ఈసారీ వడ్డీ రేట్లు యథాతథం!
ABN, Publish Date - Aug 05 , 2024 | 06:06 AM
ద్వైమాసిక ద్రవ్య, పరపతి విధాన సమీక్ష కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) ఈ నెల 6 నుంచి 8 వరకు సమావేశమవుతోంది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన...
రేపటి నుంచి ఆర్‌బీఐ ఎంపీసీ భేటీ
ముంబై: ద్వైమాసిక ద్రవ్య, పరపతి విధాన సమీక్ష కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) ఈ నెల 6 నుంచి 8 వరకు సమావేశమవుతోంది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలోనూ ఎంపీసీ కీలక రెపో రేటును యథాతథంగా 6.5 శాతం వద్దే కొనసాగించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా. గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఎంపీసీ రెపో రేటును 6.5 శాతం వద్దే కొనసాగిస్తోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించే వరకు.. మన దేశంలోనూ ఆర్‌బీఐ వడ్డీ రేట్ల తగ్గించే అవకాశం లేదనే అంచనాలు వినిపిస్తున్నాయి. దేశీయంగా వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నా, జీడీపీ వృద్ధి రేటు సంతృప్తికరంగా ఉంది. దీంతో రెపో రేటు తగ్గింపుపై తొందరపడాల్సిన అవసరం లేదని ఆర్‌బీఐ భావిస్తోంది. ‘రిటైల్ ద్రవ్యోల్బణం 5.1 శాతం వద్ద ఉన్నా.. ఆర్‌బీఐ ఈసారి కూడా వడ్డీ రేట్ల పెంపు జోలికి పోకపోవచ్చు’ అని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) ప్రధాన ఆర్థికవేత్త మదన్ సబ్నవిస్ తెలిపారు. ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అదితి నాయర్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతికూల పరిస్థితులు ఏమీ లేకపోతే ఈ ఏడాది డిసెంబరు భేటీలో 0.25 శాతం, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే భేటీలో మరో 0.25 శాతం రెపో రేటు తగ్గించే అవకాశం ఉందని ఆమె తెలిపారు.
డెరివేటివ్స్‌పై ఆంక్షలు బ్యాంకులకు మంచిదే..
ఎస్‌బీఐ చైర్మన్ దినేశ్ ఖారా
రిటైల్ మదుపరులు డెరివేటివ్స్ ట్రేడింగ్ చేయడంపై ఆంక్షలు విధించడం బ్యాంకులకు మేలు చేస్తుందని ఎస్‌బీఐ చైర్మన్ దినేశ్ ఖారా తెలిపారు. దీనివల్ల ఈ తరహా మదుపరులు మళ్లీ బ్యాంక్ డిపాజిట్లపై ఆసక్తి చూపిస్తారన్నారు. ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లో స్వల్పకాలిక, దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నుల్లో మార్పు చేయడం.. బ్యాంకుల డిపాజిట్లపై ఎలాంటి ప్రభావం చూపదన్నారు. ప్రస్తుతం బ్యాంకులు పరపతి వృద్ధి రేటుకు తగ్గట్టుగా.. డిపాజిట్ల వృద్ధి రేటు లేకపోవడంతో నిధుల కొరత ఎదుర్కొంటున్న విషయాన్ని ఖారా గుర్తు చేశారు. ప్రస్తుతం రిటైల్ మదుపరుల్లో ఎక్కువ మంది నష్ట భయం ఉన్నా, బ్యాంకు డిపాజిట్ల కంటే ఎక్కువ రాబడులు ఇచ్చే స్టాక్ మార్కెట్‌పై ఆసక్తి చూపిస్తున్నారన్నారు.
Updated Date - Aug 05 , 2024 | 06:06 AM