ట్రంపంప రంపంపం!
ABN, Publish Date - Nov 07 , 2024 | 03:38 AM
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం.. స్టాక్‌మార్కెట్ వర్గాల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఐటీ, ఫార్మా షేర్లలో ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లు జరపడంతో సెన్సెక్స్ మళ్లీ 80,000 మైలురాయిని దాటగా..
మార్కెట్‌కు ట్రంప్ జోష్.. సెన్సెక్స్ 901 పాయింట్లు అప్
24,500 స్థాయికి చేరువైన నిఫ్టీ.. ఐటీ, ఫార్మా రంగ షేర్లు జిగేల్
2 రోజుల్లో రూ.10.47 లక్షల కోట్ల సంపద వృద్ధి
ముంబై: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం.. స్టాక్‌మార్కెట్ వర్గాల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఐటీ, ఫార్మా షేర్లలో ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లు జరపడంతో సెన్సెక్స్ మళ్లీ 80,000 మైలురాయిని దాటగా.. నిఫ్టీ 24,500 స్థాయికి చేరువైంది. సెన్సెక్స్ ఒకదశలో 1,093 పాయింట్ల వరకు పుంజుకున్నప్పటికీ, చివరికి 901.50 పాయింట్ల లాభంతో 80,378.13 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 270.75 పాయింట్ల వృద్ధితో 24,484.05 వద్ద ముగిసింది. సూచీలు లాభపడటం వరుసగా ఇది రెండో రోజు. ఈ రెండ్రోజుల్లో ఈక్విటీ మదుపరుల సంపద రూ.10.47 లక్షల కోట్లు పెరిగి రూ.452.58 లక్షల కోట్లకు (5.37 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది.
సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 25 రాణించాయి. టీసీఎస్ 4.21 శాతం, ఇన్ఫోసిస్ 4.02 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 3.71 శాతం, టెక్ మహీంద్రా 3.68 శాతం వృద్ధితో సూచీ టాప్ గెయినర్లుగా నిలిచాయి. రిలయన్స్ షేరు 50 శాతం ఎగబాకింది.
బీఎ్‌సఈ మిడ్‌క్యాప్ సూచీ 2.28 శాతం, స్మాల్‌క్యాప్ ఇండె క్స్ 1.96 శాతం పుంజుకున్నాయి. రంగాలవారీ సూచీలన్నీ పాజిటివ్‌గా ముగిశాయి. బీఎ్‌సఈ ఐటీ 4.04 శాతం, టెక్ 3.37 శాతం ఎగబాకాయి.
సాయి లైఫ్ సైన్సెస్ ఐపీఓకు సెబీ ఆమోదం
హైదరాబాద్‌కు చెందిన సాయి లైఫ్ సైన్సె్‌సతోపాటు మరో మూడు కంపెనీల ఐపీఓలకు సెబీ ఆమోదం తెలిపింది. ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్స్ కంపెనీ రూబికాన్ రీసెర్చ్, యార్న్ తయారీదారు సనాతన్ టెక్స్‌టైల్స్, వాహన పరికరాల తయారీదారు మెటల్‌మ్యాన్ ఆటో ఈ జాబితాలో ఉన్నాయి. సాయి లైఫ్ సైన్సెస్ ఐపీఓలో భాగంగా రూ.800 కోట్ల తాజా ఈక్విటీ జారీతోపాటు ప్రస్తుత ప్రమోటర్, ఇతర ఇన్వెస్టర్లకు చెందిన 6.15 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించనుంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధుల్లో రూ.600 కోట్లు రుణ బకాయిలు తీర్చేందుకు, కొంత సొమ్మును వ్యాపార అవసరాలకు ఉపయోగించుకోనున్నట్లు సాయి లైఫ్ సైన్సెస్ వెల్లడించింది.
అమెరికా మార్కెట్ జూమ్
బుధవారం అమెరికన్ స్టాక్ మార్కెట్ సూచీలు కూడా భారీ లాభాలతో సరికొత్త రికార్డు గరిష్ఠాలకు ఎగబాకాయి. డోజోన్స్ ఏకంగా 1,300 పాయింట్లు పుంజుకోగా.. ఎస్ అండ్ పీ 1.85 శాతం, నాస్‌డాక్ 2.11 శాతం పెరిగాయి. ట్రంప్‌కు బలమైన మద్దతుదారైన ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ షేరు ఒకదశలో 14 శాతం ఎగబాకింది. అలాగే, టెక్నాలజీ రంగ షేర్లలో భారీగా కొనుగోళ్లు జరిగాయి. డాలర్ కూడా బలం పుంజుకుంది. పదేళ్ల బాండ్ రేటు సైతం 4.46 శాతానికి ఎగబాకింది. ఈక్విటీల జోరులో బులియన్ జోష్ కోల్పోయింది. ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర ఒక దశలో 70 డాలర్ల మేర తగ్గి 2,680 డాలర్లకు పడిపోయింది. వెండి 31.40 డాలర్లకు దిగివచ్చింది.
