చని అంచనా.
ధరల సెగ: ధరల సెగ సైతం కంపెనీ ల ఆదాయాలు, లాభాలకు చిల్లు పెడుతోం ది. ఖర్చులు ఎంత తగ్గించుకోవాలనుకున్నా, ఒక పరిమితికి మించి సాధ్యపడడం లేదు. చక్కెర, వంటనూనెల ధరలు కొద్దిగా తగ్గినా ఇతర ముడి పదార్ధాల ధరల్లో వృద్ధి ఇంకా అలానే ఉంది. ఈ భారం తగ్గించుకునేందుకు ధరలు కొద్దిగా పెంచినా ఆ ప్రభావం డిమాండ్‌పై కనిపిస్తోంది.
అంతర్జాతీయ ఉద్రిక్తతలు: రష్యా-ఉక్రెయిన్ యు ద్ధం, ఇజ్రాయెల్-హిజ్‌బొల్లా పోరాటం ఇంకా రావణ కాష్టంలా రగులుతూనే ఉన్నాయి. దీంతో కార్పొరేట్ రంగం ఎగుమతులకు గండి పడి, వాటి ఎగుమతి ఆదాయాలు క్షీణించాయి. ముఖ్యంగా బియ్యం, గోధుమలు, చక్కెర వంటి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి కంపెనీల విషయంలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది.
స్టాక్ మార్కెట్‌పై ప్రభావం: కార్పొరేట్ రంగం ఆదాయ, లాభాల వృద్ధిరేటు తగ్గడంతో ఎఫ్‌పీఐలు మూకుమ్మడిగా అమ్మకాలకు దిగాయి. దీంతో గత రెండు నెలల్లో దేశీయ స్టాక్ మార్కెట్, 10 శాతం కుంగిపోయింది. గత నెలన్నర రోజుల్లోనే భారత మార్కెట్ నుంచి ఈ సంస్థలు దాదాపు రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఈ సంస్థల అమ్మకాలు ఇప్పట్లో తగ్గే సూచనలేవీ కనిపించడం లేదు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ మరో 10 శాతం నష్టపోయే ప్రమాదం ఉందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
Updated Date - Nov 21 , 2024 | 05:53 AM