యూనియన్ బ్యాంక్ లాభం రూ.4,720 కోట్లు
ABN, Publish Date - Oct 22 , 2024 | 12:57 AM
ప్రభుత్వ రంగంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ).. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జూలై-సెప్టెంబరు త్రైమాసికానికి గాను బ్యాంక్ నికర లాభం 34 శాతం వృద్ధి చెంది....
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ).. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జూలై-సెప్టెంబరు త్రైమాసికానికి గాను బ్యాంక్ నికర లాభం 34 శాతం వృద్ధి చెంది రూ.4,720 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.3,511 కోట్లుగా ఉంది. సమీక్షా త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం ఆదాయం కూడా రూ.28,282 కోట్ల నుంచి రూ.32,036 కోట్లకు పెరిగింది. ఈ కాలంలో బ్యాంక్ వడ్డీ ఆదాయం కూడా రూ.24,587 కోట్ల నుంచి రూ.26,708 కోట్లకు వృద్ధి చెందింది. అయితే నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) మాత్రం 0.87 శాతం క్షీణించి రూ.9,047 కోట్లుగా నమోదైంది. మరోవైపు నికర వడ్డీ మార్జిన్ (ఎన్‌ఐఎం) కూడా 3.18 శాతం నుంచి 2.9 శాతానికి తగ్గింది. కాగా స్థూల మొండి బకాయిలు (ఎన్‌పీఏ) 6.38 శాతం నుంచి 4.36 శాతానికి, నికర ఎన్‌పీఏ 1.30 శాతం నుంచి 0.98 శాతానికి తగ్గాయి. సెప్టెంబరు ముగిసే నాటికి బ్యాంక్ మొత్తం వ్యాపారం రూ.21,70,779 కోట్లుగా ఉంది.
Updated Date - Oct 22 , 2024 | 12:57 AM