అత్యంత విలువైన కంపెనీగా ఎన్‌విడియా
ఏఐ చిప్‌ల తయారీ దిగ్గజం ఎన్‌విడియా కంపెనీ యాపిల్‌ను అధిగమించి ప్రపంచంలో అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా అవతరించింది. మంగళవారం ట్రేడింగ్ నిలిచేసరికి ఎన్‌విడియా షేరు 2.9ు పెరిగి 139.93 డాలర్లకు చేరుకుంది. దాంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3.43 లక్షల కోట్ల డాలర్లకు ఎగబాకింది. కాగా, యాపిల్ మార్కెట్ క్యాప్ 3.38 కోట్ల డాలర్లకు పరిమితమైంది. బుధవారం ట్రేడింగ్‌లోనూ ఎన్‌విడియా షేరు ఒకదశలో 2.82ు లాభంలో 143.86డాలర్ల స్థాయిలో ట్రేడైంది. అప్పటికి మార్కెట్ క్యాప్ 3.53 లక్షల కోట్ల డాలర్లుగా నమోదైంది.
బిట్‌కాయిన్ @ : 75,000 డాలర్లు
ట్రంప్ విక్టరీ క్రిప్టో మార్కెట్లో జోష్ పెంచింది. బిట్‌కాయిన్ విలువ ఒకదశలో 8 శాతం మేర పెరిగి 75,384 డాలర్ల స్థాయిలో సరికొత్త ఆల్‌టైం రికార్డును నమోదు చేసింది. మిగతా వర్చువల్ కరెన్సీలైన ఈథర్, ఎక్స్‌ఆర్‌పీ, లైట్‌కాయిన్, డోజేకాయిన్, షీబాఇను కాయిన్ సైతం 4-9 శాతం మేర పుంజుకున్నాయి. గతంలో ట్రంప్ క్రిప్టో కరెన్సీలపై అయిష్టంగానే ఉన్నప్పటికీ, ఎన్నికల ముందు అనూహ్యంగా తన మనసు మార్చుకున్నారు. అమెరికాను క్రిప్టోల రాజధానిగా తీర్చిదిద్దుతానని, బిట్‌కాయిన్‌ల వ్యూహాత్మక నిల్వలను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. అంతేకాదు, ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు అవసరమైన విరాళాలను క్రిప్టోల్లోనూ స్వీకరించారు. ట్రంప్ సానుకూల వైఖరితో ఈ వర్చువల్ కరెన్సీల విలువ మున్ముందు మరింత పెరగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. బిట్‌కాయిన్ విలువ 1,00,000 డాలర్లకు చేరుకోవచ్చన్న అంచనాలున్నాయి.
సరికొత్త కనిష్ఠానికి రూపాయి
భారత కరెన్సీ విలువ సరికొత్త జీవనకాల కనిష్ఠ స్థాయికి పతనమైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఏకంగా 22 పైసలు క్షీణించి 84.31 వద్ద ముగిసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడం డాలర్‌కు భారీగా బలాన్ని చేకూర్చింది. దాంతో ఫారెక్స్ మార్కెట్లో డాలర్ విలువ గణనీయంగా పెరిగింది. యూఎస్ కరెన్సీతోపాటు ఆ దేశ బాండ్ల రిటర్నుల రేట్లు కూడా పుంజుకున్న నేపథ్యంలో మన మార్కెట్ నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు పెట్టుబడులను ఉపసంహరించుకోవడం కూడా రూపాయి విలువకు గండికొట్టిందని ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. స్వల్పకాలంపాటు రూపాయికి ప్రతికూలతలు తప్పకపోవచ్చని, డాలర్‌తో ఎక్స్ఛేంజ్ రేటు 84.10-84.40 స్థాయిలో ట్రేడయ్యే అవకాశాలున్నాయని వారు భావిస్తున్నారు.
Updated Date - Nov 07 , 2024 | 03:39 AM